Begin typing your search above and press return to search.

ఉచిత సలహాలు చెప్పమంటే మోడీ ఎన్నైనా చెప్తాడు

By:  Tupaki Desk   |   21 April 2021 4:30 AM GMT
ఉచిత సలహాలు చెప్పమంటే మోడీ ఎన్నైనా చెప్తాడు
X
ఏదైనా కొంపలు మునిగే వ్యవహారముంటేనే ప్రధాని నరేంద్రమోడీ వస్తాడని.. ఆ తర్వాత జాతినుద్దేశించి ప్రసంగిస్తాడని.. కానీ ఆ ప్రసంగంతో ఎవరికీ రూపాయి ప్రయోజనం ఉండదని ఇప్పటికే పలువురు సీఎంలు, మేధావులు ఆరోపించిన సంగతి తెలిసిందే. వారి ఆరోపణలకు తగ్గట్టే మోడీ ప్రసంగం చూస్తుంటే అదే అనిపిస్తోందన్న విమర్శలున్నాయి..

నిన్న కూడా ప్రధాని మోడీ దేశంలో కరోనా సెకండ్ వేవ్ వేళ స్పందించారు. దేశంలో కోవిడ్ విజృంభిస్తున్న వేళ కోవిడ్ రెండో దశపై మంగళవారం ప్రధానమంత్రి జాతిని ఉద్దేశించి మాట్లాడారు. అయితే మోడీ ప్రసంగం నుంచి ఏదైనా రాష్ట్రాలు, ప్రజలకు ప్యాకేజీ వస్తుందని అంతా ఆశించారు. కానీ అలాంటివేమీ లేకుండా పరిస్థితి చేయిదాటితే లాక్ డౌన్ విధిస్తామంటూ చావు కబురు చల్లగా వినిపించారని విమర్శలు వినిపిస్తున్నాయి.

ఈ క్రమంలోనే ప్రధాని మోడీ ప్రసంగంపై తాజాగా మహారాష్ట్ర ప్రభుత్వం అసంతృప్తి వ్యక్తం చేసింది. కరోనాను ఎదుర్కోవడానికి రాష్ట్రాలకు కేంద్రప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీ ఇస్తుందనుకుంటే మోడీ ఇంకేదో మాట్లాడారని మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ ఎద్దేవా చేశారు. మోడీ ప్రసంగంలో రాష్ట్రాలకు కేంద్రం సహకారం అందిస్తుందని ఆశించామని కానీ రూపాయి కూడా విదిల్చలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

లాక్ డౌన్ అనేది చివరి ఆప్షన్ అని మోడీ అన్నారని.. కానీ కోర్టులు ఏమో లాక్ డౌన్ విధించమంటూ రాష్ట్రాలకు ఆదేశాలు ఇస్తున్నాయని మంత్రి నవాబ్ మాలిక్ అన్నారు. ప్రభుత్వం నుంచి ప్రజలు ఉద్దీపన చర్యలు కోరుకుంటున్నారని అయినా మోడీ ఏం విదిల్చలేకపోయారని విమర్శించారు.

దేశంలో వలస కూలీలు, పేదలు, చిన్న వ్యాపారాలు చేసుకుంటున్న వారికి ప్యాకేజీ ప్రకటిస్తారని అనుకున్నామని.. కానీ ప్రధాని మోడీ ప్రసంగంలో అది కనిపించలేదని నవాబ్ మాలిక్ చెప్పుకొచ్చారు. ఉచిత సలహాలు ఎవరైనా ఇస్తారని.. మోడీ అదే చేస్తున్నారని.. కానీ ప్రజలకు సాయం చేసినప్పుడే అది ప్రభుత్వానికి, అధినేతలకైనా విలువ అని మంత్రి నవాబ్ దెప్పిపొడిచారు.