Begin typing your search above and press return to search.

'తక్కువ నష్టంతో కరోనా నుండి బయటపడాలి' సీఎంలకి మోదీ దిశానిర్దేశం!

By:  Tupaki Desk   |   2 April 2020 4:36 PM GMT
తక్కువ నష్టంతో కరోనా నుండి బయటపడాలి సీఎంలకి మోదీ దిశానిర్దేశం!
X
కరోనా వైరస్‌ ను దేశంలో అరికట్టడానికి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోదీ గురువారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ కాన్ఫరెన్స్‌ లో మోడీ మాట్లాడుతూ ..కరోనా కట్టడికి రాష్ట్రాలు తీసుకుంటున్న చర్యలు అభినందనీయమన్నారు. దేశంలో విధించిన లాక్‌ డౌన్‌ కారణంగా కరోనా వైరస్‌ వ్యాప్తి కట్టడి చేయడంలో విజయవంతం అయ్యామన్నారు. లాక్‌ డౌన్‌ ఎత్తివేసిన తర్వాత పరిస్థితులు నియంత్రించేందుకు రాష్ట్రాలన్నీ ఉమ్మడిగా వ్యూహాన్ని రచించాలని కోరారు.

అలాగే కరోనా మహమ్మారి నుండి వీలైనంత తక్కువ నష్టంతో ఈ సంక్షోభం నుంచి బయటపడాలన్నారు. సంక్షోభం నుంచి బయటపడే అంశాలకు సంబంధించి అన్ని రాష్ట్రాల సీఎంలు ధార్మిక సంస్థల నేతలతో చర్చించాలని చెప్పారు. రెండో దశలో కరోనా వైరస్‌ ఎక్కువగా విస్తరించే అవకాశం ఉందని అంతర్జాతీయ స్థాయిలో ఊహాగానాలు వినిపిస్తున్నాయన్నారు. కరోనా బాధితులను ఆదుకునేందుకు అవసరమైన ఆసుపత్రులు, మెడికల్‌ కిట్లు సమకూర్చుకోవాలని తెలిపారు. అలాగే ,పంట కోతల సమయం కనుక రైతులకు కొన్ని మినహాయింపులతో వారు పనులు చేసుకునేందుకు అవకాశం ఇవ్వాలని, వారిని గుంపులుగా చేరకుండా చూడాలని తెలిపారు.

అలాగే ఢిల్లీలోని నిజాముద్దీన్‌ మర్కజ్‌ ద్వారా కరోనా దేశంలో వేగంగా వ్యాపిస్తున్న తరుణంలో కేంద్రం తీసుకోవాల్సిన చర్యలపై పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రధాని మోదీకి పలు సూచనలు ఇచ్చారు. కరోనా వైరస్‌ హాట్‌ స్పాట్‌ లను గుర్తించి వాటిని ఎన్‌ సర్కిల్‌ చేయాలన్నారు. దేశంలో ఉన్న వలస కూలీలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని విన్నవించారు. భౌతిక దూరం ద్వారానే వైరస్‌ వ్యాప్తి కాకుండా చూడగలమని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఈ సందర్భంగా కేంద్రం ఇచ్చిన మార్గదర్శకాల మేరకు లాక్‌డౌన్‌ కఠినంగా అమలు చేయాలని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు సూచించారు. నిజాముద్దీన్‌ మర్కజ్‌ ఘటన ద్వారా కరోనా వైరస్‌ కేసులు పెరిగిపోతుండడంతో కేంద్రం తీసుకుంటున్న చర్యలను హోంశాఖ కార్యదర్శి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు వివరించారు. ఈ సమావేశంలో ఏపీ - తెలంగాణ ముఖ్యమంత్రులు కూడా పాల్గొన్నారు.