Begin typing your search above and press return to search.

మోదీ సిగలో మరో రికార్డు... అత్యధిక కాలం ప్రధానుల్లో నాలుగో స్థానం

By:  Tupaki Desk   |   13 Aug 2020 3:00 PM GMT
మోదీ సిగలో మరో రికార్డు... అత్యధిక కాలం ప్రధానుల్లో నాలుగో స్థానం
X
భారత ప్రధానిగా నరేంద్ర మోదీ గురువారం ఓ మైలురాయిని అందుకున్నారు. భారత ప్రధానిగా అత్యధిక కాలం సేవలందించిన వారిలో మోదీ నాలుగో నేతగా అరుదైన రికార్డు నెలకొల్పారు. అంతేకాదండోయ్... కాంగ్రెసేతర నేతల్లో అత్యధిక కాలం ప్రధానిగా వ్యవహరించిన నేతల్లో మోదీ టాప్ పొజిషన్ లోకి వచ్చేశారు. ఇప్పటిదాకా ఈ రికార్డు బీజేపీకే చెందిన మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి పేరున ఉండగా... గురువారం నాటితో వాజ్ పేయి రికార్డును బద్దలు కొట్టిన మోదీ... టాప్ పొజిషన్ లోకి వచ్చేశారు.

ఇక పార్టీల ప్రస్తావన లేకుండా అత్యధిక కాలం ప్రధానిగా వ్యవహరించిన నేతల్లో మోదీ ఏకంగా నాలుగో స్థానంలో కూర్చున్నారు. ఈ విషయంలో మోదీ కంటే ముందున్న వారిలో భారత తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ, ఆయన కూతురు ఇందిరా గాంధీ, కాంగ్రెస్ పార్టీకే చెందిన మన్మోహన్ సింగ్ లు ఉన్నారు. నిన్నటిదాకా ఈ ముగ్గురు నేతల తర్వాతి ప్లేస్ లో నిలిచిన వాజ్ పేయి విడతలవారీగా 2,268 రోజుల పాటు దేశానికి ప్రధానిగా వ్యవహరించారు. గురువారం నాటితో వాజ్ పేయి మార్కును దాటేసిన మోదీ... దేశానికి అత్యధిక కాలం ప్రధానిగా వ్యవహరించిన వ్యక్తుల్లో నాలుగో వ్యక్తిగా రికార్డు పుటల్లోకి ఎక్కారు.

దేశానికి 14వ ప్రధానమంత్రిగా 2014 మే 26న ప్రమాణస్వీకారం చేసిన మోదీ... 2019, మే 30న రెండోసారి ప్రధానిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. ఇదిలా ఉంటే.. ఈ విషయంలో మోదీ కంటే ముందున్న వారు ఎన్ని రోజుల పాటు ప్రధానిగా వ్యవహరించారన్న విషయానికి వస్తే... భారత తొలి ప్రధానమంత్రి జవహర్‌లాల్‌ నెహ్రూ 17 ఏళ్ల పాటు ప్రధానిగా వ్యవహరించారు. ఈ తర్వాత పలుమార్లు ప్రధానిగా గద్దెనెక్కిన నెహ్రూ కుమార్తె ఇందిరా గాంధీ 16 ఏళ్ల పాటు ప్రధానిగా కొనసాగారు. ఆపై మన్మోహన్‌ సింగ్‌ పదేళ్ల పాటు ప్రధానమంత్రి బాధ్యతలను చేపట్టారు. ఇదిలా ఉంటే నెహ్రూ తర్వాత ఐదేళ్ల పదవీకాలం పూర్తయిన అనంతరం తిరిగి వరుసగా మరోసారి ప్రధానమంత్రి బాధ్యతలు చేపట్టింది మన్మోహన్‌ సింగ్‌, నరేంద్ర మోదీలే కావడం గమనార్హం.