ఏపీలో మోడీ మరో పంచ్.. రెండేళ్లకు విశాఖ రైల్వే జోన్ కు చిల్లర కేటాయింపులు

Mon Mar 01 2021 11:00:01 GMT+0530 (IST)

Modi another punch in AP

ఏపీ మీద మోడీ సర్కారుకు ఎందుకంత పగ? అన్న ప్రశ్నను పలువురు సంధిస్తుంటారు. ప్రశ్న వేయటమే కానీ.. దానికి తగిన సమాధానాన్ని ఇప్పటివరకు చెప్పినోళ్లు లేరు. ఏపీలో మోడీకి ఎలాంటి పంచాయితీ లేదు. ఆ మాటకు వస్తే.. మోడీని ఆంధ్రా ప్రాంత వాసులు కానీ.. ఆంధ్రా నేతలు కానీ టార్గెట్ చేసింది లేదు. ఒకవేళ.. ఆయన ప్రాతినిధ్యం వహించే గుజరాతీల విషయంలో ఏమైనా చిన్నచూపు చూశారా? అంటే అదీ లేదనే చెప్పాలి. రెండు తెలుగు రాష్ట్రాల్లోని వ్యాపార కేంద్రాల్లో గుజరాతీయులకు ఇచ్చే గౌరవ మర్యాదలకు ఏ మాత్రం లోటు కనిపించదు. ఈ లెక్కన ఏ యాంగిల్ లో చూసినా ఏపీ విషయంలో మోడీ సర్కారు పట్టనట్లుగా ఉండటానికి తగిన కారణాలు కనిపించవు.విభజన చట్టంలో భాగంగా భారీగా దెబ్బ తిన్న ఏపీకి సాంత్వన కలిగించేందుకు వీలుగా ప్రత్యేక హోదా.. విశాఖకు ప్రత్యేక రైల్వే జోన్ ఇలా కొన్ని వరాల్ని ప్రకటించారు. అందులో ఏ ఒక్కటి ఆచరణలోకి వచ్చినట్లు కనిపించదు. ప్రత్యేక హోదా హామీ అమలుకు భారీ ఎత్తున నిధులు అవసరమవుతాయని అనుకుందాం. దాన్ని పక్కన పెట్టేస్తే.. విశాఖకు ప్రత్యేక రైల్వే జోన్ ఏర్పాటుకు వేలాది కోట్లు అవసరం ఉండదు. చాలా తక్కువలోనే పూర్తి అవుతుంది.

కానీ.. విశాఖ జోన్ ఏర్పాటుకు మోడీ సర్కారు ఎన్ని ఏళ్లు సాగదీసిందో తెలిసిందే. రెండేళ్ల క్రితం జోన్ కు ఓకే చెప్పిన కేంద్రం.. అందుకు అవసరమైన రూ.200 కోట్ల కేటాయింపులకు చేస్తున్నతాత్సర్యం చూస్తే.. ఈ ప్రాజెక్టు పూర్తి కావటానికి మరో మూడు నాలుగేళ్లు పట్టినా ఆశ్చర్యం లేదు. వేలాది కోట్ల రూపాయిల్నిసంక్షేమ కార్యక్రమాల కోసం ఖర్చు చేసే ప్రభుత్వాలు.. ఒక ప్రాంతం బాగు పడిపోవటానికి అవసరమైన వందల కోట్లను ఇవ్వటానికి కిందామీదా పడిపోయే తీరును ఏమనాలి? ఎలా చూడాలి?

విశాఖ రైల్వే జోన్ కు కనీసం రూ.200 కోట్లు అవసరమైతే.. గడిచిన రెండు బడ్జెట్లలో వాటికి చేసిన కేటాయింపులు చూస్తే.. ఈ ప్రాజెక్టు విషయంలో మోడీ సర్కారు ప్రాధాన్యత ఏమిటన్నది ఇట్టే అర్థమవుతుంది. తొలి సంవత్సరం రూ.3కోట్లను కేటాయించిన కేంద్రం.. తాజా బడ్జెట్ లో రూ.41 లక్షలు కేటాయించిన తీరు చూస్తేనే.. ఈ ప్రాజెక్టు పూర్తిచేసే విషయంలో కేంద్రానికి ఉన్న కమిట్ మెంట్ ఏపాటిదన్న విషయం అర్థమవుతుంది. ఇలానే సాగదీస్తే.. 2024 నాటికి కూడా విశాఖ రైల్వే జోన్ కల సాకారం కాదని చెప్పకతప్పదు. ఇదంతా సరే కానీ.. ఏపీ విషయంలో మోడీ సర్కారు ఎందుకంత కఠినంగా ఉంటారంటారు?