మోడీ - కేసీఆర్ లు ఇద్దరు జనాల్ని పిచ్చోళ్లను చేస్తున్నారా?

Sun May 29 2022 06:00:01 GMT+0530 (IST)

Modi and KCR news update

ఒకరిపై ఒకరు విమర్శలు సంధించుకుంటారు. విధానాల పరంగా ఇద్దరిది చెరో దారి అన్నట్లుగా చెప్పటమే కాదు చేతల్లో కూడా చూపించేస్తుంటారు. నిన్ను చూసేందుకు అస్సలు ఇష్టం లేదన్నట్లుగా ప్రధాని మోడీ విషయంలో వ్యవహరించే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు మరింత ఇరిటేట్ కలిగించేలా.. వరుస పెట్టి రాష్ట్రానికి వస్తున్న ప్రధాని మోడీ తీరు ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ ఇద్దరు అధినేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవటం.. వారి ప్రభుత్వాలపై ఆరోపణలు చేసుకోవటం కనిపిస్తుంది.అవినీతి విషయంలో ఇప్పటివరకు బలమైన మరక లేని మోడీ సర్కారు తీరును టీఆర్ఎస్ తప్పు పడుతోంది. అదే సమయంలో గతంలో క్లీన్ చిట్ ఇచ్చిన కేసీఆర్ సర్కారు మీద ఇటీవలకాలంలో మోడీషాలు అదే పనిగా ఆరపణలు చేస్తున్నారు.

కొత్త సందేహాలకు తావిచ్చేలా వారి మధ్య ఫైటింగ్ నడుస్తోంది. ఢిల్లీ కోటలు బద్ధలు కొడతాం.. కడిగిపారేస్తాం.. ఏకిపారేస్తాం.. అంటూ విరుచుకుపడే కేసీఆర్.. తీరా రాష్ట్రానికి వచ్చిన మోడీని కలవరు. నిజంగా తన దమ్ము చూపించాలని కేసీఆర్ డిసైడ్ అయితే.. ఆయనతో పాటు వేదిక పంచుకొని కేంద్రం కారణంగా తెలంగాణ ఎంత నష్టపోతుందన్న విషయాన్ని ఎందుకు చెప్పరు?

ఒకవేళ అలా చేస్తే.. ప్రధాని మోడీ ఇరుకునపడటమే కాదు.. కేసీఆర్ సంధించిన అంశాలకు సమాధానాలు చెప్పాల్సి వస్తుంది. అదే జరిగితే.. అంతకు మించిన విజయం ఏముంటుంది? మోడీ వస్తున్నారంటే చాలు.. అయితే ఫాం హౌస్ నుంచి బయటకు రాకపోవటం.. లేదంటే వేరే రాష్ట్రానికి వెళుతున్న కేసీఆర్.. అందుకు భిన్నంగా బరాబర్.. అడగాల్సింది అడిగేస్తామని ఎందుకు అడగటం లేదు? అన్నది ప్రశ్న. కేసీఆర్ సర్కారు అవినీతికి పాల్పడుతుందని చెప్పే మోడీషాలు.. అందుకు ఆధారాలు ఉంటే ఎందుకు బయటపెట్టరు?

అంతదాకా ఎందుకు.. కేసీఆర్ చిట్టా మొత్తం తన వద్ద ఉందని చెప్పే తెలంగాణ బీజేపీ బాధ్యులు బండి సంజయ్.. ఆ మధ్యన కేసీఆర్ ను జైలుకు పంపుతానని చెప్పటం తెలిసిందే.

నిజంగానే అవినీతి ఆధారాలు ఉంటే.. వాటిని బయట పెట్టాలే కానీ.. ఉత్తగా అదే పనిగా మాటలు చెప్పుడే తప్పించి.. ఇంకేమీ చేయని తీరు చూస్తే.. ఈ రెండు పార్టీలు జనాల్ని పిచ్చోళ్లను చేస్తున్నాయన్న భావనను పలువురు వ్యక్తం చేస్తున్నారు.