మోడీ.. మరో సోనియాగాంధీగా మారినట్టేనా?

Mon Apr 22 2019 20:00:01 GMT+0530 (IST)

Modi Turns As Sonia Gandhi

గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మరీ అంత చిత్తుగా ఓడిపోవడానికి చెప్పుకోదగిన కారణాల్లో ఆ పార్టీపై వచ్చిన తీవ్ర స్థాయి అవినీతి ఆరోపణలకు తోడు.. సోనియాగాంధీ వ్యవహరణ తీరు రెండో కారణం అయ్యింది. కాంగ్రెస్ హయాంలో అవినీతి జరిగితే ఆ పార్టీ హయాంలోనే అవి  బయటపడ్డాయి కాబట్టి జనాలు కొద్దో గొప్పో ఓపిక పట్టే వారేమో. కాంగ్రెస్ ను ఓడించాలని నిర్ణయించుకున్నా మరీ అంత చిత్తుగా ఓడించేవారు కాదేమో. అయితే సోనియాగాంధీ ఒక నియంతలా వ్యవహరించారు.తనను రాజకీయంగా వ్యతిరేకించిన వారిపై సీబీఐని ఉసిగొల్పడం - ఈడీని ప్రయోగించడం  వంటి చర్యలకు పాల్పడ్డారు ఆమె. అలాంటి కక్ష సాధింపు చర్యలే కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడించాయి. ప్రత్యర్థులపై సోనియాగాంధీ వ్యవహరించిన తీరు ను ప్రజలు కూడా హర్షించలేదు. దీంతో కాంగ్రెస్ కు మరిన్ని సీట్లు తగ్గిపోయాయి.

అలాంటి కక్ష సాధింపు చర్యల విషయంలో మోడీ కూడా తీసిపోవడం లేదని స్పష్టం అవుతూ ఉంది. వ్యవస్థలను చేతిలో పెట్టుకుని వాటిని ప్రయోగించడంలో ఈ సారి  సోనియాగాంధీని గుర్తు చేస్తున్నాడని అనిపించుకుంటున్నారు మోడీ. సోనియాగాంధీతో విబేధించినట్టుగానే పలువురు రాజకీయ నేతలు మోడీతో కూడా విబేధించారు. విబేధిస్తూ ఉన్నారు. అలాంటి వారి పరిస్థితి ఏమిటో అర్థం అవుతూనే ఉంది.

వారి హెలీకాప్టర్లను చెక్ చేస్తున్నారు. వారి ఇళ్లపై ఐటీదాడులు జరుగుతూ ఉన్నాయి.  దేశ వ్యాప్తంగా ఇలాంటి పరిస్థితి నెలకొంది. రాజకీయ నేతలపై ఐటీ దాడులు చేయకూడదని అనడం లేదు. అలా చేయడం మొదలుపెడితే అన్ని పార్టీల వాళ్ల మీదా అలాంటి రైడ్స్ జరిగితే  అప్పుడు మోడీని  అభినందించవచ్చు. అలా కాకుండా.. కేవలం తనకు వ్యతిరేకుల మీదే మోడీ ప్రభుత్వ వ్యవస్థలను ప్రయోగిస్తున్నారనే ప్రచారం మోడీకే మంచిది కాదు.

ఇలాంటి తీరుతోనే గత ఎన్నికల్లో కాంగ్రెస్ చిత్తు అయ్యింది. ఆ తర్వాత రాహుల్ గాంధీ పరిస్థితి ఏమిటో అంతా చూస్తూనే ఉన్నారు. సోనియానే అలాంటి పరిస్థితికి కారణం అయ్యింది. ఇప్పుడు మోడీని సోనియా ఆవహించినట్టుగా ఉంది. అధికారంలో ఎవరున్నా వారు అలానే ఫీలవుతారేమో! అధికారం అనే మత్తు దిగితే కానీ ఈ నేతలకు అసలు విషయాలు అర్థం కావు!