Begin typing your search above and press return to search.

దీదీతో భేటీకి ఓకే చెప్పిన మోడీ.. కేసీఆర్ కు నో చెప్పటమా?

By:  Tupaki Desk   |   25 Nov 2021 5:30 AM GMT
దీదీతో భేటీకి ఓకే చెప్పిన మోడీ.. కేసీఆర్ కు నో చెప్పటమా?
X
దేశ రాజధాని ఢిల్లీలో ఆసక్తికర రాజకీయ పరిణామం చోటు చేసుకుంది. యాసంగి ధాన్యం కొనుగోలు విషయానికి సంబంధించి స్పష్టత కోసం ఢిల్లీ వెళ్లిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్.. తిరిగి వచ్చేశారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీతో పాటు.. పలువురు కేంద్రమంత్రుల్ని కలుస్తామని.. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పోరాడిన వారిని కలుస్తామన్న ఆయన.. అలాంటిదేమీ చేయకుండానే హైదారబాద్ కు వచ్చేశారు. అన్నింటికి మించి.. ప్రధాని మోడీ అపాయింట్ మెంట్ కోసం ఎంతలా ప్రయత్నించినా.. ఫలితం రాకపోవటంతో ఆయన రాష్ట్రానికి తిరిగి వచ్చేసినట్లుగా చెబుతున్నారు.

ఆసక్తికరమైన విషయం ఏమంటే.. మోడీ అపాయింట్ మెంట్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి లభించలేదు కానీ.. పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి లభించటం విశేషం. మరింత షాకింగ్ అంశం ఏమంటే.. దీదీతో భేటీకి టైమిచ్చిన నేపథ్యంలో సీఎం కేసీఆర్ ను కలిసే అవకాశం లేదన్న మాటను చెప్పటం. ఒక ముఖ్యమంత్రితో ఎంతసేపు మాట్లాడతారు? మహా అయితే అరగంట నుంచి గంటన్నరకు మించి మాట్లాడే అవకాశం లేదు. అలాంటప్పుుడు ఢిల్లీలో ఇన్ని రోజులు వెయిట్ చేసిన తర్వాత కూడా సీఎం కేసీఆర్ కు అపాయింట్ మెంట్ లభించకపోవటం అంటే.. కచ్ఛితంగా రాజకీయ కారణాలే కీలకభూమిక పోషించి ఉంటాయని చెప్పక తప్పదు.

ఆదివారం సాయంత్రం ఢిల్లీకి వెళ్లి ముఖ్యమంత్రి కేసీఆర్.. బుధవారం సాయంత్రం హైదరాబాద్ కు తిరిగి వచ్చేశారు.అంటే.. రెండున్నర రోజులు ఢిల్లీలో ఉన్నారు. యాసంగిలో వచ్చే ధాన్యం కొనుగోలు లెక్క తేలే వరకు ఢిల్లీలో ఉంటానని చెప్పిన ఆయన.. రెండున్న రోజులకు తిరిగి వచ్చేయటం గమనార్హం. దీనికి టీఆర్ఎస్ వర్గాలు వినిపిస్తున్న వాదన ఏమంటే.. ఢిల్లీలో ఎన్ని రోజులు ఉన్నా.. ప్రధాని మోడీ అపాయింట్ మెంట్ ఇప్పట్లో లభించే అవకాశం లేదని చెబుతున్నారు.

ఎందుకంటే.. ఈ నెల 29 నుంచి పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో ప్రధానితో భేటీకి ఇప్పట్లో కుదరకపోవచ్చని.. అందుకే హైదరాబాద్ కు తిరిగి వచ్చేసినట్లుగా చెబుతున్నారు. ఏమైనా.. బెంగాల్ రాష్ట్ర ముఖ్యమంత్రి దీదీతో భేటీకి ఓకే చెప్పిన ప్రధాని మోడీ.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు టైం ఇవ్వకపోవటానికి కారణం.. రాజకీయమే తప్పించి మరింకేమీ లేదంటున్నారు. రాష్ట్రంలో తమపార్టీ నేతల్ని అదే పనిగా మాటలతో ఆడుకుంటూ.. ఢిల్లీకి వచ్చిన సీఎంను సాదరంగా ఆహ్వానించి.. ఆయనకు మర్యాద చేయాలని కేంద్రంభావించటం లేదన్న విషయాన్ని తాజా పర్యటన సందర్భంగా స్పష్టం చేశారని చెప్పాలి.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. ప్రధాని మోడీ తో భేటీ తర్వాత.. భేటీ సందర్భంగా తాను సలహాలు ఇచ్చానని.. ఫలానా విషయాల్ని ప్రస్తావించానని తరచూకేసీఆర్ చెప్పుకోవటం.. తన వ్యక్తిగత ఇమేజ్ ను పెంచుకోవటానికి ఉపయోగించుకుంటున్న వైనాన్ని గుర్తించిన బీజేపీ అధినాయకత్వం కావాలనే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి అపాయింట్ మెంట్ ఇవ్వలేదన్న మాట వినిపిస్తోంది. మరి.. దీనిపై సీఎం కేసీఆర్ ఏ రీతిలో రియాక్టు అవుతారో చూడాలి.