Begin typing your search above and press return to search.

ఉగ్ర కార్యకలాపాల ఆరోపణలపై 'పీఎఫ్ఐ'ను బ్యాన్ చేసిన మోడీ సర్కారు

By:  Tupaki Desk   |   28 Sep 2022 6:30 AM GMT
ఉగ్ర కార్యకలాపాల ఆరోపణలపై పీఎఫ్ఐను బ్యాన్ చేసిన మోడీ సర్కారు
X
అంచనాలు నిజమయ్యాయి. గడిచిన కొద్ది రోజులుగా ఉగ్ర కార్యకలాపాలపై చురుకుగా వ్యవహరిస్తూ.. దేశంలో అశాంతిని క్రియేట్ చేసేందుకు ప్లాన్ చేస్తుందన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా పొట్టిగా చెప్పాలంటే పీఎఫ్ఐను దాని అనుబంధ సంస్థలపై ఐదేళ్ల పాటు నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకున్నట్లుగా పేర్కొంటూ కేంద్రంలోని మోడీ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. పీఎఫ్ఐ.. దాని అనుబంధ సంస్థలపైనా నిషేధాన్ని విధిస్తూ నిర్ణయాన్ని ప్రకటించటమే కాదు.. ఈ ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది.

ఆసక్తికరమైన విషయం ఏమంటే.. జపాన్ మాజీ ప్రధాని షింజో అబే అంత్యక్రియలకు హాజరు కావటానికి వెళ్లిన ప్రధాని నరేంద్ర మోడీ దేశానికి తిరిగి వచ్చిన నిమిషాల వ్యవధిలోనే బ్యాన్ విధిస్తూ నిర్ణయం తీసుకోవటం ప్రాధాన్యతను సంతరించుకుంది. దసరా ఉత్సవాల సందర్భంగా దేశంలోని పలు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున అల్లర్లకు కుట్ర చేసినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. తాజా నిషేధంతో పీఎఫ్ఐ బ్యానర్ కింద ఎలాంటి చర్యలు చేపట్టినా అవన్నీ చట్ట విరుద్ధమే అవుతాయి.

ఇటీవలే జాతీయ దర్యాప్తు సంస్థ దేశ వ్యాప్తంగా ఏకకాలంలో 15 రాష్ట్రాల్లో ఈ సంస్థ కార్యాలయాల్లో సోదాలు నిర్వహించటం.. ఆ సందర్భంగా అనుమానాస్పద కార్యకలాపాల్ని గుర్తించినట్లుగా చెబుతున్నారు. ఉగ్రవాద కార్యకలాపాలకు నిధులు అందించటంతో పాటు యువతకు శిక్షణ ఇస్తున్నారన్న ఆరోపణలపై పీఎఫ్ఐ ఆఫీసులపై పెద్ద ఎత్తున ఆపరేషన్ నిర్వహించారు. ఇటీవల పట్నాలో మోడీ హత్యకు కూడా కుట్ర చేసినట్లుగా చెబుతున్నారు.

ఇటీవల చేపట్టిన తనిఖీల సందర్భంగా పెద్ద ఎత్తున అరెస్టుల్ని నిర్వహించారు. తెలంగాణ.. కర్ణాటక.. కేరళ రాష్ట్రాల్లో అరెస్టులతో పాటు.. ఢిల్లీ.. ఉత్తరప్రదేవ్.. బిహార్ రాష్ట్రాల్లోనూ దీని కార్యకలాపాలు జోరుగా సాగుతున్నట్లుగా తెలుస్తోంది. ఇంతకూ ఈ పీఎఫ్ఐ ఎవరు? దీని వెనుక ఉన్నది ఎవరు? వీరి లక్ష్యం ఏమిటి? దేని కోసం దీన్ని ఏర్పాటు చేశారు? లాంటి ప్రశ్నలకు సమాధానాలు వెతికితే..
ఈ సంస్థను 2006 నవంబరు 22న ఏర్పాటు చేశారు. ముస్లింల రాజకీయ పునరేకీకరణ కోసం ఈ సంస్థను ఏర్పాటు చేసినట్లుగా పేర్కొంటారు. హిందూ జాతీయవాదాన్ని వ్యతిరేకించే ఈ సంస్థ ప్రధాన కార్యాలయం ఢిల్లీలో ఉంది. దీని ఛైర్మన్ గా ఓమా అబ్దుల్ సలామ్ వ్యవహరిస్తుంటే.. వైస్ ఛైర్మన్ గా అబ్దుల్ రహిమాన్ ఉన్నారు. ప్రధాన కార్యదర్శిగా అనీస్ అహ్మద్ వ్యవహరిస్తున్నారు.

పీఎఫ్ఐను ప్రారంభించిన సమయంలో మైనార్టీలు.. దళితులు.. అణగారిన వర్గాల హక్కుల కోసం పోరాటమే తమ లక్ష్యంగా ప్రకటించుకుంది. అయితే.. ఇది నిషేధిత సిమికి మారురూపమే అంటూ 2012లో అప్పటి కేరళ సీఎం ఊమెన్ చాందీ సారథ్యంలో కాంగ్రెస్ సర్కారు హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది.

ఇదిలా ఉంటే.. ఈ సంస్థ ఎప్పుడూ నేరుగా ఎన్నికల్లో పాల్గొనదు. కానీ.. 2009లో మాత్రం తమ సంస్థకు అనుబంధంగా ఉండే సోషల్ డెమొక్రాటిక్ పార్టీ ఆఫ్ ఇండియా (ఎస్ డీపీఐ) రాజకీయ పార్టీని ఏర్పాటు చేసింది. తమ లక్ష్యానికి అనుగుణంగా రాజకీయంగా ఎస్ డీపీఐ ముందు ఉంటుంది.దాని వెనుక పీఎఫ్ఐ పని చేస్తూ ఉంటుంది. ముస్లింలు ఎక్కువగా ఉండే ప్రాంతాల మీద ఈ సంస్థలు ఫోకస్ చేశాయి. దక్షిణ కోస్తా కర్ణాటక ప్రాంతాల్లోని స్థానిక సంస్థల ఎన్నికలతో తమ ప్రభావాన్ని చూపటం మొదలు పెట్టాయి. ఇందులో భాగంగా 2013లో 21 స్థానిక సంస్థల సీట్లను సొంతం చేసుకున్న ఎస్ డీపీఐ ఆ తర్వాత తన అధిక్యతను 121కు పెంచుకోవటం చూస్తే.. దీని ప్రభావం ఎంతన్న విషయం ఇట్టే అర్థం చేసుకోవచ్చు. 2013 పార్లమెంటు.. అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగింది.

మత మార్పిడులు.. సమస్యలకు మతరంగు పులమటం.. తమకు రాజకీయంగా వ్యతిరేకులైన వారిని అంతం చేసేందుకు వీలుగా యువతను రెచ్చగొట్టటం.. వారిని రిక్రూట్ చేయటం.. ఉగ్రవాద సంస్థల్లో చేరేలా ట్రైనింగ్ ఇవ్వటం లాంటి ఆరోపణల మీద కేసులు నమోదయ్యాయి. కర్ణాటకలో ఈ సంస్థపై 300లకు పైగా కేసులు నమోదయ్యాయి. తాజాగా ఈ సంస్థ మీద ఏకంగా నిషేధమే విధించిన పరిస్థితి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.