Begin typing your search above and press return to search.

మోడీ దెబ్బ‌కు బీజేపీ-టీడీపీ అన్నీ ఫుల్ సైలెంట్‌!

By:  Tupaki Desk   |   22 Sep 2020 12:30 AM GMT
మోడీ దెబ్బ‌కు బీజేపీ-టీడీపీ అన్నీ ఫుల్ సైలెంట్‌!
X
నిన్న మొన్న‌టి వ‌ర‌కు రాష్ట్ర ప్ర‌భుత్వంపై తీవ్ర‌స్థాయిలో యుద్ధం చేసిన బీజేపీ స్థానిక నేత‌లు, టీడీపీ నాయ‌కులు.. ఒక్క‌సారిగా సైలెంట్ అయి పోయే ప‌రిస్థితి వ‌చ్చింది. ఇక‌, జ‌గ‌న్ స‌ర్కారుపై ఏ ఒక్క‌మాటా అనే ప‌రిస్థితి లేకుండా పోయింది. దీనికి కార‌ణం ఏంటి? గ‌్రౌండ్ లెవిల్లో జ‌రిగింది ఏంటి? అనే విష‌యాలు తెలుసుకునేందుకు ఒకింత నాలుగు నెల‌లుగా జ‌రుగుతున్న ప‌రిణామాల‌ను తెలుసుకోవాలి. ఈ ఏడాది మార్చి నుంచి దేశ‌వ్యాప్తంగా లాక్‌డౌన్ జ‌రిగింది. క‌రోనా నేప‌థ్యంలో వైర‌స్ క‌ట్ట‌డికి. కేంద్రం ఇచ్చిన పిలుపుమేర‌కు లాక్‌డౌన్‌ను నిర్వ‌హించ‌రు.

ఈ స‌మ‌యంలో పేద‌ ప్ర‌జ‌ల‌కు ప‌ప్పు, ఉప్పు వంటివి ఇంటికే స‌ర‌ఫ‌రా చేశారు. ఇక‌, ఏపీలో అయితే.. ప్ర‌భుత్వం రూ.వెయ్యిని పేద‌ల‌కు ఇంటింటికీ పంచింది. అదేస‌మ‌యంలో క‌రోనా ప‌రీక్ష‌ల‌ను కూడా జ‌గ‌న్ స‌ర్కారు పెంచింది. ఇక‌, క‌రోనా నివార‌ణ‌లో ప్ర‌థ‌మ చ‌ర్య‌గా.. మాస్కులు ధ‌రించాల‌న్న కేంద్రం సూచ‌న‌ల మేర‌కు రాష్ట్రంలో ప్ర‌తి ఇంటికీ ఒక్కొక్క వ్య‌క్తికీ మూడు మాస్కులు చొప్పున పంపిణీ చేశారు. నెల‌కు రెండు సార్లు బియ్యం... ఇత‌ర వ‌స్తువుల‌ను పంపిణీ చేశారు. అయితే, ఈ ప‌రిణామాలు జ‌గ‌న్ స‌ర్కారుకు మేలు చేకూర్చేలా మారాయ‌న‌డంలో సందేహం లేదు.

పేద‌లు, గ్రామీణుల్లో జ‌గ‌న్ స‌ర్కారు చేప‌ట్టిన ఈ ప‌నులు.. ఆయ‌న‌కు మంచి మార్కులు వేసేలా చేశాయి. ఇక‌, న‌గ‌రాల్లోనూ క‌రోనా టెస్టులు పెంచ‌డం వంటివి కూడా జ‌గ‌న్‌కు మంచి ప‌రిణామంగా మారింది. మ‌రి ఇలా జ‌గ‌న్ దూసుకుపోతే.. ప్ర‌తిప‌క్షాలు ఊరుకుంటాయా.. ఖ‌చ్చితంగా ఎదురుదాడి చేస్తాయి. ఈ క్ర‌మంలోనే రాష్ట్ర బీజేపీ నాయ‌కులు.. టీడీపీ మేధావులు.. జ‌గ‌న్ స‌ర్కారుపై దుమ్మెత్తి పోశాయి. జ‌గ‌న్ చేసిన ఈ ప‌నుల‌న్నీ కేంద్రం ఇచ్చిన నిధుల‌తోనేన‌ని, కేంద్రం వేలాది కోట్లు ఇచ్చింద‌ని ప్ర‌చారం చేయ‌డం ప్రారంభించారు.

అంతేకాదు, కేంద్రం భారీగా ఇచ్చిన ఈ నిధుల‌ను జ‌గ‌న్ విచ్చ‌ల‌విడిగా సొంతానికి ఖ‌ర్చు పెట్టుకున్నార‌ని కూడా టీడీపీ నేత‌లు ఆరోపించారు. ఇదే విష‌యాన్ని ఇటీవ‌ల పార్ల‌మెంటులోనూ ప్ర‌స్తావించారు. దీంతో నిజంగానే జ‌గ‌న్ ఏమీ చేయ‌లేదేమో.. కేంద్ర‌మే బోలెడ‌న్ని నిధులు ఇచ్చేసిందేమో.. అనుకున్నారు ఓ వ‌ర్గం ప్ర‌జ‌లు. అయితే, టీడీపీ, బీజేపీ రాష్ట్ర నేత‌ల‌కు ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ షాకిచ్చారు. ఏపీకి క‌రోనా నియంత్ర‌ణ‌, నివార‌ణ కోసం సుమారుగా 200 కోట్ల‌లోపు నిధుల‌ను మాత్ర‌మే ఇచ్చిన‌ట్టు కేంద్ర మంత్రి పార్ల‌మెంటులో బాంబు పేల్చారు. అంటే.. ఇప్ప‌టి వ‌ర‌కు జ‌గ‌న్ ఖ‌ర్చు చేసిన మొత్తం కూడా రాష్ట్ర నిధులే త‌ప్ప .. ప్ర‌తిప‌క్షాలు ఆరోపించిన‌ట్టు కేంద్రం ఇచ్చిన‌వి కాద‌న్న‌మాట‌. ఈ విష‌యం కేంద్రం స్ప‌ష్టం చేయ‌డంతో టీడీపీ, బీజేపీ నేత‌లు అవాక్క‌య్యారు. ఇక‌, ఈ విష‌యంపై ఫుల్ సైలెంట్ అయిపోయార‌న్న‌మాట‌!