Begin typing your search above and press return to search.

అమెరికా పర్యటనలో మోడీ-బైడెన్ కు మధ్య చర్చకు వచ్చిన అంశాలివే

By:  Tupaki Desk   |   25 Sep 2021 7:30 AM GMT
అమెరికా పర్యటనలో మోడీ-బైడెన్ కు మధ్య చర్చకు వచ్చిన అంశాలివే
X
అమెరికా పర్యటనకు వెళ్లిన భారత ప్రధాని నరేంద్ర మోడీకి సాదర స్వాగతం లభించటం.. గడిచిన రెండు రోజులుగా ఆయన బిజీబిజీగా ఉండటం.. భారతకాలమానం ప్రకారం శుక్రవారం ఆయన అమెరికా దేశాధ్యక్షుడు జో బైడెన్ తోనూ.. ఉపాధ్యక్షురాలు.. భారత సంతతికి చెందిన కమలా హారీస్ తో పాటు పలువురు ప్రముఖులతో భేటీ కావటం.. చర్చలు జరపటం తెలిసిందే.

వైట్ హౌస్ కు వచ్చిన మోడీని బైడెన్ స్వయంగా తోడ్కొని ఓవల్ ఆఫీసుకు తీసుకెళ్లారు. దైపాక్షిక వ్యాపార సంబంధాలు.. వాతావరణమార్పులు.. కరోనాకు సంబంధించిన అంశాలు వీరి మధ్య చర్చకు వచ్చాయి. ఈ దశాబ్దంలో వ్యాపార రంగం చాలా కీలకమైనదని.. ఈ రంగంలో భారత్.. అమెరికాలు ఇచ్చి పుచ్చుకోవాల్సిన అంశాలు చాలానే ఉన్నట్లు మోడీ పేర్కొనగా.. ఎన్నో ప్రపంచ సమస్యలకు పరిష్కారం చూపటంలో భారత్ - అమెరికా సంబంధాలు సాయం చేస్తాయని బైడెన్ వ్యాఖ్యానించారు. అమెరికా ఉపాధ్యక్షుడి హోదాలో తాను గతంలో భారత్ కు వచ్చిన విషయాన్ని ఆయన గర్తు చేసుకున్నారు.

భారత ప్రధాని మోడీతో తాను చర్చలు జరపనున్నట్లుగా.. వైట్ హౌస్ కు ఆహ్వానిస్తున్నట్లుగా వీరి భేటీకి ముందు బైడెన్ ట్వీట్ చేశారు. రెండు దేశాల మధ్య బలమైన సంబంధాలు కావాలని తాను కోరుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు. పలు రంగాల్లో కలిసి పని చేయాలని కోరుకుంటున్న విషయాన్ని ఆయన తెలిపారు.

మోడీ.. బైడెన్ మధ్య ప్రస్తావనకు వచ్చిన అంశాలు. అందులో బైడెన్ చేసిన వ్యాఖ్యలు చూస్తే..

- భారత్‌-అమెరికా సంబంధాల్లో కొత్త అధ్యాయం మొదలైందని.. నలభై లక్షల మంది భారతీయ అమెరికన్లు అమెరికాను నిత్యం బలోపేతం చేస్తున్నారు.

- భారత్‌-అమెరికా బంధం పలు అంతర్జాతీయ సవాళ్లను పరిష్కరించడానికి తోడ్పడుతుందని చాలా కాలంగా నేను విశ్వసిస్తున్నా.

- 2020నాటికి అమెరికా-భారత్‌ ప్రపంచంలోనే అత్యంత సన్నిహిత దేశాలుగా ఉంటాయని నేను 2006లోనే చెప్పాను.

- రెండు అతిపెద్ద ప్రజాస్వామ్యదేశాలైన భారత్‌, అమెరికా మధ్య సంబంధాలు మరింత సన్నిహితం, దృఢతరం, బలోపేతం కాబోతున్నాయి.

- మీరు నాకు చాలా కాలంగా తెలుసు. మీరు శ్వేతసౌధానికి తిరిగొచ్చినందుకు సంతోషంగా ఉన్నాను. మీకు మన చరిత్ర గురించి బాగా తెలుసు. మన సంబంధాలు ఎల్లప్పుడూ బాగుంటాయి.

- ఈ రోజు మనం కొత్త అధ్యాయాన్ని ప్రారంభించాం. కొన్ని క్లిష్టమైన సవాళ్లను ఉమ్మడిగా ఎదుర్కొనబోతున్నాం. 40 లక్షల మంది భారతీయ అమెరికన్లు నిత్యం అమెరికాను బలోపేతం పనిలో నిమగ్నమయ్యారు.

మోడీ చేసిన వ్యాఖ్యలు

- ఈ దశాబ్దం ఎలా రూపుదిద్దుకోవాలనే అంశంలో మీ నాయకత్వం కీలకపాత్ర పోషిస్తుంది. భారత్‌-అమెరికా మధ్య స్నేహం మరింత బలోపేతం కావడానికి అవసరమైన బీజాలు పడ్డాయి.

- అమెరికా పురోగతిలో ప్రవాసభారతీయులు క్రియాశీల తోడ్పాటునందించడం నాకు సంతోషాన్ని కలిగిస్తోంది.

- ఈ శతాబ్దపు మూడో దశాబ్దం ఆరంభంలో జరుగుతున్న ఈ భేటీ ఎంతో కీలకమైంది.

- ప్రస్తుత పరిస్థితుల్లో టెక్నాలజీనే చోదకశక్తిగా మారింది. ప్రపంచ సంక్షేమానికి అవసరమైన టెక్నాలజీ రూపకల్పనకు మనందరం మన ప్రతిభను ఉపయోగించాలి.

- ఈ దశబ్దాంలో భారత్‌-అమెరికా సంబంధాల్లో కీలకమైన అంశం వాణిజ్యమే. ఆ దిశగా చేయాల్సిన కృషి చాలా ఉంది.

- భూమికి ధర్మకర్తలా వ్యవహరించడం గురించి గాంధీ నిత్యం చెబుతూ ఉండేవారు. ధర్మకర్త్రత్వం అనే భావన ప్రపంచానికి తక్షణ అవసరం.

చర్చకు వచ్చిన అంశాలు

- కొవిడ్‌-19పై పోరాటంలో భాగంగా ఇంకా ఏం చేయాలి?

- పర్యావరణ మార్పు సవాల్‌ను ఎలా ఎదుర్కోవాలి?

- ఇండో-పసిఫిక్‌ ప్రాంతం లో సుస్థిరత నెలకొనడానికి ఏం చేయాలి?

- ఆర్థిక సహకారం, అఫ్ఘానిస్థాన్‌ సహా ఇరుదేశాల ప్రయోజనాలకు సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చ