Begin typing your search above and press return to search.

తెలంగాణను కమ్మేయనున్న మోడీషాలు

By:  Tupaki Desk   |   29 Jan 2023 4:00 PM GMT
తెలంగాణను కమ్మేయనున్న మోడీషాలు
X
తెలంగాణలో అధికారాన్ని సొంతం చేసుకోవటం కోసం పక్కా వ్యూహాన్ని సిద్ధం చేయాలని భావించిన బీజేపీ అధినాయకత్వం ఎట్టకేలకు తాను అమలు చేయాల్సిన వ్యూహాన్ని సిద్ధం చేసుకుంది. దేశంలోనే అతి పెద్ద రాష్ట్రం.. విలక్షణతకు మారుపేరుగా నిలిచే ఉత్తరప్రదేశ్ లో అధికారాన్ని చేజిక్కించుకోవటానికి అనుసరించిన వ్యూహాన్ని తెలంగాణలో అమలు చేయటం ద్వారా.. పవర్ చేతికి వస్తుందని భావిస్తున్నారు మోడీషాలు. దీనికి తగ్గట్లే వారు యూపీ ఫార్ములాను తెలంగాణలో అమలు చేయాలని డిసైడ్ చేసినట్లుగా చెబుతున్నారు.

పోలింగ్ బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు వివిధ దశల్లో సభలు.. సమావేశాలతో పాటు భారీ బహిరంగ సభల్ని నిర్వహించాలని నిర్ణయించారు. దశల వారీగా నిర్వహించే ఈ సభలకు అవసరానికి అనుగుణంగా ప్రధానమంత్రి మోడీ మొదలుకొని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో పాటు.. పలువురు నేతలు తెలంగాణను కమ్మేయనున్నారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే లోపు.. నాలుగైదు బహిరంగ సభల్ని నిర్వహించాలని.. వాటిల్లో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొంటారని చెబుతున్నారు.

ఇప్పటికే కేంద్రం నుంచి తెలంగాణకు ఎలాంటి సహాయ సహకారాలు అందలేదని.. కేంద్రంలోని మోడీ సర్కారు చేసిందేమీ లదని కేసీఆర్ సర్కారు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్న నేపథ్యంలో.. అందులో ఏ మాత్రం నిజం లేదని.. ఆ ప్రచారం తప్పన్న విషయాన్ని తేల్చి చెప్పేలా విషయాల్ని వివరించాలని నిర్ణయించినట్లు చెబుతున్నారు. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా స్థానిక నాయకత్వాల్ని సిద్ధం చేయటంతో పాటు.. ఆయా ప్రాంతానికి కేంద్రం ఇచ్చిన నిధులు ఏమిటి? వాటిని కేసీఆర్ సర్కారు ఏం చేసిందన్న విషయాన్ని వెల్లడించటంతో పాటు.. స్థానిక ప్రజలకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు.. అమలు చేసినవేమిటి? వైఫల్యాల మాటేంటి? లాంటివి చర్చించేలా వేలాది సమావేశాల్నినిర్వహించాలని భావిస్తున్నారు.

ఒక అంచనా ప్రకారం.. ఈ కార్నర్ మీటింగ్ లు ఫిబ్రవరి 10 నుంచి 25 మధ్యలో తెలంగాణ వ్యాప్తంగా 11 వేల వరకు నిర్వహించాలన్నది లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెబుతున్నారు. ఇంత భారీగా కార్నర్ మీటింగ్ లు వెళ్లటం ద్వారా.. కేసీఆర్ అండ్ కో చెప్పే మాటల్లో ఏ మాత్రం నిజం లేదని.. అవన్నీ అబద్ధాలన్న విషయాన్ని చాటి చెప్పేలా కంటెంట్ సిద్ధం చేసినట్లుగా తెలుస్తోంది. తెలంగాణ వ్యాప్తంగా నిర్వహించే ఈ సమావేశాలకు బీజేపీకి చెందిన నేతలు పలువురు భారీగా హాజరు కానున్నారు.

ఈ సమావేశాల క్రమం పూర్తి అయ్యాక.. 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున బైక్ ర్యాలీలు నిర్వహిస్తారు. మూడో దశలో అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలో బహిరంగ సభల్ని నిర్వహిస్తారు. రెండు వారాల్లో వీటిని పూర్తి చేసి జిల్లా స్థాయిలో సభల్ని నిర్వహించనున్నారు. మొత్తంగా తెలంగాణ వ్యాప్తంగా పార్టీని విస్తరించేలా చేయటంతో పాటు.. ఒకటి తర్వాత ఒకటిగా నిర్వహించే కార్యక్రమాలతో తెలంగాణలో పార్టీని పూర్తిగా యాక్టివ్ చేయాలన్న లక్ష్యంగా పావుల్ని కదుపుతున్నారు.