Begin typing your search above and press return to search.

గుజరాత్ సీఎంగా భూపేంద్ర ఎందుకు? మోడీషాల గేమ్ ప్లాన్ ఇదేనా?

By:  Tupaki Desk   |   13 Sep 2021 4:03 AM GMT
గుజరాత్ సీఎంగా భూపేంద్ర ఎందుకు? మోడీషాల గేమ్ ప్లాన్ ఇదేనా?
X
తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. కనీసం మంత్రి పదవిని కూడా చేపట్టలేదు. అలాంటి నేతను రాష్ట్ర ముఖ్యమంత్రిని చేయటమా? విన్నంతనే ఉలిక్కిపడేలా నిర్ణయాన్ని తీసుకోవటం మోడీషాలకే చెల్లిందనుకోవాలి. అంతర్గతంగా సీనియర్లు కుతకుతలాడిపోయే అవకాశాల్ని పక్కన పెట్టి.. సీఎం పదవికి ఆశావాహుల ఆశల్ని తుంచేస్తూ.. ఎవరేం అనుకున్నా ఫర్లేదు.. తాము అనుకున్నదే జరగాలన్నట్లుగా వ్యవహరించిన మోడీషాలు.. గుజరాత్ ముఖ్యమంత్రిగా భూపేంద్ర పటేల్ ను ఎందుకు డిసైడ్ చేశారు? దాని వెనకున్న వ్యూహం ఏమిటి? జూనియర్ ఎమ్మెల్యేను ఏకంగా ముఖ్యమంత్రిని చేయటం వెనుకున్న బలమైన కారణం ఏమిటి? లాంటి ప్రశ్నలకు ఇప్పుడు సమాధానాలు వెతుకుతున్న పరిస్థితి. రాజకీయ విశ్లేషకుల అంచనా ప్రకారం.. భూపేంద్ర పటేల్ ను గుజరాత్ ముఖ్యమంత్రిగా డిసైడ్ చేయటం వెనుక భారీ ప్లానింగ్ జరిగిందన్న మాట వినిపిస్తోంది.

తాజాగా సీఎంగా డిసైడ్ అయిన భూపేంద్ర 2017లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘాట్లోడియా నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి.. రికార్డు విజయాన్ని సొంతం చేసుకున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి శశికాంత్ పటేల్ ను 1,17,000 ఓట్ల తేడాతో మట్టి కరిపించారు. తొలిసారి బరిలోకి దిగి భారీ మెజార్టీని సాధించటం ద్వారా అందరి చూపు తన మీద పడేలా చేసుకున్నారు. ఆసక్తికరమైన మరో అంశం ఏమంటే.. ఇదే స్థానం నుంచి మోడీకి అత్యంత విధేయురాలు.. తాను ప్రధాని పదవిని చేపట్టేందుకు ఢిల్లీ వెళ్లే వేళ.. తన తర్వాతి సీఎంగా నియమించిన ఆనందిబెన్ పటేల్ ప్రాతినిధ్యం వహించింది కూడా ఈ నియోజకవర్గం నుంచే. ప్రస్తుతం గవర్నర్ గా వ్యవహరిస్తున్న ఆమెకు భూపేంద్ర సన్నిహితుడిగా చెబుతారు.

భూపేంద్ర పటేల్ పూర్తి పేరు.. భూపేంద్ర రజనీకాంత్ భాయి పటేల్. అభిమానులు అతన్ని ముద్దుగా దాదా అని పిలుచుకుంటారు. 1999-2000 మధ్య మేమ్ నగర్ నగర పాలిక అధ్యక్షుడిగా వ్యవహరించిన ఆయన 2008 నుంచి 2010 వరకు అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ స్కూల్ బోర్డు వైస్ ఛైర్మన్ గా పని చేశారు. 2010 నుంచి 2015 వరకు అహ్మదాబాద్ లోని థాల్టెజ్ వార్డు కౌన్సిలర్ గా పని చేశారు. అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ ఛైర్మన్ గా.. అహ్మదాబాద్ అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ ఛైర్మన్ గా కూడా వ్యవహరించారు.

మంత్రిగా పని చేయని ఆయన ఇప్పుడు ఏకంగా ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతల్ని చేపట్టనుండటం గమనార్హం. పాటిదార్ వర్గానికి చెందిన భూపేంద్ర.. ‘‘కాడ్వా’’ అనే ఉప కులానికి చెందిన వారు. ఇప్పటివరకు గుజరాత్ ముఖ్యమంత్రులుగా వ్యవహరించిన పాటిదార్ వర్గానికి చెందిన వారిలో.. వారి ఉప కులం ‘‘లియువా’’కు చెందిన వారు కాగా.. భూపేంద్ర మాత్రం అందుకు భిన్నమైన ఉప వర్గానికి చెందిన వారు కావటం మరో విశేషం. అహ్మదాబాద్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో సివిల్ ఇంజనీరింగ్ లో డిప్లమా పూర్తి చేసిన ఆయన.. సర్దార్ ధామ్.. విశ్వ ఉమియా ఫౌండేషన్ ట్రస్టీగా కూడా వ్యవహరిస్తున్నారు.

తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన భూపేంద్రను గుజరాత్ ముఖ్యమంత్రిని ఎందుకు చేశారు? దాని వెనుకున్న వ్యూహం ఏమిటి? అన్న ప్రశ్నలకు సమాదానలు వెతికితే.. మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో భూపేంద్ర అహ్మదాబాద్ అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ స్టాండింగ్ కమిటీ ఛైర్మన్ గా ఉండే వారు. నగర అభివృద్ధి విషయంలో మోదీ ప్రణాళికలను చక్కగా అమలు చేయటం ద్వారా మోడీ కంట్లో పడ్డారు. సమర్థుడైన నాయకుడిగా ఆయనకు పేరుంది. కొవిడ్ సెకండ్ వేవ్ పెద్ద ఎత్తున విరుచుకుపడిన వేళలో.. బాధితుల కోసం భూపేంద్ర ఆక్సిజన్ సిలిండర్లను విరివిరిగా సమకూర్చారు. ఆసుపత్రుల్లో పడకల్ని ఏర్పాటు చేయించారు.

ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ.. తానో పెద్ద నేతగా డాబు ప్రదర్శించటం.. చేసిన పనిని గొప్పగా చాటి చెప్పుకోవటం.. ఆడంబరాలు.. ఆర్బాటాలకు దూరంగా ఉండటం.. తన పని తాను చేసుకుంటూ పోవటం.. సైలెంట్ గా ఉండటం ఆయన ప్రత్యేకతలు. ఇవన్నీ ఆయనకు మంచి పేరును తెచ్చేలా చేశాయి. మాటలు తక్కువ.. పని ఎక్కువన్న భావన కలిగించటంలో ఆయన సక్సెస్ అయ్యారు. దీనికి తోడు ఆనంది బెన్ పటేల్ సిఫార్సు కూడా ఆయనకు ముఖ్యమంత్రి అయ్యే అవకాశాన్ని కల్పించింది.

వాస్తవానికి ముందుగా అనుకున్న ప్రకారం గుజరాత్ సీఎంగా ప్రస్తుత కేంద్ర మంత్రి మన్ సుఖ్ మాండవియా కానీ నితిన్ పటేల్ కానీ మరొకరు కానీ అయ్యే వారని.. కానీ ఆనంది బెన్ పటేల్ ఎంట్రీ ఇచ్చి.. మోడీషాల మనసుల్ని మార్చటంలోనూ కీలకంగా వ్యవహరించినట్లు చెబుతారు. గుజరాత్ జనాభాలో పాటిదార్ వర్గం దాదాపు 14 శాతం ఉంటుంది. మొత్తం అసెంబ్లీ స్థానాల్లో 90 అసెంబ్లీ స్థానాల్లో గెలుపు ఓటముల్ని డిసైడ్ చేసేది పాటిదార్లే. రాష్ట్రంలో ప్రతి ముగ్గురు ఎమ్మెల్యేల్లో ఒకరు పాటిదార్ వర్గానికి చెందిన వారే కావటం గమనార్హం.

1995 నుంచి బీజేపీకి అండగా ఉన్న ఈ సామాజిక వర్గం రిజర్వేషన్ల సాధన కోసం జరిగిన పోరాటం తర్వాత 2015లో ఆ పార్టీకి వారు దూరమయ్యారు. ఇలాంటి వేళ.. కీలకమైన ఆ వర్గానికి చెందిన చురుకైన నేతకు రాష్ట్ర పగ్గాలు అప్పజెప్పటం ద్వారా.. వచ్చే ఏడాది చివర్లో జరిగే ఎన్నికల్లో పార్టీని విజయ తీరాలకు తీసుకెళ్లే భారీ బాధ్యత భూపేంద్ర మీద పెట్టారు. మరి.. ఆ లక్ష్యాన్ని ఆయన ఏ మేరకు చేరుకుంటారో చూడాలి.