హైదరాబాద్ అభ్యర్థుల్లో బ్రాహ్మణులు.. ఖమ్మంలో రెడ్డి అభ్యర్థులదే హవా!

Tue Feb 23 2021 21:00:01 GMT+0530 (IST)

Mlc Elections In Telangana

తెలంగాణలో తాజాగా జరుగుతున్న రెండు పట్టభధ్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన ఒక ఆసక్తికర అంశాన్ని గమనించారా? ఈ రెండు చోట్ల ప్రముఖ పార్టీల అభ్యర్థులుగా.. స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో ఉన్న వారిలో ఒకట్రెండు సామాజిక వర్గాలకు చెందిన వారే అత్యధికులు ఉండటం ఆసక్తకరంగా మారింది. హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రధాన పోటీ ఉందని భావిస్తున్న అభ్యర్థుల్లో అత్యధికులు బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన వారే.అదే సమయంలో ఖమ్మం ఎమ్మెల్సీ స్థానానికి జరుగుతున్న ఎన్నికల్లో పోటీ పడుతున్న ప్రధాన అభ్యర్థుల్లో అత్యధికులు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారేకావటం ఆసక్తికరంగా మారింది. ఎన్నికలు ఏవైనా సరే.. సామాజిక అంశాలు కీలకభూమిక పోషిస్తాయని చెప్పాలి. అనుకోకుండా జరిగిందో.. కావాలనే చేశారో కానీ ఎన్నికలు జరుగుతున్న రెండు చోట్ల అభ్యర్థుల ఎంపిక ఒకేలా ఉండటం విశేషం.

హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి జరుగుతున్న ఎన్నికల్లో ప్రధాన పార్టీల అభ్యర్థులు దాదాపుగా బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన వారే. టీఆర్ఎస్ అభ్యర్థి సురభి వాణీదేవి.. బీజేపీ అభ్యర్థి రాంచందర్ రావు.. ఆర్ఎల్ డీ తరఫున పోటీ చేస్తున్న కపిలవాయి దిలీప్ కుమార్ లు బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన వారు. స్వంత్రత్య అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న ప్రొఫెసర్ నాగేశ్వర్ వైశ్య సామాజిక వర్గానికి చెందిన వారు. కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలో ఉన్న చిన్నారెడ్డి.. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు కాగా.. టీడీపీ నుంచి బరిలో ఉన్న ఎల్ రమణ బీసీ వర్గానికి చెందిన వారు. ఇదంతా చూసినప్పుడు హైదరాబాద్ ఎమ్మెల్సీ స్థానం నుంచి పోటీ చేస్తున్న వారిలో అత్యధికులు ఓసీలుగా కనిపిస్తారు.

అదే సమయంలో ఖమ్మం ఎమ్మెల్సీకి జరుగుతున్న ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో అత్యధికులు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారే. టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి.. బీజేపీ నుంచి పోటీ చేస్తున్న ప్రేమేందర్ రెడ్డి.. టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం.. యువ తెలంగాణ పార్టీ నుంచి పోటీ చేస్తున్న రాణి రద్రుమరెడ్డిలు అంతా ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు. కాంగ్రెస్ తరఫున మాత్రం మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ దిగుతున్నారు. ఇలా రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు ఒకే సామాజిక వర్గానికి చెందిన ఎక్కువగా ఉండటం కాకతాళీయమేనంటారా?