Begin typing your search above and press return to search.

ఫైర్ బ్రాండ్లను కమ్మేస్తున్న పెద్దిరెడ్డి!

By:  Tupaki Desk   |   29 July 2021 10:45 AM GMT
ఫైర్ బ్రాండ్లను కమ్మేస్తున్న పెద్దిరెడ్డి!
X
రాజకీయాలు ఎప్పుడూ ఒకలా ఉండవు. అప్పటివరకు అనామకంగా ఉన్న నేతలకు ఒక్కసారిగా అందలం ఎక్కే అవకాశం ఉంటుంది. అదే వేళ.. ఒక వెలుగు వెలిగిపోతున్న నేతలు.. అంతలోనే డమ్మీలుగా మారిపోతుంటారు. ఇదంతా కాలమహిమ అనే కన్నా.. ఆయా పార్టీ అధినాయకత్వం ఇచ్చే ప్రాధాన్యతలు వారి స్థాయిలు డిసైడ్ అయిపోతుంటాయి. కొన్నిసార్లు మాత్రం అందుకు భిన్నంగా నేతల వ్యవహారశైలి కూడా దీనికి కారణం అవుతుంటుంది. వారి కారణంగా పార్టీ తీవ్ర ప్రభావానికి గురవుతుంటుంది.

ఎక్కడిదాకానో ఎందుకు 2014 ఎన్నికల్లో విజయం సాధించిన టీడీపీనే చూస్తే.. అప్పటివరకు తెర వెనుక మాత్రమే కనిపించే నారాయణ.. ఒక్కసారిగా వెలుగులోకి వచ్చారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న ఐదేళ్ల పాటు టీడీపీ ప్రభుత్వంలో ఆయన ఎంత కీలకంగా వ్యవహరించారో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. మంత్రి పదవిని సొంతం చేసుకోవటంతో పాటు రాజధానిగా అమరావతికి సంబంధించిన వ్యవహారాలన్ని ఆయన దగ్గరుండి చూసుకునేవారు. ఒక రకంగా చెప్పాలంటే..చంద్రబాబుకు కుడిభుజంగా ఉండేవారు. అంతా ఆయన కనుసన్నల్లోనే సాగేది.

అలాంటి నారాయణ 2019 ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయం పాలైన తర్వాత నుంచి ఆయన కనిపించటం మానేశారు. చివరకుపార్టీ వ్యవహారాల్లోనూ ఆయన కనిపించటం లేదు. పార్టీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అరెస్టు మొదలు ధూళిపాళ్ల.. తాజాగా మాజీ మంత్రి దేవినేని ఉమ అరెస్టు సమయంలోనూ ఒక్క ప్రకటన కూడా చేయకుండా మౌనంగా ఉండిపోవటం కనిపిస్తుంది.

ఇదంతా ఎందుకంటే.. ఇప్పుడు ఏపీ అధికారపక్షంలోనూ ఇలాంటి పరిస్థితే కనిపిస్తోంది. కొన్ని జిల్లాల్లో మిగిలిన నేతలంతా డమ్మీలుగా మారిపోయి.. ఒకరిద్దరు మాత్రమే వెలిగిపోతున్నారు. అపరిమితమైన అధికారం వారి చేతుల్లో ఉందన్న భావన వ్యక్తమవుతోంది. ఇది పార్టీకి ఏ మాత్రం మంచిదికాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. జగన్ ప్రభుత్వంలో మంత్రిగా వ్యవహరిస్తున్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కారణమని చెబుతున్నారు.

పార్టీ విపక్షంలో ఉన్నప్పుడు.. గడ్డు పరిస్థితుల్లో ఉన్నప్పుడు నిత్యం పార్టీ కోసం పాకులాడిన నేతల కంటే.. పెద్దిరెడ్డి మాటే ఎక్కువగా చెల్లుబాటు అవుతుందన్న మాట వినిపిస్తోంది. దీనికి నిదర్శనంగానే చిత్తూరు జిల్లాలో వైసీపీకి ఫైర్ బ్రాండ్ నేతలకు కొదవలేదు. ఆర్కే రోజా.. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి.. భూమన కరుణాకర్ రెడ్డి.. నారాయణ స్వామి.. ఇలాంటి వారంతా నిత్యం వార్తల్లో కనిపించేవారు. చంద్రబాబు ప్రభుత్వాన్ని ఏకిపారేసేవారు. జగన్ ను ముఖ్యమంత్రి పదవిని చేపడితే చూడాలని తపించారు.

ఈ కారణంతోనే పార్టీ విపక్షంలో ఉన్నప్పుడు ఈ జిల్లాకు చెందిన నేతల గళం తరచూ మీడియాలో వినిపించేది. నిజానికి వీరి మాటలకు మీడియా కూడా ప్రాధాన్యత ఇచ్చేది. దీనికి కారణం.. వీరంతా అప్పటి సీఎం చంద్రబాబు సొంత జిల్లాకు చెందిన వారు కావటంతో.. మిగిలిన నేతల కంటే ఎక్కువ ప్రయారిటీ ఇచ్చేవారు. అలాంటి ఫైర్ బ్రాండ్ నేతలు జగన్ ముఖ్యమంత్రి అయ్యాక.. వారికి కీలక పదవులు దక్కుతాయన్న అంచనా ఉండేది. అందుకు భిన్నంగా ఈ ఫైర్ బ్రాండ్ నేతల్లో నారాయణ స్వామికి తప్పించి.. మిగిలిన వారెవరికీ మంత్రిపదవులు దక్కింది లేదు.

అంతేకాదు.. వీరిలో కొందరికైతే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అపాయింట్ మెంట్ కూడా లభించటం లేదంటున్నారు. దీంతో.. వారంతా తమ నియోజకవర్గాలకు పరిమితమవుతున్నారన్న మాట వినిపిస్తోంది. చిత్తూరు జిల్లా వరకు హవా అంతా పెద్దిరెడ్డి చుట్టూనే తిరుగుతుందన్న మాట వినిపిస్తోంది. ఆయన మాటకు సీఎం జగన్ అధిక ప్రాధాన్యత ఇవ్వటం కూడా కారణమంటున్నారు. ఆయన హవాతో జిల్లాకు చెందిన ఫైర్ బ్రాండ్ నేతల్ని కమ్మేస్తున్నారని చెబుతున్నారు. ఇలా జిల్లాలో ఒక నేతకు అధిక ప్రాధాన్యత ఇచ్చి.. మిగిలిన ఫైర్ బ్రాండ్లను పట్టించుకోకుంటే వారిలో ఫైర్ తగ్గిపోతే.. అంతిమంగా అది పార్టీకే నష్టమన్న విషయాన్ని మర్చిపోకూడదు. మరీ.. విషయాన్ని జగన్ ఎప్పటికి గుర్తిస్తారన్న మాట పార్టీ నేతలు తమ అంతర్గత సంభాషణల్లో చర్చించుకోవటం కనిపిస్తోంది.