మాజీ మంత్రి వ్యూహం : కాపాడే కులం కోసం...?

Wed May 25 2022 20:00:01 GMT+0530 (IST)

Minister strategy For saving caste...?

ఆయన నిన్నటి దాకా మంత్రి. మూడేళ్ళ పాటు ఉమ్మడి విశాఖపట్నం జిల్లాకు మంత్రిగా పనిచేశారు. నాడు అవంతి అంతా ఏకపక్షమే అని అంతా అనుకున్నారు. ఆయన అంతా నేనే అన్నట్లుగానే కధ నడిపారు అని కూడా ఆరోపణలు వచ్చాయి. ఇపుడు మాజీ అయ్యారు. పార్టీ పగ్గాలు కూడా ఇచ్చారు కానీ ముందు తన సీటు భీమిలీలో గెలవాలి. అక్కడ టఫ్ కాంపిటేషన్ ఉంది.దాంతో అవంతి మాస్టారు ఇపుడు గొంతు సవరించుకున్నారు. ఆయన తన సొంత కులం వారితో కలసిమెలసి తిరుగుతున్నారు. తాజాగా జరిగిన  కాపుల  సమావేశంలో కాపుగా పుట్టడం తన అదృష్టం అని అవంతి అన్నారు. కాపుగా పుట్టినందుకు గర్విస్తున్నాను అంటున్నారు ఈ మాజీ మంత్రి గారు. కాపులు విశాఖ జిల్లాలో చాలా పెద్ద ఎత్తున ఉన్నారు.

అందునా ఆయన సీటు  భీమిలీ నియోజకవర్గంలో హెచ్చు సంఖ్యలో ఉన్నారు. దాంతో వారిని మంచి చేసుకోకుంటే వచ్చే ఎన్నికల్లో ఇబ్బందులు తప్పవు. దాంతో అవంతి సరైన టైమ్  టైమింగ్ తోనే తన వ్యూహాలకు పదును పెడుతున్నారు అని అంటున్నారు. ఇక అవంతి కూడా తాను మంత్రిగా ఉన్నపుడు విశాఖలో కాపు సంక్షేమ భవనం కోసం ప్రభుత్వంలో మాట్లాడి ఏకంగా 2400 గజాల భూమిని వచ్చేలా చేశారు.

ఇపుడు విశాఖలో మార్కెట్ వాల్యూ ప్రకారం అది ముప్పయి కోట్ల పై మాటే. ఆ విధంగా సొంత కులానికి నాడు చేసుకున్న మేలు ఇపుడు గట్టిగానే చెప్పుకుంటున్నారు. పైగా కాపు సంక్షేమ భవనం మొదటి అంతస్థుని తన ఖర్చుతో నిర్మించి ఇస్తాను అని కూడా అవంతి హామీ ఇచ్చారు.

మొత్తానికి అవంతి సొంత కులం వారిని దగ్గరకు తీస్తున్నారు. వచ్చేది ఎన్నికల సీజన్. గెలవాలన్నా నిలవాలన్నా కూడా అవంతికి కాపుల దన్ను అవసరం. దాంతో ఆయన తగిన రీతిన వ్యవహరిస్తున్నారు అన్న మాట ఉంది.

పైగా తన మంత్రిత్వ కాలంలో కాపులకు ఒక భవనం తెచ్చాను అని చెప్పుకోవడానికి కూడా ఆయనకు ఇపుడు అవకాశం ఉంది. ఇవన్నీ సరే కానీ అవంతి కాపుల మద్దతుని ఎంతవరకూ వైసీపీ వైపు మళ్ళించగలరు అన్నదే ఇక్కడ ప్రశ్న. ఇక భీమిలీలో తన గెలుపునకు కాపులను ఏకపక్షంగా అక్కడ తన వైపునకు తిప్పుకోగలరా అన్నది మరో ప్రశ్న. వీటిని రాబోయే రోజులలో జవాబులు లభించవచ్చేమో.