పరిషత్ ఎన్నికల్లో గెలుపు.. మంత్రిగారి అబ్బాయికి అదిరే ఛాన్స్

Fri Sep 24 2021 11:02:55 GMT+0530 (IST)

Minister is expected to appoint His Son as vice chairman

మిగిలిన రాష్ట్రాల సంగతి ఎలా ఉన్నా.. రెండు తెలుగు రాష్ట్రాల్లో మాత్రం రాజకీయ నేతలు తమ వారసుల్ని తెగ తీసుకొచ్చేస్తుంటారు. ఆ మాటకు వస్తే.. ఏపీ ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తోంది రాజకీయ వారసత్వంగా వచ్చిన జగనే కదా? విపక్షం విషయానికి వస్తే.. చంద్రబాబు తన కుమారుడు లోకేశ్ ను బలమైన నేతగా మార్చేందుకు పడుతున్న ప్రయాస అంతా ఇంతా కాదు. తెలంగాణ విషయానికి వస్తే.. రాష్ట్ర అధికార పక్షమైన టీఆర్ఎస్ లో రాజకీయ వారసత్వం ఎంత ఎక్కువగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు.తన కుమారుడ్ని ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెట్టేందుకు సీఎం కేసీఆర్ చేసిన ప్రయత్నాలు అన్ని ఇన్ని కావు. చివరి వరకు వచ్చి.. ఆఖర్లో ఏదో ట్విస్టు అన్నట్లుగా సీన్ మారటంతో ఆయన తన నిర్ణయాన్ని మార్చుకోవాల్సిన పరిస్థితి. రెండు తెలుగు రాష్ట్రాల్లోని అధినేత కుటుంబాల్లోనే ఇంతలా ఉంటే.. ఇక మిగిలిన వారు వారిని ఆదర్శంగా తీసుకోకుండా ఉంటారా? తాజాగా అలాంటి రాజకీయ వారసత్వం ఒకటి ఏపీలో ముఖ్యమైన పదవి దక్కే వీలుందన్న మాట వినిపిస్తోంది.

ఉత్తరాంధ్రలో రాజకీయంగా బలమైన కుటుంబాల్లో ధర్మాన ఒకటి.ఏపీ అధికారపక్షంలో బొత్స ఫ్యామిలీకి ధీటుగా ఎదిగిన రాజకీయ కుటుంబం ధర్మాన వారిది. ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రిగా కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న ధర్మాన క్రిష్ణ దాస్ తన కుమారుడు కమ్ రాజకీయ వారసుడైన డాక్టర్ క్రిష్ణ చైతన్యను రాజకీయాల్లోకి తీసుకొచ్చేయటం తెలిసిందే. ఆయన్ను ఆ మధ్యన జరిగిన పరిషత్ ఎన్నికల్లో దించి.. జెడ్పీటీసీగా ఘన విజయం సాధించేలా చేశారు.

బ్యాడ్ లక్ ఏమంటే.. ఈ జిల్లా పరిషత్ ఛైర్మన్ పదవి మహిళలకు రిజర్వు కావటంతో ఆయనకు ఛైర్మన్ గిరీ ఛాన్సు మిస్ అయ్యింది. అయితే.. రెండు వైస్ ఛైర్మన్ పోస్టుల్లో ఒక దానికి ఆయన్ను ఎంపిక చేయటం ఖాయమన్న మాట వినిపిస్తోంది. ఇందుకోసం ధర్మాన తెర వెనుక చేయాల్సిన ప్రయత్నాలన్ని చేస్తున్నట్లు చెబుతున్నారు. అన్ని అనుకున్నట్లు జరిగితే.. మంత్రిగారి అబ్బాయికి వైస్ ఛైర్మన్ పదవి దక్కటం ఖాయమంటున్నారు. ఇలా మొదలైన ధర్మాన క్రిష్ణదాస్ పుత్రరత్నం పొలిటికల్ కెరీర్.. రానున్న రోజుల్లో మరిన్ని అవకాశాన్ని ఒడిసిపట్టుకోవటం ఖాయమన్న మాట వినిపిస్తోంది.