గడప గడప: చంద్రబాబు తెలివి నాదగ్గర చూపించొద్దు.. మంత్రి రోజా ఫైర్

Thu May 12 2022 14:21:47 GMT+0530 (IST)

Minister Roja Fire on Chandrababu

'గడప గడపకు మన ప్రభుత్వం' అంటూ వైసీపీ అధినేత సీఎం జగన్ పిలుపు మేరకు  ఆ పార్టీ మంత్రులు ఎమ్మెల్యేలు నాయకులు చేపట్టిన కార్యక్రమానికి తొలిరోజే సమస్యలు స్వాగతం పలికాయి. ఎక్కడికక్కడ ప్రజలు సమస్యలను ఏకరవు పెట్టారు. పథకాలు తమకు అందడం లేదంటూ ప్రజాప్రతినిధులను నిలదీశారు. రహదారులు వంటి మౌలిక వసతులు కల్పించలేరా? అంటూ ప్రశ్నించారు. కొన్ని చోట్ల నేతలను నిలదీశారు. దీంతో నాయకులు వారికి సమాధానం చెప్పలేక..రుసరుస లాడారు.ఇప్పటికే ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి జలవనరుల మంత్రి అంబటి రాంబాబులకు ఇలాంటి పరిస్థితి ఎదురైంది. దీంతో వారు అర్ధంతరంగా.. కార్యక్రమాలు ముగించుకుని.. సమావేశాలు ఉన్నాయం టూ.. జారుకున్నారు. ఇక ఈక్రమంలో ఫైర్ బ్రాండ్ మంత్రి ఆర్కే రోజా కూడా.. ప్రజలపై ఫైరయ్యారు. సమస్యలు ఏకరువు పెట్టిన ప్రజలను చంద్రబాబుతో పోల్చారు. చంద్రబాబు తెలివి తన దగ్గర చూపించొద్దంటూ.. ఆగ్రహం వ్యక్తం చేశారు.  

గడప గడపకు కార్యక్రమంలో భాగంగా మంత్రి రోజా తన సొంత నియోజకవర్గం ఉమ్మడి చిత్తూరు జిల్లా(ప్రస్తుతం తిరుపతి)లోని నగరిలో పర్యటించారు. ఈ సందర్భంగా వడమాలపేట మండలం కల్లూరు గ్రామంలో పాల్గొన్నారు.

ఈ  గ్రామానికి చెందిన అంజయ్య అనే వ్యక్తి ఈ సందర్భంగా కరెంటు చార్జీల పెంపుపై రోజాను నిలదీశారు. అమ్మఒడి ఇస్తున్నారు... కానీ కరెంటు చార్జీలు పెంచేశారు... ఎలా కట్టాలి?' అంటూ ఆమెను సూటిగా ప్రశ్నించారు.

దీంతో ఒక్కసారిగా చిర్రెత్తుకొచ్చిన రోజా.. సదరు గ్రామస్థుడిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు తెలివంతా నాపై చూపించొద్దంటూ సమాధానం దాటవేసి అక్కడ నుంచి ఆమె ముందుకు సాగారు. ఇక ఇదే మండలంలో మరో ఆసరా మహిళ మంత్రిని నిలదీశారు.

తెలంగాణలో వేతనాలు 2వేలు పెంచారని ఇక్కడ తమకు కూడా పెంచాలని ఆ వర్కర్ కోరారు. దీనికి సమాధానం చెప్పి సర్దుబాటు చేయాల్సిన రోజా..  అది స్టేట్ పాలసీ అంటూ జారుకున్నారు. ఇలా.. మొత్తంగా గడప గడపకు ప్రశ్నల పరంపర ఎదురుకావడంతో నేతలు ఉక్కిరిబిక్కిరికి గురవుతున్నారు. మరి చివరకు ఈ కార్యక్రమం ముందుకు సాగుతుందో.. లేక.. వెనుకబడుతుందో చూడాలి.