Begin typing your search above and press return to search.

ఆ మంత్రి సూప‌ర్‌.. కానీ.. ఏమీ చేయ‌లేక పోతున్నార‌ట‌!

By:  Tupaki Desk   |   28 Nov 2021 4:30 AM GMT
ఆ మంత్రి సూప‌ర్‌.. కానీ.. ఏమీ చేయ‌లేక పోతున్నార‌ట‌!
X
ఏపీలోని మంత్రుల్లో ఆయ‌నే వృద్ధుడు. వ్యాపార దిగ్గ‌జంగా కూడా పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు ఆయ‌న‌కు ప్ర‌త్యేకంగా సంపాయించుకోవాల‌నే ఆశ‌లు కూడా లేవు. దీంతో త‌న శాఖ‌ను నీట్‌గా ఉంచుకోవాల‌ని.. ప్ర‌య‌త్నిస్తున్నారు. మ‌రో నెలో.. రెణ్నెల్ల‌లోనే మంత్రులను ప‌క్క‌న పెడ‌తార‌నే ఊహాగానాలు.. హ‌ల్చ‌ల్ చేస్తున్న నేప‌థ్యంలో ఈయ‌న చాలా జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రిస్తు న్నారు. అయిన‌ప్ప‌టికీ.. అధికారులు మాత్రం ఈయ‌న మాట ఎక్క‌డా వినిపించుకోవ‌డం లేద‌నే టాక్ ..జోరుగా వినిపిస్తోంది. దీంతో ఎవ‌రు త‌న మాట విన్నా.. విన‌క‌పోయినా.. ఆయ‌న మాత్రం త‌ను చేయాల్సిన ప‌ని త‌ను చేస్తున్నార‌ట‌. ఆయ‌నే ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా ఆచంట నుంచి విజ‌యం ద‌క్కించుకున్న శ్రీరంగ‌నాథ‌రాజు.

జ‌గ‌న్ పాద‌యాత్ర స‌మ‌యంలో వైసీపీ కండువా క‌ప్పుకొన్న రైస్ మిల్ల‌ర్స్ అసోసియేష‌న్ అధ్య‌క్షులుగా ఆయ‌నకు మంచి పేరుం ది. ఆ వంట‌నే ఆయ‌న‌కు ఆచంట టికెట్ ఇవ్వ‌డం.. అక్క‌డ నుంచి రంగ‌నాథ‌రాజు విజ‌యం ద‌క్కించుకోవ‌డం తెలిసిందే.అ యితే అనూహ్యంగా ముదునూరు ప్ర‌సాద‌రాజును సైతం త‌ప్పించి.. రంగ‌నాథ‌రాజుకు జ‌గ‌న్ మంత్రి ప‌ద‌వి ఇచ్చారు. దీంతో ఎప్ప‌టిక‌నా.. త‌న‌కు ప్ర‌సాద‌రాజు పోటీ అవుతార‌ని భావిస్తున్న రంగ‌నాథ‌రాజు.. మంత్రిగా చాలా ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ప్ర‌స్తుతం రాష్ట్ర గృహ‌నిర్మాణ శాఖ మంత్రిగా ఉన్నారు. పేద‌ల‌కు ఇళ్లు.. ఇత‌ర‌త్రా బాధ్య‌త‌ల‌ను ఆయ‌న చూస్తున్నారు. ఎక్క‌డా రూపాయి అవినీతి అనే పేరు ఆయ‌న నుంచి వినిపించ‌డం లేదు.

అయితే.. అధికార ద‌ర్పం మాత్రం ప్ర‌ద‌ర్శిస్తున్నారని, జిల్లాలో హ‌వా చ‌లాయిస్తున్నార‌నే టాక్ మాత్రం ఉంది. ఇదిలావుంటే.. ఇప్పుడు రంగ‌నాథ‌రాజు శాఖ‌లో అవినీతి కంపు కొడుతోంది. ఈ విష‌యాన్ని ఉద్యోగులే చెబుతున్నారు. ఇటీవ‌ల ప్ర‌బుత్వం ప‌దోన్న‌తులు క‌ల్పిస్తూ.. జీవో ఇచ్చింది. దీంతో ఉన్నతాధికారులు.. చేతులు త‌డ‌పందే.. సిబ్బందికి ప‌దోన్న‌త‌ల ఫైలు క్లియ‌ర్ చేయ‌డం లేద‌ని.. శాఖ‌లో తీవ్ర వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. ఒక్కొక్క ప‌దోన్న‌తికి 2 ల‌క్ష‌ల రూపాయ‌ల వ‌ర‌కు ఉన్న‌తాధికారి ఒక‌రు ప‌ట్టుబ‌డుతున్నార‌ని.. ఉద్యోగులు చెప్పుకొంటున్నారు. ఈ విష‌యాలు అటు తిరిగి ఇటు తిరిగి.. మంత్రి చెవికి చేరాయి. దీంతో ఆయ‌న చ‌ర్య‌లు తీసుకునేందుకు రెడీ అయ్యారు.

అయితే.. ఇంత‌లో ఏమైందో.. ఏమో.. ఆయ‌న వెంట‌నే మౌనం దాల్చారు. ఇక్క‌డ తీగ లాగితే.. `ఎక్క‌డో` డొంక క‌ద‌ల‌డం.. దాన్ని క‌దిలిస్తే.. ప్ర‌మాద‌మ‌ని తెలియ‌డంతో మంత్రి వ‌ర్యులు మౌనం పాటిస్తున్నారు. అయితే.. ఇలా.. చిరుద్యోగుల‌ను దోచుకోవ‌డంపై ఆయ‌న ఆగ్ర‌హంతోనే ఉన్నారు. ఈ నేప‌థ్యంలో తీగ లాగ‌కుండా.. డొంక‌ను క‌ద‌ల్చ‌కుండా.. అవినీతికి అడ్డుక‌ట్ట వేశారు! ఆశ్చ‌ర్యంగా అనిపించినా.. నిజం. ఆయ‌న వ‌ద్ద‌కు ఫైల్ రాగానే తొక్కి ప‌ట్టేశారు. అంటే.. ఉన్న‌తాధికారుల అవినీతికి ఆయ‌న చెక్ పెట్టారు. ఈ స‌మ‌యంలోనే ఆయ‌న విశేష ఆదేశాలు జారీ చేశారు. ఎవ‌రైతే.. ప‌దోన్న‌తుల జాబితాలో ఉన్నారో.. వారందిరికీ ప్ర‌త్యేక అధికారాలు ఇచ్చేసి.. అద‌న‌పు అధికారులుగా ప‌రిగ‌ణించాల‌ని మౌఖిక ఆదేశాలు ఇచ్చారు. ఇంత వ‌ర‌కు బాగానే ఉన్నా.. మున్ముందు.. ఏం జ‌రుగుతుంద‌నే ప్ర‌శ్న‌. అయితే.. విష‌యం సీఎం దృష్టికి వెళ్తే.. బాగోతం బ‌య‌ట పెడ‌తాన‌ని.. మంత్రే అంటున్న‌ట్టు సిబ్బంది మ‌ధ్య చ‌ర్చ సాగుతోంది.