Begin typing your search above and press return to search.

ఎర్రబెల్లి రూల్.. ఇంటి బయట చెత్త వేస్తే రూ.500 ఫైన్

By:  Tupaki Desk   |   31 May 2020 10:15 AM GMT
ఎర్రబెల్లి రూల్.. ఇంటి బయట చెత్త వేస్తే రూ.500 ఫైన్
X
ఇప్పుడున్న పరిస్థితుల్లో పరిసరాల్ని పరిశుభ్రంగా ఉంచుకోవటంతో పాటు.. ఎవరికి వారు వ్యక్తిగత శుభ్రత చాలా ముఖ్యం. ఆ విషయంలో ఏ చిన్న తేడా జరిగినా.. అందుకు పెద్ద ఎత్తున ఇబ్బందులు తప్పవు. దీనికి తగ్గట్లే.. తెలంగాణ రాష్ట్ర పంచాయితీ రాజ్ శాఖామంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు.

మాయదారి రోగం అంతకంతకూ విస్తరిస్తున్న వేళ.. పారిశుద్ధ్యం విషయంలో మరింత కఠినంగా వ్యవహరించాలని డిసైడ్ అయ్యారు. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న పంచాయితీల్లో ఇంటి బయట చెత్త వేస్తే.. అలాంటి వారికి రూ.500 ఫైన్ వేయాలని నిర్ణయించారు. దీనికి సంబంధించిన ఉత్తర్వుల్ని జారీ చేశారు. జూన్ ఒకటి నుంచి ఎనిమిదో తేదీ వరకూ దీనికి సంబంధించిన స్పెషల్ డ్రైవ్ ను నిర్వహించాలని పేర్కొన్నారు.

స్పెషల్ డ్రైవ్ లో భాగంగా తొలిరోజు సర్పంచ్.. వార్డు సభ్యులు.. అధికారులు గ్రామాల్లో పాదయాత్రలు నిర్వహించాలని నిర్ణయించారు. నీరు నిలిచి ఉండే గుంతల్ని మూసివేయాలని ఆదేశించారు. డ్రైనేజీలో మురుగునీరు నిల్వ లేకుండా చూసుకోవటం.. దిగువ ప్రాంతాల్లో వర్షపు నీరు సరిగా ప్రవహించేలా ఏర్పాట్లు చేయాలన్నారు. పల్లె ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపర్చటమే లక్ష్యమన్న ఎర్రబెల్లి.. పరిశుభ్రతకు సంబంధించి గ్రామీణ ప్రాంతాల్లో మరింత అవగాహన పెంచేలా కార్యక్రమాల్ని సిద్ధం చేశారు.

మరో వారంలో వర్షాకాలం స్టార్ట్ కానున్న వేళ.. సీజనల్ వ్యాధులు దరి చేరకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగా పారిశుద్ధ్యం..పరిశుభ్రతకు పెద్ద పీట వేయటం ద్వారా.. దోమల వ్యాప్తిని సమర్థంగా అడ్డుకోగలిగితే.. బోలెడన్ని సమస్యలకు ముకుతాడు వేసినట్లేనన్నది ఆయన ఆలోచన. ఐడియా బాగుంది. అందుకు తగ్గట్లు వ్యూహం ఓకే. మరి.. అమలు ఎలా ఉంటుందో చూడాలి.