Begin typing your search above and press return to search.

మండలి చైర్మన్ ను తిట్టలేదు.. లోకేష్ తాగుబోతు : బొత్స

By:  Tupaki Desk   |   23 Jan 2020 10:27 AM GMT
మండలి చైర్మన్ ను తిట్టలేదు.. లోకేష్ తాగుబోతు : బొత్స
X
పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులపై బుధవారం శాసనమండలిలో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. లైవ్ ప్రసారాలు ఆపివేయడంతో లోపల ఏం జరిగిందనేది వెలుగులోకి రాలేదు.

దీంతో టీడీపీ నేతలు విష ప్రచారాన్ని మొదలు పెట్టారని వైసీపీ నేతలు చెబుతున్నారు. టీడీపీ శాసనమండలి పక్ష నేత యనమల రామకృష్ణుడు అయితే వైసీపీ మంత్రులు తాగొచ్చారని ఆరోపించారు.

దీనిపై తాజాగా మంత్రి బొత్స సత్యనారాయణ క్లారిటీ ఇచ్చారు. టీడీపీ ఎమ్మెల్సీలే తాగుబోతుల్లా ప్రవర్తించారని.. మాజీ మంత్రి నారా లోకేష్ తాగుబోతులా ఊగిపోతూ మీదిమీదికొచ్చారని మంత్రి బొత్స కౌంటరిచ్చారు. చైర్మన్ తో మాట్లాడుతుండగా నారా లోకేష్, టీడీపీ ఎమ్మెల్సీలు తాగిన మైకంలో ఊగి పోతున్నట్టుగా మా వైపు దూసుకొచ్చి బెదిరించారని బొత్స ఆరోపించారు. ఆఫ్ట్రాల్ రెండేళ్లు మంత్రి గా చేసిన లోకేష్ కు ఇంత అహంకారామా అని బొత్స ప్రశ్నించారు. బెదరడానికి మేమైనా టీడీపీ కార్యకర్తలమా అని బొత్స ప్రశ్నించారు.

ఇక మండలి చైర్మన్ ను తాను మతం పేరుతో తిట్టానని టీడీపీ చేస్తున్న ప్రచారాన్ని బొత్స ఖండించారు. ‘నువ్వు సాయిబుకే పుట్టావా’ అని తాను మండలి చైర్మన్ ను తిట్టినట్టు పత్రికల్లో వచ్చిన కథనాల పై బొత్స వివరణ ఇచ్చారు. షరీఫ్ ను నేను మతం పేరుతో దూషించలేదని.. తాను కలిసినప్పుడు ఆయన నమాజ్ చేస్తూ కనిపించారని.. అన్యాయంగా రాజ్యాంగ విరుద్ధంగా నిర్ణయం తీసుకోవడంపై సరైంది కాదని అన్నానని వివరణ ఇచ్చారు. రెండు బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపించడాన్ని బీజేపీ, పీడీఎఫ్ ఎమ్మెల్సీలు కూడా వ్యతిరేకించారని.. అయినా సరే చైర్మన్ తన ఇష్టానుసారం టీడీపీకి చెప్పినట్టు చేశారని బొత్స ఆరోపించారు. రూలింగ్ పార్టీ బిల్లులను ఆమోదించడం మండలిలో సంప్రదాయమని.. కానీ షరీఫ్ మాత్రం దానికి విరుద్ధంగా వ్యవహరించారని మండిపడ్డారు. చంద్రబాబు తొత్తులా వ్యవహరించాడని.. అర్హతలేని వాళ్లని కూర్చుండబెట్టి ఆడిస్తున్నారని బొత్స ఫైర్ అయ్యారు.