దోపిడీ కోసమే రాజ్యాంగమంటోన్న మంత్రి...వైరల్

Wed Jul 06 2022 15:10:48 GMT+0530 (IST)

Minister About extortion of Constitution

ఈ మధ్యకాలంలో కొంతమంది రాజకీయ నేతలు కావాలని చేస్తారో...లేద కాంట్రవర్సీ కోసం చేస్తారో తెలీదుగానీ...నోటికొచ్చినట్లు మాత్రం మాట్లాడేస్తున్నారు. తమ వ్యాఖ్యలు ఎవరి మనోభావాలనైనా దెబ్బతీస్తున్నాయా వివాదాస్పదంగా ఉన్నాయా అని ముందు వెనుక చూసుకోవడం లేదు.తీరా ఆ కామెంట్లు కాక రేపి...దుమారం రేపాక మాత్రం మేమలా అనుకోలేదు...ఆ ఉద్దేశ్యంతో అనలేదు అంటూ కవర్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా కేరళ మత్స్యశాఖ మంత్రి సాజి చెరియన్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు కూడా ఈ కోవలోకే వస్తాయి.

భారత రాజ్యాంగంపై చెరియన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సాధారణ ప్రజలను దోచుకునేలా రాజ్యాంగాన్ని రాశారంటూ ఆయన షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. దీంతో చెరియన్ వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి.

ఇటు మీడియాలో అటు సోషల్ మీడియాలో చెరియన్ కామెంట్లపై దుమారం రేగుతోంది. ఈ క్రమంలోనే చెరియన్ పై రాష్ట్ర గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఫైర్ అయ్యారు. ఆ వ్యాఖ్యలపై సీఎం పినరాయి విజయన్ ను వివరణ కోరారు.

ఇక తన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో చెరియన్ కవర్ చేసుకొనే పనిలో పడ్డారు. తాను రాజ్యాంగాన్ని దూషించలేదని తనకు రాజ్యాంగంపై ఎంతో గౌరవముందని చెప్పుకొచ్చారు. పాలనా వ్యవస్థ సరిగా లేదన్న కోణంలోనే తాను మాట్లాడానంటూ వివరణనిచ్చే ప్రయత్నం చేశారు. ఇక చివరకు చేసేదేమీ లేక తాను చేసిన వ్యాఖ్యలకు చెరియన్ క్షమాపణలు కూడా చెప్పాల్సి వచ్చింది.

అయితే చెరియన్ పై చర్యలు తీసుకోవాలని విపక్ష నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ చెరియన్ పై సీఎం చర్యలు తీసుకోకుంటే కోర్టుకు వెళతామని కూడా విపక్షాలు వార్నింగ్ ఇచ్చాయి. ఏది ఏమైనా...పొలిటిషియన్లు మాట్లాడేటప్పుడు తమ నోటిని అదుపులో పెట్టుకోకుంటే ఇక్కట్ల పాలు కావడం ఖాయమన్న వాదనలు వినిపిస్తున్నాయి.