అక్కడ పాల కంటే పెట్రోల్.. డీజిల్ ధరలే తక్కువట!

Wed Sep 11 2019 11:15:11 GMT+0530 (IST)

Milk Rate costlier than petrol in Pakistan

నిద్ర లేచింది మొదలు మన మీద యుద్ధం చేసేస్తామంటూ విరుచుకుపడే పాక్ లో పరిస్థితి ఏమాత్రం బాగోలేదట. ఆ దేశ ఆర్థిక పరిస్థితి ఎంత గడ్డుగా ఉందో తెలిపే ఉదంతం ఒకటి బయటకు వచ్చింది. దాయాది దేశంలో నిత్యవసర వస్తువులు ఆకాశాన్ని అంటుతున్నాయి. రోజురోజుకూ పెరుగుతున్న నిత్యవసర వస్తువుల ధరలతో సామాన్యులు విలవిలలాడిపోతున్నారట.గతంలో ఎప్పుడూ లేని రీతిలో పాక్ లో ఒక చిత్రమైన పరిస్థితి నెలకొంది. ఆ దేశంలో పెట్రోల్.. డీజిల్ ధరల్ని దాటేశాయి పాల ధరలు. మొహ్రరం సందర్భంగా పాల ధరలు భారీగా పెరిగిపోవటంపై పాక్ ప్రజలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. గత నెలలో లీటరు పెట్రోల్ పాకిస్థాన్ రూపాయిల్లో రూ.117.83 ఉండగా.. డీజిల్ ధర రూ.132.47గా ఉంది. ఇక.. పాల ధర లీటరు ఏకంగా రూ.140 కావటంపై ప్రజలు గుర్రుగా ఉన్నారట.

తాజాగా మొహ్రరం సందర్భంగా ఖీర్.. షర్బత్ లాంటివి పాలతో తయారు చేస్తారు. ఇందుకోసం పాల వినియోగం భారీగా ఉంటుంది. దీంతో అక్కడి పాల మాఫియా బరి తెగించి..ధరల్నిభారీగా పెంచేసినట్లు చెబుతున్నారు. లీటరు పాలు పాక్ రూపాయిల్లో ఇంతగా పెరగటంతో ప్రజలపై భారం భారీగా మారిందంటున్నారు.

పాక్ మీడియా కథనాల ప్రకారం తమ దేశంలో డెయిరీ మాఫియా ప్రజల్ని దోచుకుంటోందని చెబుతోంది. గడిచిన రెండురోజులుగా మెహ్రరం సందర్భంగా పాల వ్యాపారులు తమకు నచ్చిన రీతిలో ధరలు పెంచేసినట్లు వెల్లడించింది.

పాక్ లోని మహానగరాలుగా చెప్పే కరాచీ.. సింధ్ లలో లీటరు పాల ధర ఇంత భారీగా పెరగటాన్ని అక్కడి ప్రజలు ఒక పట్టాన జీర్ణించుకోలేకపోతున్నారట. చూస్తుంటే.. పాక్ లో పాలు తాగటం కన్నా.. వాహనాలు నడపటమే చౌకైన వ్యవహరంగా చెబుతున్నారు.