టిక్ టాక్ ను కొనుగోలు చేయనున్న మైక్రోసాఫ్ట్

Mon Aug 03 2020 18:30:05 GMT+0530 (IST)

Microsoft to buy TikTok

టిక్ టాక్....కరోనా....చైనాలో పుట్టిన ఈ రెండింటికి చాలా పోలికలున్నాయంటే అతిశయోక్తి కాదు. ప్రపంచవ్యాప్తంగా ఈ రెండు పదాలు అతి తక్కువ సమయంలో పాపులర్ అయ్యాయి. ప్రస్తుతం కరోనా వైరస్ ప్రపంచ దేశాలను గడగడలాడిస్తోంటే....కొద్ది సంవత్సరాలుగా టిక్ టాక్ యాప్ ప్రపంచంలోని పలు దేశాలను ఉర్రూతలూగిస్తోంది. కంటికి కనిపించని సూక్ష్మజీవి కరోనా దెబ్బకు పలుదేశాలు విలవిలలాడుతోంటే...టిక్ టాక్ దెబ్బకు పలు సోషల్ మీడియా ప్లాట్ ఫామ్‌లు యాప్‌లు గడగడలాడాయి. అయితే కొద్ది రోజులుగా ఈ యాప్ ....గడ్డుపరిస్థితులను ఎదుర్కొంటోంది. యూజర్ డేటా చౌర్యం యూజర్ గోప్యత నిబంధనల ఉల్లంఘన సర్వర్ల వ్యవహారంతో టిక్ టాక్ సహా 106 చైనాకు చెందిన యాప్ లపై కేంద్రం నిషేధం విధించింది. ఇక భారత్ బాటలోనే పయనించేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సిద్ధమవుతున్నారు. చైనాతో వాణిజ్య దౌత్యపరమైన విభేదాల నేపథ్యంలో చైనా కంపెనీలు యాప్ లపై ట్రంప్ నిప్పులు చెరుగుతున్నారు.రేపో మాపో అమెరికాలో టిక్ టాక్ బ్యాన్ తప్పదనుకుంటున్న తరుణంలో....దిగ్గజ టెక్నాలజీ సంస్థ మైక్రోసాఫ్ట్ సంచలన విషయం వెల్లడించింది. త్వరలోనే అమెరికా టిక్‌టాక్ హక్కులను సొంతం చేసుకోబోతున్నట్లు మైక్రోసాఫ్ట్ సంచలన ప్రకటన చేసింది. సెప్టెంబరు 15 2020 నాటికి టిక్‌టాక్ మాతృసంస్థ బైట్‌డాన్స్‌తో ఒప్పందం కొలిక్కి వచ్చే అవకాశం ఉన్నట్లు మైక్రోసాఫ్ట్ కంపెనీ తన బ్లాగ్‌లో వెల్లడించింది. టిక్‌టాక్ అమెరికా విభాగాన్ని కొనుగోలు చేసేందుకు మైక్రోసాఫ్ట్ పంపిన ప్రతిపాదనలకు బైట్‌డ్యాన్స్ సానుకూలంగా స్పందించిందని ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య ప్రాథమిక చర్చలు ప్రారంభమైనట్లు ఆ బ్లాగ్ లో మైక్రోసాఫ్ట్ పేర్కొంది. యూఎస్‌తో పాటు కెనడా ఆస్ట్రేలియా న్యూజిలాండ్‌లతోనూ టిక్‌టాక్ ను కొనుగోలు చేసే యోచనలో ఉన్నామని తెలిపింది. ఇతర అమెరికా పెట్టుబడిదారుల భాగస్వామ్యాన్ని కూడా ఆహ్వానించబోతున్నట్లు మైక్రోసాఫ్ట్ తెలిపింది.

అయతే ఈ ఒప్పందంతో టిక్‌టాక్ అమెరికా యూజర్ల భద్రతకు వ్యక్తిగత గోప్యతకు ఎలాంటి భంగం వాటిల్లబోదని వారి సమాచారం ఎవరితోనూ పంచుకోబోమని స్పష్టం చేసింది. ఒకవేళ ఈ యాప్‌లో యూజర్ల వ్యక్తిగత డేటా ఇతర దేశాలకు చేరి ఉంటే అన్ని సర్వర్ల నుంచి దానిని డెలిట్ చేయిస్తామని మైక్రోసాఫ్ట్ హామీ ఇచ్చింది. ప్రపంచ స్థాయి అత్యుత్తమ స్థాయి భద్రతా ప్రమాణాలు పాటించి యూజర్లు ప్రభుత్వానికి పారదర్శకంగా ఉంటామని చెప్పింది. మైక్రోసాఫ్ట్ తాజా ఒప్పందంతో అమెరికా ఖజానాకు భారీగా మేలు జరగనుందని తెలిపింది. అయితే టిక్‌టాక్‌కు ఇప్పటికే అమెరికాలో ఎదురుదెబ్బలు తగిలాయి. అమెరికాలోని పలు నిబంధనలను టిక్‌టాక్ ఉల్లంఘించిందని పలు అమెరికా అడ్వకసీ గ్రూపులు టిక్‌టాక్‌పై ఫిర్యాదు చేశాయి. కాపీరైట్ నిబంధనల ఉల్లంఘనపై పలు టాప్ అమెరికన్ మ్యూజిక్ కంపెనీలు టిక్‌టాక్‌పై దావా వేసేందుకు సిద్ధమయ్యాయి. ఈ నేపథ్యంలో టిక్ టాక్ ను మైక్రోసాఫ్ట్ చేజిక్కించుకోవడం గమనార్హం.