విలీనం విషయంలో వారు చేసింది తప్పే

Tue Jun 25 2019 16:29:46 GMT+0530 (IST)

పవర్ పోయినంతనే ప్రత్యర్థి పార్టీలను విలీనం పేరుతో వాటి పీక నొక్కేసే కొత్త సంస్కృతిని జోరుగా సాగిస్తున్న సంగతి తెలిసిందే. మొన్నటికి మొన్న కాంగ్రెస్ పార్టీకి చెందిన 12 మంది ఎమ్మెల్యేలను టీఆర్ ఎస్ లో విలీనం చేయటం సమకాలీన భారతంలో సరికొత్త సంప్రదాయానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తెర తీసిన సంగతి తెలిసిందే.తాజాగా టీడీపీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యుల్ని బీజేపీలో విలీనం చేసిన వైనం కొత్త చర్చకు తావిచ్చింది. ఈ రెండింటి విషయంలోనూ వారు చేసింది చట్టవిరుద్దమని స్పష్టం చేస్తున్నారు మాజీ లోక్ సభ సెక్రటరీ జనరల్ పీడీపీ ఆచార్య. ప్రముఖ పాత్రికేయుడు కరణ్ థాపర్ చేసిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆచార్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

తెలంగాణలో పన్నెండు మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు..  టీడీపీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు బీజేపీలోకి విలీనం కావటం న్యాయసమ్మతం కాదన్నారు. ఇప్పుడు చెబుతున్న విలీనాలన్ని కూడా చట్టవిరుద్దమైనవని.. రాజ్యాంగంలోని 10వ అధికరణం కిందకు రావన్నారు. ఒక పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ విలీనం అయినప్పుడు ఆయా పార్టీ అందుకు అంగీకరించాలని.. తాజా ఉదంతంలో అలాంటిది లేదన్న విషయాన్ని గుర్తు చేశారు.

తాజాగా చోటు చేసుకున్న రెండు విలీనాలలో ఒక పార్టీ మరో పార్టీలో విలీనం కాలేదని.. కేవలం పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు.. ఎంపీలు కొందరు మాత్రమే విలీనం అయ్యారన్న విషయాన్ని ఆయన ప్రస్తావించారు. తాజా విలీనాల్లో రెండు పార్టీలు మరో పార్టీలో పూర్తిగా విలీనం కానప్పుడు.. నేతల విలీనాల్ని విలీనాలుగా గుర్తించలేమన్నారు. మరి.. ఆచార్య వ్యాఖ్యలపై విలీనం పేరుతో కొత్త తరహా ఎత్తుగడలకు తెర తీసిన పార్టీలు ఎలా రియాక్ట్ అవుతాయో చూడాలి.