మెంటల్ హెల్త్ పై..మనోళ్లకు ఇంటరెస్ట్ పెరిగిందబ్బా!

Thu Oct 10 2019 22:35:13 GMT+0530 (IST)

Mental Health Disorders Center

మెంటల్ హెల్త్... మన అచ్చ తెలుగులో చెప్పుకోవాలంటే మానసిక ఆరోగ్యం. ఇప్పటిదాకా దీనిపై మనోళ్లకు ఏమాత్రం ఇంటరెస్ట్ ఉండిందో తెలిసిందేగా. అదేదో రాకూడని జబ్బన్నట్లుగా ఎర్రగడ్డకు తరలించేయాలంటూ చాలా చులకనగా చూసేవారు. అయితే ఇప్పుడు పరిస్థితి మారింది. నిన్నటిదాకా మనోళ్ల నోట హేళనగా మారిన ఈ జబ్బు... ఇప్పుడు అందరికీ అత్యంత ప్రాధాన్యమైన అంశంగానే మారిపోయింది. ఉరుకులు పరుగుల జీవితంలో చాలా జబ్బులనే కొని తెచ్చుకుంటున్న బిజీ లైఫ్ లో... ఆ కొని తెచ్చుకుంటున్న జబ్బుల జాబితాలో ఇప్పుడు మానసిక ఆరోగ్యం కూడా చేరిపోయిందనే చెప్పాలి. అందుకు నిదర్శనంగానే ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం (వరల్డ్ మెంటల్ హెల్త్ డే) సందర్భంగా మనోళ్లంతా దీనిపై తెగ సెర్చ్ చేశారు. ఫలితంగా గురువారం నాటి ట్రెండింగ్ టాపిక్స్ లో మెంటల్ హెల్త్ ప్రథమ స్థానంలో నిలిచింది.నిజమా? అంటే... నిజమే మరి. గురువారం నాడు నెట్ లో ట్రెండింగ్ టాపిక్స్ లో నిలిచిన మెంటల్ హెల్త్ ను శోధించిన వారి సంఖ్య ఏకంగా 2.39 కోట్లకు పైగా నమోదైంది. వరల్డ్ మెంటల్ హెల్త్ డే నాడు ఒకే రోజు ఇంత మంది ఈ టాపిక్ ను సెర్చ్ చేశారంటే... మిగతా రుగ్మతలతో పాటు మెంటల్ హెల్త్ పట్ల కూడా మనోళ్లకు ఎంత ఇంటరెస్ట్ ఏర్పడిందన్న విషయం ఈ ఫిగర్సే చెబుతున్నాయన్న ఆసక్తికర విశ్లేషణలు మొదలయ్యాయి. నిజమే.. పల్లె సీమల పరిస్థితి ఎలా ఉన్నా... నగరాల్లో కాస్తంత స్థితిమంతులుగా ఉన్న కుటుంబాల్లో ఇటీవలి కాలంలో మానసిక రోగులుగా మారుతున్న వారి సంఖ్య క్రమంగానే పెరిగిపోతోంది. ఉరుకుల పరుగుల జీవితంతో పాటు అంతగా శారీరక శ్రమ అవసరం లేని యాంత్రిక జీవితం అలవడిన నేపథ్యంలో మెంటల్ కండీషన్లు తప్పుతున్నాయి మరి.

మనోళ్లకు మెంటల్ హెల్త్ పై అవగాహన పెరిగిన మాదిరిగానే ఈ వ్యాధికి చికిత్స చేసే ఆసుపత్రుల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోందనే చెప్పక తప్పదు. ఈ వైద్యంలోనూ ఇతర వ్యాధులకు మల్లే ఆధునిక చికిత్సా విధానాలు కూడా వచ్చి చేరాయి. వెరసి ఈ వైద్య చికిత్సా రంగంలోనూ కొంగొత్త చికిత్సా పద్దతులు కూడా వచ్చి చేరుతున్నాయి. ఆ ఫలితమే ఇప్పుడు అందరూ ప్రకృతి వైద్యం పట్ల మొగ్గుచూపుతున్నారని చెప్పక తప్పదు. నిజమే మరి.... స్వచ్ఛమైన వాతావరణం కలిగిన పల్లె సీమలను వదిలేసి కాలుష్య కారకాలుగా మారిపోతున్న మన నగరాల్లోకి వచ్చి చేరుతున్న జనానికి ఇతర రోగాల మాదిరిగానే మెంటల్ హెల్త్ కు సంబంధించిన రుగ్మతలు కూడా పొంచి ఉంటున్నాయి. అందుకే ఈ తరహా వ్యాధుల నుంచి ఉపశమనం కోసం తిరిగి ప్రకృతి వైద్యం పేరిట పల్లె సీమల బాట పడుతున్నారు.