మేకపాటి హాట్ కామెంట్స్ : జగన్ పరిపాలనలో లోపాలు ఉన్నాయి...

Sun Jun 26 2022 21:00:01 GMT+0530 (IST)

Mekapati Rajamohan Reddy About Ys Jagan

వైసీపీకి మూల స్థంభాలలో ఆయన ఒకరు. జగన్ కేవలం మూడు నెలల ఎంపీగా ఉన్నపుడే తండ్రి వైఎస్సార్ దుర్మరణం పాలు అయ్యారు. ఆ టైమ్ లో వైఎస్సార్ వల్ల లబ్ది పొందిన వారు అంతా కాంగ్రెస్ ని అట్టిపెట్టుకుని ఉన్నారు. కానీ అప్పటికే సుదీర్ఘమైన రాజకీయ అనుభవం కలిగి సీనియర్ పార్లమెంటేరియన్ గా ఉన్న నెల్లూరు జిల్లా పెద్దాయన మేకపాటి రాజమోహన్ రెడ్డి మాత్రం జగన్ వెంట నిలిచారు. జగన్ జూనియర్ ఎంపీ అయితే మేకపాటి సీనియర్ ఎంపీ. వయసు రిత్యా చాలా తేడా ఉంది. ఆయన కాంగ్రెస్ వల్ల అనేక పర్యాయాలు ఎంపీ అయినా జగన్ లో ఏమి చూసి వెంట వచ్చారు అని అన్న వారూ ఉన్నారు.ఇక మేకపాటికి ఎన్నో వ్యాపారాలు ఉన్నాయి. రాష్ట్రంలో కేంద్రంలో కాంగ్రెస్ ఏలుబడి నిండా నాలుగున్నరేళ్లకు పైగా ఉంది. అయినా కష్టాలు పడడానికే  దుస్సాహసం చేసి జగన్ వెంట నడిచారు. ఆయన ఆ విషయంలో చాలా సార్లు చెప్పారు కానీ లేటెస్ట్ గా కుమారుడు విక్రం రెడ్డి ఆత్మకూరులో విజయం సాధించిన తరువాత మరోమారు తాను ఎందుకు వైసీపీ వెంట నడవాల్సి వచ్చిందో చెప్పుకొచ్చారు.

వైఎస్సార్ కి ఉన్న నాయకత్వ లక్షణాలు జగన్ లో కూడా ఉన్నాయని నమ్మి నడిచానని అది ఈ రోజున నిజం అయిందని ఆనందిస్తున్నాను అని చెప్పారు. నాడు జగన్ని అంతా వ్యతిరేకించారు వైఎస్సార్ చలవతో ఎదిగిన వారు అలా చేయడం తనకు బాధ అనిపించి జగన్ కి అండగా వచ్చాను అని మేకపాటి చెప్పారు. ఇక జగన్ ఎప్పటికి అయినా ఏపీకి పెద్ద నాయకుడు అవుతారు అని నాడే అనుకున్నాను అన్నారు.

మూడేళ్ల వైసీపీ పాలన మీద ఆయన చేసిన కొన్ని హాట్ కామెంట్స్ ఇపుడు చర్చగా ఉన్నాయి. జగన్  పరిపాలనలో కొన్ని లోపాలు ఉన్నాయి అని మేకపాటి నిర్మొహమాటంగా చెప్పడమూ ఇక్కడ విశేషమే. అవి ఏంటి అన్నది ఆయన చెప్పలేదు కానీ వాటిని సరిచేసుకుంటే పొరుగున ఉన్న ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్ మాదిరిగానే జగన్ చిరకాలం ఏపీకి సీఎం గా ఉంటారు అని మేకపాటి చెప్పుకొచ్చారు.

మొత్తానికి పెద్దాయన చాలా పెద్ద మనసుతోనే జగన్ పాలన గురించి చెప్పారు అనుకోవాలి. ఆయన వైఎస్సార్ తనయుడి గురించి ఆయన పాలన గుర్తించి నిష్పాక్షింగానే చెప్పారు. లోపాలు అయితే ఉన్నాయి. వాటిని జగన్ తెలుసుకుని లేకుండా చూసుకోవాలి. అలా కనుక చేస్తే రాజకీయంగా యువకుడిగా ఉన్న జగన్ కి మంచి ఫ్యూచర్ ఉంటుంది. ఒక సీనియర్ గా పార్టీ పుట్టుక నుంచి ఉన్న మేకపాటి జగన్ కి ఇచ్చిన సలహా ఇదే అనుకోవాలి. మరి దీన్ని జగన్ పాటిస్తారా. చూడాలి.