ఆ పార్టీకి మెగా మెగా ట్రబుల్స్... ?

Sat Jan 15 2022 08:00:01 GMT+0530 (IST)

Megastar In Politics

అదేంటో చిరంజీవి అంతటి మంచి వారు ఉండరు. ఆయన అసలు పేరు శివ శంకర వర ప్రసాద్. ఇక రీసెంట్ గా ఆయనతో భోళా శంకర్ సినిమా తీస్తున్నారు. నిజానికి చిరంజీవిని భోళా శంకరుడిగానే తెలిసిన వారంతా అంటారు. ఆయనలో ఉన్నది మంచితనం. లేనిది లౌక్యం. అందుకే అంతటి మెగాస్టార్ ఎన్టీయార్ తో సరిసమానంగా మాస్ ఇమేజ్ కలిగిన చిరంజీవి ముఖ్యమంత్రి కాగలిగిన  అన్ని అర్హతలు ఉండి కూడా కాలేకపోయారు.ఆయనలోని సున్నిత తత్వం. గట్టిగా ఉండలేకపోవడం దూకుడు చేయకపొవడం వంటివే ఆయన పొలిటికల్ కెరీర్ ని దెబ్బతీశాయని చెప్పాలి. సరే చిరంజీవి పార్టీ పెట్టి దాన్ని కాంగ్రెస్ లో విలీనం చేసి కేంద్ర మంత్రి అయారు. ఆ తరువాత రాజకీయాలు వద్దు అనుకుని సినిమాలు చేస్తున్నారు. అంతవరకూ బాగానే ఉన్నా కూడా ఏపీ రాజకీయాల్లో ఆయన ప్రభావం మాత్రం తగ్గలేదు. ఆయన తాను కేవలం సినీ నటుడిని మాత్రమే రాజకీయాలు వద్దు అని చెబుతున్నా ఆయన చుట్టూ ఎన్నో కధనాలు. ఆయన మీద ఎన్నో ఊహాగానాలు అలా వచ్చి పడుతూనే ఉన్నాయి.

ఆయన సాధారణ ఫిగర్ కాదు తన పనేదో తానేదో చేసుకుని పోయేందుకు ఇష్టపడని నైజం. అందరికీ సాయపడాలన్న గుణం ఇలా ఆయన వద్దనుకున్నా సినీ పెద్దగా టాలీవుడ్ ఎపుడో గుర్తించేసింది. ఇక తాను సినిమా బిడ్డనే అని చెప్పుకుని ఆయన ప్రభుత్వాలతో చర్చలకు వెళ్తున్నారు. తెలంగాణా సీఎం  కేసీయార్ తో కూడా చనువుగా చిరంజీవి ఉంటారు. అయితే అక్కడ మాత్రం ఎలాంటి రాజకీయ సమస్యలు రావడం లేదు

ఏపీకి వచ్చేసరికి చూస్తే ఆయన జగన్ తో భేటీ అయిన ప్రతీసారీ తమ్ముడు పార్టీ ఇబ్బందులు పడుతోంది. చిరంజీవి కూడా ఉన్నదు ఉన్నట్లుగా మాట్లాడుతారు. బోళాగా ఉంటారు కాబట్టి ఏదీ దాచుకోకుండా చెప్పేస్తారు. ఆయన ఇప్పటికి ఎన్నో సార్లు జగన్ పాలన బాగుందని కితాబులు ఇచ్చారు. ఇక లేటెస్ట్ మీటింగ్ తరువాత కూడా మీడియా ముందు ఉత్సాహం ఆపుకోలేక జగన్ తనకు సోదర సమానుడు అంటూ బాగా ఎత్తేశారు.

ఇదే ఇపుడు జనసైనికులను కలవరపెడుతోంది. ఏపీలో పవన్ కి జగన్ కి ఉప్పూ నిప్పులా పొలిటికల్ సీన్ ఉంది. ఇప్పటికి ఒక్కసారి కూడా పవన్ జగన్ మీట్ కాలేదు అంటేనే వారి మధ్య ఎంతలా రాజకీయ అగాధం ఉందో అర్ధం చేసుకోవాలి. అలాంటిది స్వయంగా అన్నగా ఉన్న మెగాస్టార్ జగన్ ఇంట్లో విందారగించి వస్తున్నారు. ఆయన్ని మెచ్చుకుంటున్నారు. దీంతో  జనసేన మీద ఆ ప్రభావం పడుతోంది అన్నదే ఆ పార్టీ నేతల ఆవేదనగా ఉందిట.

నిజానికి చిరంజీవి తాను రాజకీయాలు దూరం అనే చెబుతున్నారు. కానీ ఆయన ఎలా చెప్పినా జనసేనానికి స్వయాన  అన్నయ్య. దాంతో అన్నయ్య జగన్ని పొగుడుతూంటే ఆ ఇంపాక్ట్ జనాల్లోకి పోతుంది. అపుడు తమ్ముడు అనవసరంగా డిఫర్ అవుతున్నారు అన్న ఫీలింగ్ కూడా వస్తుంది. పైగా మెగాస్టార్ కి జనాలలో ఉన్న ఇమేగ్ కానీ ఆయన ఉన్నత వ్యక్తిత్వం కానీ చాలా పెద్ద ఎత్తున ప్రభావం చూపుతాయి.

మొత్తానికి మెగాస్టార్ వైసీపీలో చేరకపోయినా రాజ్యసభ సభ్యుడు కాకపోయినా కూడా ఇలా జగన్ని పొగుడుతూ జనసేనకు ఇబ్బందులు తెచ్చిపెడుతున్నారు అన్న ప్రచారం అయితే ఉంది. నిజానికి మెగాస్టార్ కి ఎటువంటి రాజకీయ ఆకాంక్షలు లేవు. ఎవరి మీద వ్యక్తిగతంగా అపేక్షలు ద్వేషాలు లేవు. ఆయన తటస్థంగా ఉంటారు. ఉన్నది ఉన్నట్లుగా చెబుతారు.

కానీ సగటు జనాలు అలా అనుకోరుగా. అందుకే మెగాస్టార్ తమకే ఎదురొస్తున్నారా అన్న ఆవేదన అయితే జనసైనికుల్లో ఉందని అంటున్నారు. కానీ ఇది ఎవరూ ఏమీ చేయలేనిది. ఎందుకంటే ఆయన మెగాస్టార్. ఆయనకు ఎంతో స్ట్రేచర్ ఉంది. ఆయన వేసే అడుగులు చేసే చర్యలు మాట్లాడే దాన్ని ఎవరూ నియంత్రించలేరు. కాకపోతే ఆ తేడాను జనాలకు వివరించి తమ వైపు వారిని తిప్పుకోవాల్సిన బాధ్యత ఏదో జనసైనికులే చూసుకోవాలి అంతే.