సాయిధరమ్ తేజ్ యాక్సిడెంట్: ఇసుక వేసిన కంపెనీకి లక్ష జరిమానా

Tue Sep 14 2021 11:14:50 GMT+0530 (IST)

Mega Hero Saidharam Tej Accident

మెగా హీరో సాయిధరమ్ తేజ్ ప్రమాదానికి ప్రధాన కారణం ఆ రోడ్డుపై ఇసుక మట్టి ఉండడం.. ఈ ఇసుకను రోడ్డుపై వేసింది అక్కడ నిర్మాణ పని చేపట్టిన ఓ కన్ స్ట్రక్షన్ కంపెనీ. రోడ్డుపై సదురు కంపెనీ మట్టి వ్యర్థాలు అలాగే ఉంచడం వల్లే సాయితేజ్ బైక్ స్కిడ్ అయ్యి పడినట్లుగా ఆరోపణలు ఉన్నాయి.ఈ క్రమంలోనే రోడ్డుపై ఇసుక వేసి నిర్లక్ష్యంగా వ్యవహరించిన కన్ స్ట్రక్షన్ కంపెనీపై చర్యలు తీసుకోవాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ ఘటనతోనే జీహెచ్ఎంసీ అప్రమత్తమైంది.

హైదరాబాద్ నగర వ్యాప్తంగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న కన్ స్ట్రక్షన్ కంపెనీలపై జీహెచ్ఎంసీ అప్రమత్తమైంది. నగరవ్యాప్తంగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న కన్ స్ట్రక్షన్ కంపెనీలపై కొరఢా ఝలిపిస్తోంది. ఇందులో భాగంగానే ఖానమేట్ పరిధిలో భవన నిర్మాణం చేపడుతున్న అరబిందో కన్ స్ట్రక్షన్ కంపెనీపై భారీ జరిమానా విధించింది జీహెచ్ఎంసీ. సంబంధిత అధికారుల అనుమతి లేకుండా రోడ్డుపై ఇసుక వ్యర్థాలను ఉంచినందున హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ యాక్ట్ ప్రకారం లక్ష రూపాయల జరిమానా విధించారు.

అయితే హీరో సాయిధరమ్ తేజ్ ప్రమాదానికి.. ఇప్పుడు ఫైన్ విధించిన కన్ స్ట్రక్షన్ కంపెనీతో ఎటువంటి సంబంధం లేదని జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ ఎన్.సుధాంశు తెలిపారు.

ఈనెల 10న సాయిధరమ్ తేజ్ ప్రమాదానికి ప్రధాన కారణం రోడ్డుపై ఇసుకనే. బైక్ స్కిడ్ అయ్యి అతడు ప్రమాదానికి గురయ్యాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన సాయిధరమ్ తేజ్ అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. అయితే ప్రమాదం జరిగిన వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం సాయిధరమ్ తేజ్ కోలుకుంటున్నాడు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేశారు.