Begin typing your search above and press return to search.

పార్ల‌మెంట్ః ర‌చ్చైనా ఓకే.. చ‌ర్చ మాత్రం జ‌ర‌గొద్దు!

By:  Tupaki Desk   |   1 Aug 2021 4:30 PM GMT
పార్ల‌మెంట్ః ర‌చ్చైనా ఓకే.. చ‌ర్చ మాత్రం జ‌ర‌గొద్దు!
X
ప్ర‌జాస్వామ్య ప్రాథ‌మిక సూత్రం చ‌ర్చ‌. ప్ర‌జాప్ర‌తినిధులు అన‌బ‌డేవారు ప్ర‌జ‌లు ఎదుర్కొంటున్న‌ స‌మ‌స్య‌ల‌ను సేక‌రించి, వాటిపై చ‌ర్చించి, ప‌రిష్కార మార్గాల‌ను క‌నుగొనాలి. ఇందుకు అస‌లైన వేదిక చ‌ట్ట స‌భ‌. రాష్ట్రంలో అసెంబ్లీ కాగా.. దేశంలో పార్ల‌మెంట్‌. ప్ర‌జ‌ల త‌ల‌రాత‌ల‌నే మార్చ‌గ‌లిగే శ‌క్తి వీటికుంది. ఇంత ప్ర‌ధాన‌మైన చ‌ట్ట స‌భ‌ల్లో నేడు కొన‌సాగుతున్న ప‌రిస్థితి చూస్తే.. స‌భ్యుల తీరు ఎంత అధ్వానంగా త‌యారైందో అర్థ‌మైపోతుంది. తాజాగా ముగిసిన పార్ల‌మెంట్ వ‌ర్షాకాల స‌మావేశాల‌ను చూస్తే ఎన్నో సందేహాలు వ్య‌క్త‌మవుతున్నాయి. చ‌ర్చ జ‌ర‌గ‌కుండా ఏదో ఒక వివాదం సృష్టించి, స‌మావేశాల‌ను ముగించ‌డ‌మే ఇప్పుడు న‌డుస్తున్న ట్రెండ్ గా క‌నిపిస్తోంది.

గ‌తంలో పార్ల‌మెంటులో స‌మావేశాలు ఫ‌ల‌వంతంగా సాగినా లేకున్నా.. అర్థ‌వంతంగా మాత్రం ముగిసేవి. ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌పై ఒక చ‌ర్చ జ‌రిగేది. విప‌క్షాలు చేసే సూచ‌న‌ల‌ను అధికార ప‌క్షం ఆల‌కించేది. స‌మ‌స్య‌ల‌పై చ‌ర్చించ‌డానికి వారికి స‌మ‌యం ఇచ్చేది. కానీ.. ఇప్పుడు ఇవేవీ లేకుండా పోయాయ‌ని తాజా స‌మావేశాలు రుజువు చూపిస్తున్నాయి. జూలై 19న మొద‌లైన పార్ల‌మెంటు శీతాకాల స‌మావేశాలు.. ముగిసేంత వ‌ర‌కూ ఏ విష‌యం మీద‌కూడా స‌రైన‌ చ‌ర్చ జ‌ర‌గ‌లేదంటే.. కొన్ని బిల్లుల‌పై అస‌లు చర్చే లేకుండా ఆమోదించారంటే.. ప‌రిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవ‌చ్చు.

ఈ స‌మావేశాల్లో చ‌ర్చించ‌డానికి ఎన్నో కీల‌క అంశాలు ఉన్నాయి. కానీ.. అవేవీ చ‌ర్చ‌కు రాలేదు. క‌రోనా సెకండ్ వేవ్ దేశంపై ఎంత‌టి ప్ర‌భావం చూపిందో అంద‌రికీ తెలిసిందే. ఇప్పుడు థ‌ర్డ్ వేవ్ హెచ్చ‌రిక‌లు వినిపిస్తున్నాయి. దేశంలో 46 జిల్లాలో పాజిటివిటీ పెరుగుతోంద‌ని నివేదిక‌లు చెబుతున్నాయి. సెకండ్ వేవ్ ను నిర్ల‌క్ష్యంగా వ‌దిలేయ‌డం వ‌ల్లే.. అంత దారుణం సంభ‌వించింద‌నే విమ‌ర్శ‌లు వ్య‌క్త‌మ‌య్యాయి. చివ‌ర‌కు విదేశీ మీడియా సైతం కేంద్ర ప్ర‌భుత్వం తీరును ఆక్షేపించింది. మ‌రి, అలాంటి అనుభ‌వం నుంచి ఏం నేర్చుకున్నారు? థ‌ర్డ్ వేవ్ కు ప్ర‌భుత్వం ఏవిధంగా స‌న్నద్ధ‌మ‌వుతోంది? ఆసుప‌త్రుల్లో ఆక్సీజ‌న్ అంద‌క‌నే వేలాది మంది చ‌నిపోయారు. మ‌రి, ఈ సారి ఆ ప‌రిస్థితి రాకుండా.. ఎలాంటి చ‌ర్య‌లు తీసుకున్నారు? అనే ప్ర‌ధాన చ‌ర్చ జ‌ర‌గాల్సి ఉంది. ప్ర‌భుత్వం, విప‌క్షాలు రెంటిపైనా ఈ బాధ్య‌త‌ ఉంది. కానీ.. ఈ చ‌ర్చ జ‌ర‌గ‌కుండానే స‌మావేశాలు ముగిసిపోయాయి.

వ్య‌వ‌సాయ చ‌ట్టాల గురించి కూడా స‌భ‌లో చ‌ర్చించాల్సిన అవ‌స‌రం మోడీ ప్ర‌భుత్వానికి ఉంది. రైతులు నెల‌ల త‌ర‌బ‌డి ఆందోళ‌న‌లు చేసిన నేప‌థ్యంలో.. ఎంతో మందికి ఎన్నో అనుమానాలు ఉన్న నేప‌థ్యంలో.. వాటిని నివృత్తి చేయాల్సిన బాధ్య‌త కూడా స‌ర్కారుదే. ఇందుకు పార్ల‌మెంటులో చ‌ర్చ‌లే ఏకైక మార్గం. కానీ.. దీనికి కూడా స‌ర్కారు బాధ్య‌త తీసుకోలేద‌నే అభిప్రాయ‌మే వ్య‌క్త‌మైంది. ఇక‌, మిగిలిన అంశాలు ఎజెండాలో ఉన్న సంగ‌తి కూడా జ‌నాల‌కు తెలియ‌ని ప‌రిస్థితి.

ఈ స‌మావేశాల‌ను కుదిపేసిన ఏకైక అంశం పెగాస‌స్‌. విప‌క్ష నేత‌లు, జ‌ర్న‌లిస్టులు, కొంద‌రు కేంద్ర మంత్రులు, చివ‌ర‌కు సుప్రీం కోర్టు జ‌డ్జిల మీద కూడా పెగాస‌స్ సాఫ్ట్ వేర్ తో నిఘా పెట్టార‌ని, వారి ఫోన్ల‌ను ట్యాప్ చేసి, వారి మాట‌లు వింటున్నార‌నే విష‌యం మీద‌నే పార్ల‌మెంట్ స‌మావేశాలు కొన‌సాగాయి. ఇందులో కూడా చ‌ర్చ జ‌రిగిందా అంటే.. అది లేదు. కేవ‌లం ర‌చ్చ మాత్ర‌మే. ఈ అంశంపై త‌ప్ప మిగిలిన అంశాల‌ను విప‌క్షాలు గాలికి వ‌దిలేశాయి. ప్ర‌భుత్వం మాత్రం ఈ అంశాన్ని కూడా చ‌ర్చ‌లోకి రాకుండా జాగ్ర‌త్త ప‌డింద‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.

ఈ అంశంపై చ‌ర్చ జ‌ర‌గాల‌ని, ప్ర‌ధాని మోడీ స‌మాధానం ఇవ్వాల‌ని విప‌క్షాలు డిమాండ్ చేశాయి. కానీ.. మోడీ మాత్రం నోరు విప్ప‌లేదు. అధికార ఎంపీలు అదంతా బోగ‌స్ అని చెప్ప‌డం, ప్ర‌భుత్వంపై నింద‌లు వేస్తున్నార‌ని చెప్ప‌డం త‌ప్ప‌.. చ‌ర్చ‌కు సిద్దం కాలేదు. క‌నీసం విచార‌ణ జ‌రిపిస్తామ‌ని కూడా చెప్ప‌లేదు. మ‌రి, త‌ప్పు చేయ‌న‌ప్పుడు ఈ ఉలికిపాటు ఎందుకు? మౌనంగా ఉండాల్సిన అవసరం ఏంటీ? అన్న‌ది విప‌క్ష‌నేత‌ల‌తోపాటు అంద‌రికీ ఎదుర‌య్యే ప్ర‌శ్న‌. అయిన‌ప్ప‌టికీ.. అధికార పార్టీ.. స‌భ‌లో ర‌చ్చ జ‌ర‌గ‌డాన్ని చూసింది త‌ప్ప‌, చ‌ర్చ‌కు మాత్రం అవ‌కాశం ఇవ్వ‌లేద‌ని విశ్లేష‌కులు అభిప్రాయ ప‌డుతున్నారు. ఈ స‌మావేశాల్లో మొత్తం 107 గంట‌ల‌పాటు కార్య‌క‌లాపాలు సాగాల్సి ఉండ‌గా.. కేవ‌లం 18 గంట‌లు జ‌రిగిన‌ట్టు ప్ర‌భుత్వ వ‌ర్గాలు వెల్ల‌డించాయి. ఈ స‌మావేశాల పేరిట ఖ‌ర్చ‌యిన ప్ర‌జాధ‌నం ఏకంగా 133 కోట్ల రూపాయ‌లు! మ‌రి, ఏం సాధించిన‌ట్టు?