Begin typing your search above and press return to search.

మెడికల్ పీజీ విద్యార్థులు జిల్లా ఆస్పత్రులకు వెళ్లాల్సిందే !

By:  Tupaki Desk   |   21 Sep 2020 11:30 AM GMT
మెడికల్ పీజీ విద్యార్థులు జిల్లా ఆస్పత్రులకు వెళ్లాల్సిందే !
X
వైద్య విద్య పీజీలో ఎండీ, ఎంఎస్‌ చేసే స్టూడెంట్స్ ఇక నుండి రెండో సంవత్సరం నుండి జిల్లా ఆస్పత్రుల్లో శిక్షణ పొందడం తప్పనిసరి చేసింది. దీనితో అసలు క్షేత్రస్థాయిలో వచ్చే వ్యాధులపై మెడికోలకి ఓ అవగాహన రావడంతో పాటు.గా, జిల్లా ఆస్పత్రుల్లో స్పెషలిస్టుల వైద్య సేవలు పూర్తిగా అందుబాటులోకి తీసుకురావడానికి ఈ నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే గెజిట్‌ కూడా విడుదల చేశారు. గత కొంతకాలంగా రూరల్ సర్వీస్ పై రకరకాల వాదనలు తెరపైకి వస్తున్నాయి. ఈ మేరకు 'పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ సవరణ నిబంధనలు- 2020'ని విడుదల చేసింది.

కనీసం , వంద పడకలకు తక్కువ కాకుండా ఉన్న జిల్లా ఆస్పత్రుల్లో వీరికి శిక్షణ ఇవ్వనున్నారు. ఈ ఏడాది పీజీలో చేరిన వారికి వచ్చే ఏడాది నుండి ఈ నిబంధన అమలు కానుంది. ఇప్పటివరకు పీజీ విద్యార్థులు టీచింగ్‌ ఆస్పత్రుల్లోనే శిక్షణ పొందుతున్నారు. తాజాగా కేంద్రం ఈ సంచలన నిర్ణయం తీసుకుంది. కొత్త నిబంధన ప్రకారం... 3, 4, 5 సెమిస్టర్లలో ఉన్న పీజీ విద్యార్థులు ప్రతి మూడు నెలలకోసారి రొటేషన్‌ పద్ధతిలో జిల్లా ఆసుపత్రుల్లో పని చేయాల్సి ఉంటుంది. ఇలా శిక్షణకు వెళ్లిన వారిని జిల్లా రెసిడెంట్లుగా పిలుస్తారు. దానిని జిల్లా రెసిడెన్సీ ప్రోగ్రాం అంటారు. వాస్తవానికి జిల్లా ఆస్పత్రులే క్షేత్రస్థాయిలో ఎక్కువ సేవలందిస్తుంటాయి. రెండోస్థాయి సూపర్‌ స్పెషాలిటీ వైద్య సేవలు అందించడంలో ప్రముఖ పాత్ర వహిస్తాయి. అలాగే జిల్లా ఆస్పత్రుల్లో పీజీ విద్యార్థులు ఉండటం వల్ల, క్షేత్రస్థాయి పరిస్థితులు, ప్రజల ఆరోగ్య పరిస్థితుల డాక్టర్లకు అవగాహన పెరగనుందని నిపుణులు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మెడికల్‌ కాలేజీల కంటే జిల్లా ఆస్పత్రులే ప్రజలకు మరింత దగ్గరగా ఉంటాయి. ప్రస్తుతం జిల్లా ఆస్పత్రుల్లో పని చేసే స్పెషాలిటీ వైద్యులకు తోడు పీజీ వైద్య విద్యార్థులు కూడా జత కలిస్తే వైద్యుల కొరత కూడా కొంచెం తగ్గినట్లు అవుతుంది.