మంత్రిగారి నిర్వాకం.. మీడియా వాళ్లు కెమెరాలు కట్ చేశారు.. !

Wed Dec 08 2021 15:07:38 GMT+0530 (IST)

Media has cut off Ministerial administration

కొన్ని కొన్ని సంఘటనలు చిత్రంగా ఉంటాయి. ఇలా కూడా జరుగుతూ ఉంటుందా ? అని ఆశ్చర్యం కూడా వ్యక్తం చేస్తూ ఉంటాం. ఇలాంటి ఘటనే ఇప్పుడు చిత్తూరు జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాకు చెందిన ఒక కీలక మంత్రి మీడియాతో మాట్లాడుతున్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రస్తుతం చర్చనీయాంశంగా మారి న.. ఓటీఎస్ (వన్ టైమ్ సెటిల్మెంట్) గురించి ఆయన సమావేశం ఏర్పాటు చేశారు.ఓటీఎస్ మంచిదేనని.. ఇది పేదలకు ప్రయోజనకరంగా మారుతుందని.. దీనిపై ఎవరు ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని.. మంత్రి వివరించే ప్రయత్నం చేశారు.

అయితే.. సాధారణంగా సదరు మంత్రికి మీడియా అంటే.. జంకు ఉన్న విషయం తెలిసిందే. ఆయన ఏం మాట్లాడినా.. కొంత అర్ధం కానట్టుగా ఉంటుందని.. వైసీపీ నాయకులే చెబుతుంటారు. ఇప్పుడు ఇలానే ఆయన ఓటీఎస్ పై మాట్లాడుతూ.. తడబడ్డారు. ఓటీఎస్ పెట్టింది జగనే అన్న సదరు మంత్రి.. ఓటీఎస్ చంద్రబాబు కూడా అమలు చేయాలని చూశారని.. కానీ ఇప్పుడు విమర్శలు చేస్తున్నారని.. ఆయన చెప్పారు. దీంతో మీడియా మిత్రులు విస్తుబోయారు.

ఓటీఎస్ జగన్ ప్రభుత్వం తీసుకువచ్చినప్పుడు.. మధ్యలో చంద్రబాబు ఎందుకని ? ప్రశ్నించారు. దీంతో మంత్రి వెంటనే ఓటీఎస్‌పై తనకు పూర్తిగా అవగాహన లేదని మొహమాటం లేకుండా చెప్పేశారు.

మరి మీరు ఎలా మాట్లాడుతున్నారని.. ప్రజలను ఏవిధంగా మోటివేట్ చేస్తారని.. మీడియా మిత్రులు ప్ర శ్నించారు. దీంతో సదరు మంత్రి వర్యులు స్టేజ్‌మీడకు తన పీఏను పిలిపించుకుని.. విషయం ఏంటని.. ప్రశ్నించారు. కానీ సదరు పీఏకు కూడా.. విషయం తెలియకపోవడంతో ఇప్పుడే వస్తానంటూ.. పక్కనే ఉన్న రూంలోకి వెళ్లిపోయి.. తన శాఖకు చెందిన సెక్రటరీకి ఫోన్ చేశారు.

అయితే.. సదరు సెక్రటరీ ఆ సమయానికి ఫోన్ లిఫ్ట్ చేయలేదు. దీంతో పది నిమిషాల వరకు మంత్రి వర్యులు రూం నుంచి బయటకు రాకపోవడంతో.. మీడియా మిత్రులు.. మైకులు కట్టేసి.. టీ తాగేసి.. సర్దుకున్నారట. ఈ ఘటనతో మంత్రి వర్యులు చిన్నబుచ్చుకుని.. ఇంత పెద్ద సబ్జెక్టులు నాకు అప్పగిస్తే.. ఎలా? అంటూ.. పీఏపై రుసరుస లాడారట. అయితే.. పీఏ ఏం మాట్లాడలేక.. అక్కడ నుంచి వెళ్లిపోయారట. ఇదీ.. సంగతి..!