తన పెళ్లికి కేసీఆర్ ను పిలిచిన మెదక్ ఎస్పీ చందన

Wed Sep 11 2019 16:24:28 GMT+0530 (IST)

Medak SP Chandana Deepthi Invited Telangana CM KCR For Her Marriage

ఒక రాష్ట్రంలో చాలామంది ఐఏఎస్ లు.. ఐపీఎస్ లు చాలామందే ఉంటారు.కానీ.. కొందరు అధికారులకు మాత్రం ప్రత్యేకమైన ఇమేజ్ ఉంటుంది. వారేం చేసినా.. మీడియా అటెన్షన్ కూడా ఉంటుంది. అలాంటి అధికారుల్లో మెదక్ జిల్లా ఎస్పీ చందన దీప్తి ఒకరు. ఆమెకు సంబంధించిన చాలానే వార్తలు ఇంటర్నెట్ లోనూ.. సోషల్ మీడియాలోనూ కనిపిస్తాయి.మిగిలిన అధికారులకు భిన్నమైన రీతిలో ఉండే ఆమె.. తన మనసులోని మాటను బయటపెట్టేందుకు ఏ మాత్రం వెనుకాడరు. ముక్కుసూటిగా మాట్లాడే అలవాటున్న ఆమెను ఆ మధ్య ఒక ఇంటర్వ్యూలో పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చినప్పుడు ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు.

తాను లవ్ మ్యారేజ్ చేసుకుంటానని చెప్పిన ఆమె.. అయితే తనకు పెళ్లి అయిపోయిందని ఇంటర్నెట్ లో గాలి వార్తలు హల్ చల్ చేయటంతో తనకు కాబోయే వాడ్ని ఇప్పటివరకూ కలవలేకపోయినట్లుగా సరదాగా వ్యాఖ్యానించారు. ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఇదిలా ఉంటే.. తాజాగా ఆమె పెళ్లి పక్కా అయ్యింది. ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి సన్నిహితులైన బంధువుల అబ్బాయితో ఆమె పెళ్లి కుదిరినట్లు తెలుస్తోంది. తాజాగా తన పెళ్లి శుభలేఖను తీసుకొని ప్రగతిభవన్ కు వచ్చిన ఆమె.. సీఎం కేసీఆర్ ను కలిసి.. తమ పెళ్లికి రావాలని కోరారు.

అక్టోబరులో జరిగే ఈ పెళ్లికి సీఎం కేసీఆర్ తప్పక హాజరవుతారని చెబుతున్నారు. అదే సమయంలో.. అబ్బాయి తరఫున ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి తప్పక వస్తారని తెలుస్తోంది. మొత్తంగా చూస్తే.. ఐపీఎస్ చందన దీప్తి వివాహ వేడుక ప్రముఖల సమక్షంలో గ్రాండ్ గా జరుగుతుందంటున్నారు. ఆల్ ద బెస్ట్ చెప్పేద్దాం.