హామీలిచ్చి నెరవేర్చలేదని మేయర్ ను ట్రక్ కు కట్టి ఈడ్చుకెళ్లారు

Thu Oct 10 2019 17:34:42 GMT+0530 (IST)

Mayor dragged through streets by people angry at state of roads

దారుణం చోటు చేసుకుంది. ఎంత తప్పు చేస్తే మాత్రం.. అనాగరికంగా.. చట్ట విరుద్ధంగా చేసిన ఈ వైనం ప్రపంచం వ్యాప్తంగా సంచలనంగా మారింది. దేశాలకు అతీతంగా ఏ దేశంలో అయిన రాజకీయ నేతలు ఎన్నికల్లో వాగ్ధానాలు ఇవ్వటం.. వాటిని నెరవేర్చకుండా ఉండటం మామూలే.ఇదే తీరులో మెక్సికోలోనూ ఒక మేయర్ఇదే పని చేశారు. కానీ.. అక్కడి ప్రజలు మాత్రం రాజకీయ నేతలకు వణుకు పుట్టేలా నిర్ణయం తీసుకున్నారు. తమకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్ని నెరవేర్చలేదన్న ఆగ్రహంతో సదరు మేయర్ ను కిడ్నాప్ చేసి.. ట్రక్ కు కట్టేసి.. ఈడ్చుకెళ్లి అనాగరికంగా వ్యవహరించారు.

దక్షిణ మెక్సికోకుచెందిన పౌరులు చేసిన ఈ పని ఇప్పుడు పెనుసంచలనంగా మారింది. మెక్సికో దేశంలోని దక్షిణ భాగంలో చిపాస్ రాష్ట్రం ఉంది. అందులోని లాస్ మార్గరీటాస్ పట్టణం ఒకటుంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీల్ని ఈ పట్టణ మేయర్ నెరవేర్చలేదన్న కోపంతో 30 మందితోకూడిన తోజోలాబల్ తెగకు చెందిన వారు మేయర్ (జార్జ్ లూయిస్ ఎస్కాండన్ హెర్నాండెజ్ను) ను బయటకు బలవంతంగా లాక్కొచ్చారు. అనంతరం ఒక ట్రక్ వెనుక భాగంలో కట్టి ఈడ్చుకెళ్లారు. కొన్ని మీటర్లపాటు అలా లాక్కెళ్లిన వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో.. ప్రాణాఫాయం నుంచి తృటిలో తప్పించుకున్నారు.

దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ దారుణానికి పాల్పడిన వారిపై కిడ్నాప్.. హత్యాయత్నం కేసుల్ని నమోదుచేశారు. ఇప్పటికే ఈ దారుణానికి సంబంధం ఉందని భావిస్తున్న పదకొండుమందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఏమైనా ప్రజాగ్రహం ఒక దశను దాటితే.. ఇలాంటి దారుణాలకు కొంతమంది తెగబడే ప్రమాదం ఉందన్నది రాజకీయ నేతలకు హెచ్చరికగా చెప్పక తప్పదు.


వీడియో కోసం క్లిక్ చేయండి