అనుకున్నది సాధించిన మేయర్ బొంతు

Sat Nov 21 2020 12:01:48 GMT+0530 (IST)

Mayor Bontu achieved what was expected

గ్రేటర్ హైదరాబాద్ మహానగరానికి మేయర్ గా వ్యవహరిస్తున్న బొంతు రామ్మోహన్.. ఎట్టకేలకు తాను అనుకున్నది సాధించారు. గ్రేటర్ ఎన్నికల్లో ఈసారి తనకు కాకుండా తన భార్యకు టికెట్ ఇప్పించుకోవటంలో ఆయన విజయం సాధించారు. ఈసారి మేయర్ పదవి మహిళ జనరల్ కేటగిరికి పరిమితం కావటంతో.. మేయర్ గా వ్యవహరిస్తున్న బొంతు బరి నుంచి తప్పుకున్నారు. ఇప్పటికే ఆయనకు ఎమ్మెల్సీ కోటాలో పదవి ఇస్తారన్న హామీ లభించింది.తనకు లభించిన అవకాశాన్ని తన భార్యకు ఇవ్వాలనుకున్నారో ఏమో కానీ.. మేయర్ పదవి మహిళా జనరల్ కు కేటాయించిన నేపథ్యంలో.. తన భార్యకు కార్పొరేటర్ టికెట్ ఇప్పించుకొని.. ఆమెను మేయర్ పీఠం మీద కూర్చునేలా పావులు కదుపుతున్నారు. మంత్రి కేటీఆర్ తో తనకున్న సానిహిత్యాన్ని అసరా చేసుకొని.. మేయర్ పీఠం మీద మరోసారి తమ కుటుంబ సభ్యులే ఉండాలన్నపట్టుదలతో బొంతు ఉన్నట్లు చెబుతున్నారు.

ఇందులో భాగంగా తొలి అడుగు కింద.. తన భార్య శ్రీదేవికి తాను ప్రాతినిధ్యం వహిస్తున్న చర్లపల్లి డివిజన్ కు టీఆర్ఎస్ టికెట్ ను కన్ఫర్మ్ చేయించుకోగలిగారు. వాస్తవానికి చర్లపల్లి డివిజన్ అభ్యర్థిత్వంపై మొదటి రెండు లిస్టుల్లో బొంతు సతీమణి పేరు లేదు. చివర్లో విడుదల చేసిన జాబితాలో ఆమె పేరు ఉంది. దీంతో.. బొంతు ఆనందానికి అవధుల్లేకుండా పోయిందని చెబుతున్నారు.

ఇప్పుడేమో పార్టీ టికెట్.. రేపు మేయర్ పీఠం తమదే అన్న మాట బొంతు వర్గీయుల్లో వినిపిస్తోంది. మంత్రి కేటీఆర్ తో ఆయనకున్న సన్నిహిత సంబంధాలే ఆయన టికెట్ రిక్వెస్టును ఓకే అయ్యేలా చేసిందంటున్నారు. ఇక మేయర్ పదవి విషయానికి వస్తే.. ఎవరెన్ని చెప్పినా  అంతిమంగా సీఎం కేసీఆర్ నిర్ణయం మీదే ఆధారపడి ఉంటుందని చెబుతున్నారు. మరోవైపు.. ఉప్పల్ ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్న భేతి సుభాష్ రెడ్డి తన సతీమణి సిట్టింగ్ కార్పొరేటర్ స్వప్నకు హబ్సిగూడ టికెట్ ను కన్ఫర్మ్ చేసుకున్నారు. మొత్తానికి పలువురు నేతలు తమ సతీమణులకో.. కుటుంబ సభ్యులకో.. బంధువులకో టికెట్ ఇప్పించుకునే విషయంలో విజయం సాధించినట్లుగా చెప్పక తప్పదు.