బీఎస్పీ బ్యాంక్ బ్యాలెన్స్ లెక్క తెలిస్తే అవాక్కే!

Mon Apr 15 2019 13:46:25 GMT+0530 (IST)

Mayawati JSP Bank Balance

రాజకీయ పార్టీల లెక్కలు ఒక పట్టాన అర్థం కావు. ఎప్పుడో ఒకసారి తప్పించి.. ఆ లెక్కల వివరాలు పెద్దగా బయటకు రావు. వచ్చినా.. అవన్ని అరకొర తప్పించి డిటైల్డ్  లెక్కలు బయటకు వచ్చేది తక్కువ. తాజాగా అలాంటి లెక్కల వివరాలు బయటకొచ్చాయి. వివిధ పార్టీల బ్యాంక్ బ్యాలెన్స్ లు ఎంతన్న విషయాన్ని చెప్పే కథనం ఒకటి వెల్లడైంది. ఈ లెక్క వింటే ఆశ్చర్యపోవాల్సిందే. బ్యాంకు బ్యాలెన్స్ వామ్మో అనిపించేలా ఉంది.లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో దేశంలోని వివిధ రాజకీయ పార్టీలు తమ బ్యాంక్ బ్యాలెన్స్ వివరాల్ని కేంద్ర ఎన్నికల కమిషన్ కు సమర్పించాయి. ఈ సందర్భంగా ఏ రాజకీయ పార్టీ ఆర్థిక పరిస్థితి ఏ స్థాయిలో ఉందో బయటకు వచ్చింది. దేశంలోని అన్ని పార్టీలకు మించి బహుజన్ సమాజ్ వాదీ పార్టీ (బీఎస్పీ) బ్యాంక్ బ్యాలెన్స్ అదరహో అన్నట్లుగా ఉందన్న విషయం వెల్లడైంది.

ఈ పార్టీ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంతో తెలుసా?  అక్షరాల రూ.669 కోట్లుగా పేర్కొంది. అధికార బీజేపీ.. కాంగ్రెస్ కు మించి ఈ పార్టీ ఆర్థికంగా పటిష్ఠంగా ఉండటం విశేషం. ఢిల్లీలోని పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లోని 8 ఖాతాల్లో రూ.669 కోట్ల డిపాజిట్లు ఉన్నట్లుగా సదరు పార్టీ పేర్కొంది. ఆసక్తికరమైన విషయం ఏమంటే.. 2014 లోక్ సభ ఎన్నికల నాటికి బీఎస్పీ దగ్గర బ్యాంక్ డిపాజిట్లు లేవు. అప్పట్లో పార్టీ దగ్గర కేవలం రూ.95.54 లక్షల నగదు ఉన్నట్లుగా పేర్కొన్నారు. అలాంటి పార్టీ ఈ రోజు మిగిలిన అన్ని పార్టీల కంటే భారీ మొత్తంలో డిపాజిట్లు ఉండటం విశేషం.

ఇదిలా ఉంటే.. యూపీ విపక్షమైన సమాజ్ వాదీ పార్టీ వద్ద రూ.471 కోట్ల బ్యాలెన్స్ ఉన్నట్లు పేర్కొంది. కాంగ్రెస్ వద్ద రూ.196 కోట్లు ఉండగా.. టీడీపీ వద్ద రూ.107 కోట్లు ఉన్నాయని ఆయా పార్టీలు వెల్లడించాయి. అధికార బీజేపీ వద్ద రూ.82 కోట్లు మాత్రమే ఉన్నట్లు పేర్కొన్నారు. 2017-18 మధ్య కాలంలో బీజేపీ రూ.1027 కోట్లు సేకరించగా.. అందులో రూ.758 కోట్లను ఖర్చు చేసినట్లుగా పేర్కొంది. ఇన్నేసి కోట్లను అంత తక్కువ కాలంలో బీజేపీ ఖర్చు పెట్టటంపై ఆసక్తి వ్యక్తమవుతోంది. ఇక..  బ్యాంకు బ్యాలెన్స్ లలో బీజేపీ ఐదో స్థానంలో నిలిచింది.