Begin typing your search above and press return to search.

బీరుట్ లో భారీ పేలుళ్లు.. 50 మంది మృతి.. 2750 మందికి గాయాలు

By:  Tupaki Desk   |   5 Aug 2020 3:45 AM GMT
బీరుట్ లో భారీ పేలుళ్లు.. 50 మంది మృతి.. 2750 మందికి గాయాలు
X
అంతర్యుద్ధం.. ఆత్మాహుతి దాడులు ఆ దేశానికి కొత్తేం కాదు. ఆ దేశ రాజధానిలో ఇప్పటికే అలాంటివెన్నో జరిగాయి. తాజాగా.. చోటు చేసుకున్న ఒక భారీ పేలుడు ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసింది. అంత తీవ్రంగా మారిన ఈ పేలుడుకు కారణం ఏమిటి? అన్న విషయం మీద ఒక స్పష్టత రాని పరిస్థితి. ఇప్పుడు చెప్పేదంతా లెబనాన్ రాజధాని బీరూట్ నగరంలో చోటు చేసుకున్న భారీ పేలుళ్లు షాకింగ్ గా మారాయి.

ఓడరేవుకు సమీపంలో చోటు చేసుకున్న ఈ భారీ పేలుళ్ల ధాటికి పలు భవనాలు కుప్పకూలాయి. బాణసంచా పేలుతున్నట్లుగా మొదలైన శబ్దాలు కాసేపటికే భీకరంగా మారటమే కాదు.. కిలోమీటర్ల వ్యవధిలోని వారంతా వణికేలా చేసింది. ఈ పేలుళ్ల ధాటికి ఏకంగా యాభై మంది మృతి చెందగా.. వేలాది మంది గాయాల బారిన పడ్డారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం దగ్గర దగ్గర మూడు వేల మంది వరకు క్షతగాత్రులు ఉంటారని చెబుతున్నారు.కిలోమీటర్ల కొద్దీ భవనాలు భారీ నుంచి ఒక మోస్తరు స్థాయి వరకు దెబ్బతినటం గమనార్హం. ఆస్తి నష్టం తీవ్రంగా జరిగిందని.. దాని లెక్క తేల్లేదు.

ఈ పేలుళ్లకు కారణం అక్కడి సోషల్ మీడియాలో పేర్కొంటున్న సమాచారం ప్రకారమైతే.. బీరుట్ ఓడరేవులో టపాసులు నిల్వ ఉంచిన గిడ్డంగిలో పేలుడు సంభవించినట్లుగా పేర్కొంటున్నారు. ఇప్పటివరకు పేలుడుకు ఇతిమిద్దంగా కారణం ఇదన్నది తేలలేదు. అయితే.. ఈ పేలుళ్లు స్థానికుల్ని తీవ్ర భయాందోళనలకు గురి చేశాయి. అణుబాంబు పేలిందా?అన్నట్లుగా శబ్దాలు.. తీవ్రత ఉందన్న మాట పలువురి నోట వినిపిస్తోంది.

తొలుత టపాసులు పేలుతున్న శబ్దంలా మొదలై.. తర్వాత దిక్కులు పిక్కటిల్లేలా మారాయని స్థానికులు చెబుతున్నారు. పేలుళ్ల ధాటికి బహుళ అంతస్తుల భవనాలు పేకమేడల్లా కుప్పకూలటం గమనార్హం. భవన శిధిలాల కింద చాలామంది ఇరుక్కున్నట్లుగా చెబుతున్నారు. రాజధాని నగరంలో ఎటు చూసినా కుప్పకూలిన భవనాలు.. శిధిలాలు.. దెబ్బ తిన్న వాహనాలు దర్శనమిస్తున్నాయి. బాధితులకు సాయం చేసేందుకు పెద్ద ఎత్తున అంబులెన్సులు రంగంలోకి దిగాయి. క్షతగాత్రులకు అవసరమైన రక్తం కోసం పెద్ద ఎత్తున రక్తదాతల అవసరం ఉందని చెబుతున్నారు. మొత్తంగా లెబనాన్ నగరం ఇప్పటివరకు ఎప్పుడు చూడని.. దారుణమైన పరిస్థితిని ఎదుర్కొంటుందని చెప్పక తప్పదు.