Begin typing your search above and press return to search.

నల్లజాతీయుడి హత్య: అమెరికా అగ్నిగుండం.. అసలేం జరిగింది?

By:  Tupaki Desk   |   1 Jun 2020 6:00 PM GMT
నల్లజాతీయుడి హత్య: అమెరికా అగ్నిగుండం.. అసలేం జరిగింది?
X
అమెరికా అట్టుడుకుతోంది. మే 25న మిన్నపొలిస్ లో జార్జ్ ప్లాయిడ్ (46) అనే నల్ల జాతీయుడిని అమెరికన్ పోలీస్ డెరెక్ చౌవిన్ క్రూరంగా చంపడంతో ఈ మంటలు అంటుకున్నాయి. అతడి గొంతుపై కాలు పెట్టి కర్కశంగా ఆ పోలీస్ చంపిన తీరుపై ప్రపంచవ్యాప్తంగా అందరినీ కలిచివేసింది. అమెరికాలోని అన్ని రాష్ట్రాల్లో నల్లజాతీయులు రోడ్డెక్కి ఆందోళనకు దిగుతున్నారు. కాలిఫోర్నియాలోని లాస్ ఏంజెలెస్ నగరంలో పలు ప్రముఖ దుకాణాలు లూటీ అయ్యాయి. నగరంలో ఎమెర్జెన్సీ విధించారు. న్యూయార్క్ లో 20 కార్లను దగ్ధం చేశారు. అగ్రహ జ్వాలలతో ఆస్తులు, వాహనాలు ధ్వసం చేస్తున్నారు. న్యాయం కోసం రోడ్లమీదకొచ్చి విధ్వంసాలకు దిగుతున్నారు. అమెరికాలో జాత్యంహంకారానికి వ్యతిరేకంగా పోరాటం కొనసాగుతోంది. ఇప్పుడు అమెరికా వ్యాప్తంగా ఈ ఉద్యమం విస్తరించింది. కర్ఫ్యూ కొనసాగుతున్న నిరసనకారులు రోడ్డెక్కి జార్జ్ ఫ్లాయిడ్ కు న్యాయం జరగాలి.. పోలీస్ కు శిక్ష పడాలి అని నినదిస్తున్నారు.

ఘటన జరిగిన మిన్నెపొలిస్ నగరంలో ఆందోళన అదుపుతప్పింది. కర్ఫ్యూ విధించి , నేషనల్ గార్డ్స్ ను దించినా ఆందోళనకారులు వెనక్కితగ్గలేదు. పోలీసులపై కి రాళ్లు రువ్వారు. పోలీస్ వాహనాలను తగులబెట్టారు. పోలీసులు భాష్ప వాయువు ప్రయోగించి కాల్పులు జరపగా.. ఒకరు మరణించారు. వందల సంఖ్యలో ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు. మిన్నెపొలిస్, సెయింట్ పాల్ నగరాలు తగులబడుతున్నాయి. ఆందోళనలు అదుపుతప్పాయి.

న్యూయార్క్ లో పోలీసులు, నిరసనకారుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. సీఎఎన్ వార్త సంస్థ ప్రధాన కార్యాలయంపై దాడి చేశారు.నిరసనలు అదుపు చేసేందుకు అవసరమైతే ఆర్మీని దించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇప్పటికే ఆర్మీకి సైతం ఆదేశాలు జారీ చేశారు.

నల్లజాతీయుడిని చంపిన పోలీస్ డెరెక్ చౌవిన్ పై హత్యానేరం కేసు పెట్టి అరెస్ట్ చేశారు. మరిన్ని సెక్షన్లు నమోదు చేశారు. ఇక డెరెక్ భార్య అమాయకుడిని చంపిన తన భర్తకు విడాకులు ఇస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది.

*నల్లజాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్ హత్యకు ముందు ఏం జరిగింది?
అమెరికాను అతలాకుతలం చేస్తున్న నల్లజాతీయుడు జార్ట్ ఫ్లాయిడ్ ను పోలీస్ ఎలా చంపాడు.? ఎందుకు అరెస్ట్ చేశాడు. ఆయన మరణానికి ముందు ఏం జరిగిందనేది ఇప్పుడు అందరూ ఆరాతీస్తున్నారు.

మినియా పోలీస్ నగరంలో జార్జ్ ఫ్లాయిడ్ బౌన్సర్ గా పనిచేస్తున్నాడు. కరోనా వైరస్ సంక్షోభం కారణంగా లక్షలమందిలాగా అతడి ఉద్యోగం కూడా పోయింది. దీంతో ఆకలికేకలతో అలమటిస్తున్నాడు. మే 25న జార్జ్ ఫ్లాయిడ్ మినియా పోలీస్ నగరంలోని ఓ కప్ ఫుడ్స్ అనే షాపులో ఓ సిగరెట్ ప్యాకెట్ కొన్నాడు. ఇందుకోసం 20 డాలర్ల నోటును ఇచ్చాడు. షాపులో పనిచేసే ఉద్యోగి అది నకిలీ నోటుగా భావించి పోలీసులకు ఫోన్ చేశాడు. జార్జ్ ను సిగరెట్ ప్యాకెట్ వెనక్కి ఇవ్వమంటే ఇవ్వకుండా వెళ్లిపోయాడు.

పోలీసులు వెంటనే రాగా జార్జ్ ఫ్లాయిడ్ తన ఇద్దరు స్నేహితులతో కలిసి ఆ షాపు మూలన నిలిపిన కారులో కూర్చుని ఉన్నాడు. ఫ్లాయిడ్ ను కారు నుంచి బయటకు లాగి సంకెళ్లు వేస్తుంటే అడ్డుపడ్డాడు. నకిలీ నోటు చేస్తున్నందుకు అరెస్ట్ చేస్తున్నామని పోలీసులు తెలిపారు. పోలీస్ కారులోకి ఎక్కించేందుకు ప్రయత్నించగా పెనుగులాట మొదలైంది. ప్లాయిడ్ నేలపై పడిపోగా.. సంకేళ్లు వేశారు. ప్లాయిడ్ మెడపై పోలీస్ అధికారి డెరిన్ ఎడమ మోకాలిని మోపి ఒత్తాడు. ఊపిరి అందడం లేదని ఫ్లాయిడ్ పదే పదే పోలీసులకు మొరపెట్టుకున్నాడు. ప్లీజ్ అంటూ ప్రాధేయపడ్డాడు. 8.46 నిమిషాల పాటు ప్లాయిడ్ మెడపై పోలీస్ నొక్కిపెట్టి ఉంచడంతో సృహ కోల్పోయాడు.

తరువాత మరో పోలీస్ జార్జ్ నాడీ స్పందన చూడగా.. వినిపించలేదు. అంబులెన్స్ లో ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మరణించాడని వైద్యులు ప్రకటించారు.మరణించాడానికి ముందు తాత్కాలిక ఉద్యోగం కోసం ఫ్లాయిడ్ మాట్లాడాడు. నకిలీ నోట్లు చెలామణి అయ్యేవ్యక్తి జార్జ్ కాదని అతడి స్నేహితుడు హారిస్ తెలిపాడు.

చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని ఓ కర్కశ పోలీస్ చేసిన అమానుషానికి ఓ అమాయకపు నిరుద్యోగి ఫ్లాయిడ్ ప్రాణాలు కోల్పోయాడు. ఆ పోలీస్ అమానుష చర్యకు ఇప్పుడు అమెరికానే అగ్నిగుండంగా మారింది. నల్లజాతీయులు రోడ్డెక్కి ఆందోళనలు చేస్తుండడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

అక్కడున్న వారంతా పోలీస్ జార్జ్ పై కాలు మోపి హింసిస్తున్న సంఘటనను వీడియో తీసి దారుణంపై సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అమెరికా అంతటా నిప్పు రాజుకుంది. అందరూ రోడ్లమీదకొచ్చి ఆందోళనలు చేస్తున్నారు.