వివాహిత లేడీ డాక్టర్ ఆత్మహత్య ...అదే నేరమా!

Thu Nov 26 2020 16:40:27 GMT+0530 (IST)

Married lady doctor commits suicide

ఎన్నో ఆశలు మరెన్నో కలలతో కొత్త జీవితాన్ని ప్రారంభించిన ఓ యువతి భర్త అత్తింటి వేధింపులు తట్టుకోలేక మధ్యలోనే తనువు చాలించింది. డాక్టర్ చదువుతున్న అమ్మాయికి మంచి సంబంధం అని పెళ్లి చేశారు. ఎన్నో ఆశలతో  అత్తారింట్లో అడుగుపెట్టిన యువతికి అడుగడుగునా అవమానాల పాలైంది. తల్లిని కాబోతున్నానన్న సంతోషమూ మిగల్చలేదు. పెళ్లైన నెలకే గర్భం దాల్చిందంటూ తోడేళ్లలా వేధించారు. భర్త అనుమానానికి ప్రతిఫలంగా కార్లు ఆస్తులు అదనపు కట్నంగా తేవాలని హింసించారు. చివరకు బిడ్డ పుట్టినా కఠిన హృదయాల్లో కనికరం లేకుండా పోయింది. దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్న  ఆ వివాహిత బుధవారం ఉదయం అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఈ విషాదకర ఘటన  అనంతపురం జిల్లా హిందూపురంలో జరిగింది.ఈ ఘటన లో పూర్తి వివరాలు చూస్తే ...  మడకశిరకు చెందిన అక్తర్ జాన్ కుమార్తె అర్షియా డాక్టర్ కలను నిజం చేసుకునేందుకు ఎంబీబీఎస్ లో చేరింది. చదువు మధ్యలో ఉండగానే కుటుంబ సభ్యులు పెళ్లి సంబంధాలు చూడడం మొదలుపెట్టి మంచి సంబంధం కుదిరిందంటూ హిందూపురం ఆర్టీసీ కాలనీకి చెందిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ నూరుల్లా తో గతేడాది వైభవంగా పెళ్లి  జరిపించారు. పెళ్లి సమయంలో కట్నకానుకల కింద భారీగానే ముట్టజెప్పారు.  నెల తిరక్కుండానే భర్త అతని కుటుంబ సభ్యుల నుంచి వేధింపులు మొదలయ్యాయి. ఈలోగా ఆమె గర్భం దాల్చింది. తాను తల్లిని కాబోతున్నానన్న సంతోషించేలోపే మరో పిడుగునెత్తిన పడింది. పెళ్లైన నెలకే గర్భం దాల్చిందంటూ భర్తను అనుమాన భూతం ఆవహించింది. దీనితో అదనపు కట్నం కోసం హింసించారు. బిడ్డ పుట్టినా కూడా వారిలో ఎటువంటి మార్పు రాలేదు.

అత్తింటి వేధింపులతో అల్లాడిపోతున్న అర్షియా అనూహ్యంగా శవమై తేలింది. అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. రెండు రోజల ముందు ఆమె పుట్టిన రోజు నాడు తల్లి ఫోన్ చేస్తే ముభావంగా మాట్లాడింది. తాను మళ్లీ ఫోన్ చేస్తానని పెట్టేసింది. రెండు రోజులకే హిందూపురంలో ఉంటున్న వారి బంధువులు అర్షియా లేవడం లేదంటూ ఫోన్ చేయడంతో హుటాహుటిన కూతురు మెట్టినింటికి చేరుకున్నారు. మంచంపై నిర్జీవంగా పడి ఉన్న కూతురిని చూసి తల్లి గుండెబద్దలైంది. అల్లుడిని అడిగితే ఉరేసుకుని చనిపోయిందంటూ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో కోపం తో ఊగిపోయారు. ఇరు కుటుంబసభ్యుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న వన్‌టౌన్ పోలీసులు వెంటనే అక్కడకు చేరుకుని మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించి ఇంటికి తాళాలు వేశారు.కాబోయే డాక్టర్ కట్టుకున్నోడి వేధింపులకు బలవ్వడం స్థానికులను తీవ్రంగా కలచివేసింది. తమకు న్యాయం చేయాలంటూ అర్షియా తల్లి సోదరుడు అధికారులను వేడుకోవడం అందరిని కంటతడి పెట్టించింది.