Begin typing your search above and press return to search.

క్వారంటైన్ కేంద్రమే పెళ్లి వేదిక ..ఒక్కటైన ప్రేమజంట !

By:  Tupaki Desk   |   28 May 2020 9:10 AM GMT
క్వారంటైన్ కేంద్రమే పెళ్లి వేదిక ..ఒక్కటైన ప్రేమజంట !
X
చైనాలో వెలుగులోకి వచ్చిన ఈ వైరస్ ఇప్పుడు విలయతాండవం చేస్తుంది. మనదేశంలో లోనూ విజృంభిస్తోంది. ఈ తరుణంలో వైరస్ లక్షణాలతో క్వారంటైన్ కేంద్రంలో ఉన్న ప్రేమికులు అక్కడే కళ్యాణం చేసుకున్న అరుదైన ఘటన ఒడిశా రాష్ట్రంలోని సాగాడ గ్రామంలో వెలుగుచూసింది. పూరి జిల్లా సాగాడ గ్రామానికి చెందిన సౌరబ్ దాస్ అనే 19 ఏళ్ల యువకుడు, అదే గ్రామానికి చెందిన పింకీరాణిని ప్రేమిస్తున్నాడు. సౌరబ్ తన ప్రేయసి పింకీరాణిని తీసుకొని ఈ ఏడాది జనవరిలో గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ నగరానికి పారిపోయి, ఒక ప్లాస్టిక్ పరిశ్రమలో పనిచేస్తూ ప్రేయసితో సహజీవనం సాగించాడు.

ఇక ఇదే సమయంలో వైరస్ కారణంగా లాక్ డౌన్ విధించడంతో వారిద్దరూ ఎంతో కష్టపడి సాగాడ గ్రామానికి తిరిగివచ్చారు. వీరు గుజరాత్ నుంచి ఒడిశాకు రావడంతో వైరస్ సోకిందేమో అన్న అనుమానంతో వారికి కరోనా పరీక్షలు చేయగా నెగిటివ్ అని రిపోర్టు వచ్చింది. అయినా ముందుజాగ్రత్తగా వారిని 14 రోజుల పాటు సాగాడ గ్రామంలోని క్వారంటైన్ కేంద్రానికి తరలించారు. ప్రేమజంట అహ్మదాబాద్ లో సహజీవనం చేయడంతో పింకీరాణి గర్భం దాల్చింది.

ఈ క్రమంలో.. 14 రోజుల క్వారంటైన్ సమయం ముగిశాక క్వారంటైన్ కేంద్రమే కళ్యాణ వేదికగా ప్రేమజంట సౌరబ్, పింకీరాణిలు పెళ్లి చేసుకున్నారు. వధూవరుల కుటుంబసభ్యులు క్వారంటైన్ కేంద్రంలోకి ప్రవేశించలేనందున ఈ కేంద్రం ఇన్‌చార్జులుగా ఉన్న ఇద్దరు ఉపాధ్యాయులు వధూవరుల తల్లిదండ్రులగా వ్యవహరించి వారికీ పెళ్లి చేసారు. ఏదేమైనా ఆనాడు తమ ప్రేమని కాపాడుకోవడానికి ఇంటి నుండి వెళ్లిపోయిన ఈ ప్రేమజంట ..క్వారంటైన్ కేంద్రంలో పెళ్లి చేసుకొని దంపతులుగా సొంతింటికి తిరిగివచ్చారు.