Begin typing your search above and press return to search.

సంచలనాలకే సంచలనం..కరోనా పోయేదాకా మావోయిస్టు దాడుల్లేవ్

By:  Tupaki Desk   |   6 April 2020 3:30 PM GMT
సంచలనాలకే సంచలనం..కరోనా పోయేదాకా మావోయిస్టు దాడుల్లేవ్
X
ప్రాణాంతక వైరస్ కరోనా విజృంభణ ప్రపంచ దేశాల్లో పెను మార్పులను తీసుకొస్తోంది. ఎన్నడూ తీసుకోనంత సంచలన నిర్ణయాలను ప్రభుత్వాలు తీసుకుంటున్నా... ప్రజలు కిమ్మనకుండా పాటించేస్తున్న వైనం నిజంగానే ఆసక్తి కలిగించేదే. కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు అంటూ పూర్తిగా లాక్ డౌన్ అమలు చేస్తున్నట్లుగా ప్రభుత్వాలు ప్రకటించినా... సింగిల్ నిరసన కూడా వ్యక్తం కాకపోవడం నిజంగానే ఆసక్తికరమే కదా. అయితే ఇలాంటి కీలక తరుణంలో ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలు సాగించే మావోయిస్టులు కూడా కరోనా వేళ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ తరహా నిర్ణయం మావోయిస్టుల చరిత్రలోనే తొలి సారి అన్న వాదన వినిపిస్తోంది.

అయినా మావోయిస్టులు ఇప్పుడు తీసుకున్న నిర్ణయం ఏమిటంటే... దేశంలో ప్రస్తుతం కొనసాగుతున్న కరోనా వైరస్ విజృంభణ తగ్గేదాకా దాడులను పూర్తిగా నిలిపివేస్తున్నట్లుగా మావోయిస్టులు ప్రకటించారు. కరోనా విజృంభిస్తున్న తరుణంలో ఎలాంటి దాడులు చేయొద్దని మావోయిస్టులు తీర్మానించారట. మల్కన్‌ గిరి కోరాపుట్-విశాఖ డివిజన్ కమిటీ కార్యదర్శి కైలాసం పేరుతో ఈ మేరకు విడుదలైన ఆడియో టేపు సంచలనాలకే సంచలనమని చెప్పక తప్పదు. అంతేకాదండోయ్... తమ చరిత్రలోనే తొలిసారిగా.. వైరస్‌ను నిరోధించడానికి పాలకవర్గాల ప్రయత్నాలకు ఆటంకం కలిగించొద్దని మావోయిస్టు పార్టీ నిర్ణయం తీసుకున్నట్లు కైలాసం సదరు ఆడియో సందేశంలో పేర్కొన్నారు.

దాడులకు విరామం ప్రకటించడం అంటే... ఏదోలే అనుకోవచ్చు గానీ... ఏకంగా కరోనా కట్టడి కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు ఎలాంటి ఆటంకం కలిగించొద్దని మావోయిస్టులు నిర్ణయం తీసుకోవడం, సదరు సందేశాన్ని తమ శ్రేణులకు అందజేయడం చూస్తుంటే... ఈ నిర్ణయం మావోయిస్టుల చరిత్రలోనే అత్యంత సంచలన నిర్ణయంగా పరిగణించక తప్పదన్న వాదనలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వాలు ఏ నిర్ణయం తీసుకున్నా... దానిని వ్యతిరేకించడం - దానిపై ప్రభుత్వంపై పోరు సాగించేలా ప్రజలను ఉత్తేజితులను చేయడం, ఓ వైపు ప్రజలు నిరసనలు తెలుపుతూ ఉంటే... మరోవైపు తాను దాడులకు పాల్పడటం వంటి చర్యల్లో పూర్తిగా నిమగ్నమైన మావోయిస్టులు ఇప్పుడు ఏకంగా దాడులను ఆపేయడం, ప్రభుత్వ చర్యలకు ఆటంకం కలిగించొద్దని సందేశమివ్వడం నిజంగానే సంచలనాలకే సంచలనంగా చెప్పక తప్పుదు.