మన్ కీ బాత్.. `మనీ కీ బాత్`గా మారిందే.. ఎలా?

Tue Jul 20 2021 21:00:01 GMT+0530 (IST)

Mann Ki Baat How did it become Money Ki Baat

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ  తన తొలి టెర్మ్లో 2014లో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన మన్ కీ బాత్(మనసులో మాట) కార్యక్రమం.. ద్వారా దేశ ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రతి నెలా చివరి ఆదివారం రేడియో మాధ్యమం ద్వార ప్రసంగిస్తున్న విషయం తెలిసిందే. అదేసమయంలో ఈ కార్యక్రమం దూరదర్శన్లోని అన్ని చానెళ్లలోనూ ఒకే సమయంలో ప్రసారం అవుతోంది. ఆ వెంటనే ఆయా ప్రాంతీయ భాషల్లోనూ ఈ కార్యక్రమం జరుగుతుంది. దీనిపై పెద్ద ఎత్తున విశ్లేషణలు కూడా వస్తున్నాయి. అయితే.. దీనిపై కొన్నాళ్లు కాంగ్రెస్ నేతలు తీవ్ర విమర్శలు చేశారు.`మోడీ జీ.. మీ మనసులో మాట కాదు.. ప్రజల మనసులో ఏముందో తెలుసుకోండి!`` అంటూ.. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అనేక సందర్భాల్లో సటైర్లు పేల్చారు. అయినప్పటికీ.. మోడీ.. ఎవరి మాటనూ పట్టించుకోకుండా.. ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తు న్నారు. అయితే.. ఈ కార్యక్రమం ద్వారా.. `లాభం` ఏముంటుంది?  అని అనుకునేవారికి కేంద్రం దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. ఈ కార్యక్రమం ద్వారా ప్రజలతో సంభాషించడం ద్వారా.. ఏకంగా కొన్ని కోట్ల ఆదాయాన్ని ప్రభుత్వం ఆర్జించినట్టు తాజాగా కేంద్ర ప్రభుత్వమే రాజ్యసభ వేదికగా చెప్పేసింది. దీనికి సంబంధించిన వివరాలనుసైతం వెల్లడించింది.

మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా కేంద్రానికి ఇప్పటి వరకు 30.80 కోట్ల రూపాయలు వచ్చాయని కేంద్రం రాజ్యసభ వేదికగా ప్రకటించింది. 2014 నుంచి ఇప్పటి వరకూ 30.80 కోట్ల రూపాయలు వచ్చాయని కేంద్ర సమాచార ప్రసారాల శాఖ ప్రకటించింది. అయితే 2017-18 సంవత్సర కాలంలో అత్యధికంగా 10.64 కోట్ల ఆదాయం వచ్చినట్లు పేర్కొంది. ఇక 2014-15 లో 1.16 కోట్లు 215-16 లో 2.81 కోట్లు తెచ్చిపెట్టిందని 2016-17 లో 5.14 కోట్లు 2018-19 లో 7.47 2019-20 లో 2.56 కోట్లు వచ్చాయి. ఇక 2020-21 లో 1.02 కోట్ల ఆదాయం వచ్చిందని కేంద్ర ప్రసార మంత్రి అనురాగ్ ఠాకూర్ ప్రకటించారు.

ఈ ఆదాయం అంతా ప్రకటన రూపంలోనే ఉన్నట్టు తెలిపారు. మన్ కీ బాత్ కార్యక్రమానికి ముందు.. తర్వాత రేడియో దూరదర్శన్లలో ఇచ్చే ప్రకటనల ద్వారా.. ఈ మొత్తం ఆదాయం లభించినట్టు వివరించారు. మొత్తానికి ప్రధాని మోడీ మన్ కీ బాత్ వెనుక `ఇంత ఆదాయం` ఉంటుందని ఎవరూ ఊహించకపోవడం గమనార్హం.