Begin typing your search above and press return to search.

మౌనముని ఎంట్రీ... వృద్ధి కోసం మోదీకి ఐదు సూచనలు

By:  Tupaki Desk   |   13 Sep 2019 3:51 AM GMT
మౌనముని ఎంట్రీ... వృద్ధి కోసం మోదీకి ఐదు సూచనలు
X
ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో భారత్ ఎంతమాత్రం వెలిగిపోవడం లేదు. భారత్ వెలిగిపోతోంది అంటూ అప్పుడెప్పుడో అటల్ బిహారీ వాజ్ పేయి హయాంలో బీజేపీ బాగానే ఊదరగొట్టింది కదా. ఆ ఊదరగొట్టు ఫలితమో - ఏమో తెలియదు గానీ... బీజేపీ సర్కారు కూలిపోయి కాంగ్రెస్ పాలన వచ్చింది. పదేళ్ల కాంగ్రెస్ పాలనకు చరమగీతం పాడుతూ నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ సర్కారు మరోమారు పాలనా పగ్గాలు చేపట్టింది. మోదీ వస్తే... దేశం ఎక్కడికో వెల్లిపోతుందనుకుంటే... దేశ ఆర్థిక పరిస్థితి అంతకంతకూ తీసికట్టుగా మారిపోయింది. దేశ వృద్ధి రేటు పదిహేనేళ్ల దిగువకు పడిపోయింది. ఈ క్రమంలో మోదీ కంటే ముందు పదేళ్ల పాటు దేశ ప్రధానిగా పదవీ బాధ్యతలు చేపట్టి, మౌనమునిగా పేరు తెచ్చుకున్న మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ ఇప్పుడు ఎంట్రీ ఇవ్వక తప్పలేదు.

దేశంలో ఆర్థిక సంస్కరణలు చేపట్టిన ఘనత తెలుగు నేలకు చెందిన మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు దక్కినా... వెనకుండి నడిపింది మన్మోహనే కదా. ఆర్థిక శాస్త్రంలో కాకలు తీరిన యోధుడిగా పేరు తెచ్చుకున్న మన్మోహన్... దేశం అధో:గతి పాలు అవుతుంటే చూడలేకపోయారు. అందుకే తాను ప్రతిపక్షంలో ఉన్నా... తన పార్టీ హీన స్థితిలో ఉన్నా కూడా మన్మోహన్ ఎంట్రీ ఇచ్చేశారు. దేశం బాగుపడాలంటే ఈ చర్యలు తీసుకోమంటూ ప్రధాని నరేంద్ర మోదీకి ఐదు సూచనలు చేశారు. ఈ సూచనలు పాటించినా... ఇప్పటికిప్పుడు ఫలితాలు రాకున్నా... మూడు - నాలుగేళ్లలో పరిస్థితి అంతా సర్దుకుంటుందని, భారత్ మరోమారు వృద్ధి బాట పడుతుందని కూడా మన్మోహన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మన్మోహన్ సూచనలను మోదీ పాటిస్తారా? లేదా? అన్న విషయాన్ని పక్కనపెడితే... దేశ ఆర్థిక పురోగతిని పరుగులు పెట్టించిన మన్మోహన్ ఆర్థిక సలహాలు, సూచనలు పాటించదగ్గవే అన్న వాదన వినిపిస్తోంది.

సరే... ఇదంతా బాగానేే ఉన్నా మోదీకి మన్మోహన్ చేసిన సూచనలు ఏమిటన్న విషయానికి వస్తే... 1) జీఎస్టీ కారణంగా కొంతకాలం పాటు నష్టాలు వచ్చినా... ఆ నష్టాలన్నీ దేశ ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాలి. 2) వ్యవసాయ రంగంలో కొత్త విధానాలను ప్రవేశపెట్టడం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో వినియోగాన్ని పెంచాలి. వ్యవసాయాధారిత మార్కెట్లకు సంకెళ్లను తొలగించి స్వేచ్ఛగా పనిచేసే విధానాన్ని తీసుకువచ్చి ప్రజల చేతికి నేరుగా డబ్బు చేరేలా చర్యలు చేపట్టాలి. 3) మూలధనం ఏర్పాటుకు నగదును వ్యవస్థలోకి పంప్ చేయాలి. 4) ప్రాధాన్యతా రంగాల్లో సంస్కరణలు తీసుకురావాలి. టెక్స్ టైల్స్ - ఆటోమోబైల్ - ఎలక్ట్రానిక్స్ - గృహాలు తక్కువ ధరలకే అందేలా చర్యలు చేపట్టాలి. ఇందుకోసం రుణాలను సరళమైన పద్దతిలో అందజేయాలి. 5) అమెరికా - చైనాల మధ్య జరుగుతున్న వాణిజ్య యుద్ధాన్ని అవకాశంగా మలచుకుని కొత్త ఎగుమతులకు మార్గాలను అన్వేషించాలి. ఇలా ఐదు సూచనలను చేసిన మన్మోహన్... మోదీ సర్కారు ఈ సూచనలను పాటిస్తే... దేశం మరోమారు పురోభివృద్ధి బాట పడుతుందని చెప్పారు. మరి మన్మోహన్ సూచనలను మోదీ పాటిస్తారో, లేదో చూడాలి.