Begin typing your search above and press return to search.

ముస్లిం విద్యార్థిని టెర్రరిస్ట్ అన్న ప్రొఫెసర్ సస్పెన్షన్.. విచారణ

By:  Tupaki Desk   |   28 Nov 2022 4:16 PM GMT
ముస్లిం విద్యార్థిని టెర్రరిస్ట్ అన్న ప్రొఫెసర్ సస్పెన్షన్.. విచారణ
X
బెంగుళూరులోని మణిపాల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (MIT)లో ఒక ప్రొఫెసర్ దారుణంగా మాట్లాడాడు. తరగతి గదిలో ఒక ముస్లిం విద్యార్థిని 'టెర్రరిస్ట్'గా తిట్టిపోశాడు. దీంతో సీరియస్ అయిన యాజమాన్యం ప్రొఫెసర్ ను సస్పెండ్ చేసింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రొఫెసర్‌పై చర్యలు తీసుకున్నారు.

వైరల్ వీడియోలో ప్రొఫెసర్ క్లాసులో ఓ ముస్లిం విద్యార్థి పేరు పిలిచాడు. అతను పేరు చెప్పగానే.. ఓహో కసబ్ లాంటి విడివేగా అంటూ ఎగతాళి చేశాడు. దీంతో సదురు విద్యార్థి ప్రొఫెసర్ తో వాగ్వాదానికి దిగాడు. చివరకు ఈ వ్యవహారం తీవ్రం కావడంతో యాజమాన్యం దృష్టికి వెళ్లి సదురు ప్రొఫెసర్ ను సస్పెండ్ చేశారు.

ముస్లిం విద్యార్థి క్లాసుకు హాజరైన సమయంలో అటెండెన్స్ తీసుకుంటూ విద్యార్థి పేరు పిలిచిన ప్రొఫెసర్ ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. దీంతో సదురు విద్యార్థితోపాటు తోటి విద్యార్థులు కూడా వాగ్వాదానికి దిగారు. దీనిపై ప్రిన్సిపాల్ కు ఫిర్యాదు చేశారు.

ఆ విద్యార్థి తన కొడుకులాంటి వాడని టీచర్ బదులివ్వగా.. "లేదు.. నీ కొడుకుతో అలా మాట్లాడతావా? టెర్రరిస్ట్ అంటావా? ఇంత మంది ముందు నన్ను అలా ఎలా పిలుస్తావు? ఇది ఒక క్లాస్, నువ్వు ప్రొఫెషనల్, మరియు మీరు నేర్పిస్తున్నారు.' అంటూ విద్యార్థి నిలదీశారు. ఉపాధ్యాయుడు విద్యార్థికి క్షమాపణ చెప్పడం వీడియోలో తర్వాత చూడవచ్చు.

వీడియో వైరల్ కావడంతో యాజమాన్యం ప్రొఫెసర్‌ను సస్పెండ్ చేసింది. అంతర్గత విచారణకు ఆదేశించింది. ఈ సమస్యపై తగిన చర్యలు తీసుకుంటున్నామని.. విద్యార్థికి కౌన్సెలింగ్ ఇస్తామని.. ప్రొఫెసర్‌ను కళాశాల నుండి సస్పెండ్ చేసామని." మిట్ యాజమాన్యం తెలిపింది.

విద్యార్థికి, ప్రొఫెసర్‌కు మధ్య సంభాషణ ఎలా మొదలైందన్న ప్రాథమిక సమాచారాన్ని కళాశాల వెల్లడించలేదు. "సంస్థ సమర్ధవంతంగా నడుస్తుందని మేము హామీ ఇస్తున్నాము. విచారణ కొనసాగుతున్నందున సంబంధిత ప్రొఫెసర్ మాత్రమే నిర్దిష్ట సమాధానాలను అందించగలరు" అని ఎస్పీ తెలిపారు.

ఇక కర్ణాటకలో ఇప్పటికే హిజాబ్ వివాదం పెద్ద దుమారం రేపింది. విద్యాసంస్థల్లో హిందూ, ముస్లింల మధ్య విభజన రేఖ కనిపిస్తోంది. ఇలాంటి తరుణంలో బెంగళూరులో ఇలాంటి ఘటన చోటుచేసుకోవడంతో ఇది కాస్తా మరింత వివాదమవుతోంది. కర్ణాటకలో చదువుకునే స్వేచ్ఛ లేకుండా పోతోందని ఆడిపోసుకుంటున్నారు.