Begin typing your search above and press return to search.

బాబు ఆఫీసుకు మరో కోవిడ్ 19 నోటీసులు!

By:  Tupaki Desk   |   27 May 2020 12:33 PM GMT
బాబు ఆఫీసుకు మరో కోవిడ్ 19 నోటీసులు!
X
ఒక క్రమపద్ధతిలో నిరసనలు నిర్వహించటం.. ఆందోళనలు చేపట్టటం లాంటివి టీఆర్ ఎస్ పార్టీకి వెన్నతో పెట్టిన విద్య. అంతేనా.. ఆ పార్టీ అధినేత మూడ్ కు అనుగుణంగా పెద్ద ఎత్తున పోలీస్ స్టేషన్లలో కేసులు పెట్టే టాలెంట్ గులాబీ దళానికి ఉండే ఆయుధంగా చెబుతారు. ఇక.. రాజకీయ ప్రత్యర్థుల్ని సోషల్ మీడియాలోనూ.. మీడియాలోనూ.. వివిధ వేదికల మీద విరుచుకుపడటంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తర్వాతే ఎవరైనా అన్న మాట వినిపిస్తూ ఉంటుంది.

మిగిలిన సందర్భాల్లో ఎలా ఉన్నా.. బాబు.. చినబాబు విషయాల్లో వారెంతలా చెలరేగిపోతారో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరమే ఉండదు. లాక్ డౌన్ నేపథ్యంలో దాదాపు రెండు నెలలకు పైనే హైదరాబాద్ లోని ఇంటికే పరిమితమైన టీడీపీ అధినేత చంద్రబాబు హైదరాబాద్ నుంచి అమరావతికి బయలుదేరిన తర్వాత చోటు చేసుకున్న పరిణామాలు తెలిసిందే. తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకున్న బాబుకు స్వాగతం పలకటానికి పలువురు అభిమానులు.. నేతలు వచ్చారు.

ఇలాంటి సందర్భాల్లో రూల్స్ ను బ్రేక్ చేసేలా మంది హాజరు కావటం జరిగింది. సాధారణంగా ఇలాంటివి చోటు చేసుకన్నప్పుడు సర్లే కదా అని ఊరుకోవటం మామూలే. కానీ.. బాబు విషయంలో మాత్రం అందుకు మినహాయింపుగా అధికారులు నోటీసులు జారీ చేశారు. ఇదిలా ఉంటే.. పార్టీ ఆవిర్భావాన్ని పురస్కరించుకొని నిర్వహిస్తున్న మహానాడులోనూ రూల్స్ ను బ్రేక్ చేశారంటూ కొందరు ఫిర్యాదు చేయటంతో.. కోవిడ్ 19 నోటీసుల్ని జారీ చేశారు.

ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆన్ లైన్ లో మహానాడు కార్యక్రమాన్ని నిర్వహించాలని టీడీపీ నిర్ణయించింది. అయితే.. నిబంధనలకు విరుద్ధంగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లుగా కొందరు ఫిర్యాదులు చేయటంతో ఆత్మకూరు తహసీల్దార్ నోటీసులు జారీ చేశారు. కేవలం పదినుంచి పన్నెండు మంది మాత్రమే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని.. అలాంటప్పుడు నోటీసులు ఎలా జారీ చేస్తారన్న ప్రశ్నను కార్యాలయ సిబ్బంది పేర్కొంటున్నారు. నోటీసులు ఇచ్చేందుకు వచ్చిన అధికారులకు మహానాడును నిర్వహించిన వీడియోల్ని పరిశీలించినట్లు చెబుతున్నారు. ఏమైనా.. రానున్న రోజుల్లో మరిన్ని నోటీసులు తప్పేట్లు లేవంటున్నారు. బాబు అండ్ కోలో ముఖ్యులు ఎవరైనా సరే.. కాలు కదిపితే కంప్లైంట్లు చేసేందుకు చాలామంది సిద్ధంగా ఉన్నట్లు చెబుతున్నారు.