Begin typing your search above and press return to search.

స్త్రీ శిశు సంక్షేమ శాఖ నిర్వాకంతో జగన్ సర్కార్ కి చెడ్డ పేరు!?

By:  Tupaki Desk   |   30 Sep 2022 8:40 AM GMT
స్త్రీ శిశు సంక్షేమ శాఖ  నిర్వాకంతో జగన్ సర్కార్ కి చెడ్డ పేరు!?
X
మాట్లాడితే చాలు పారదర్శకత అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అంటారు. కానీ ఆచరణలో అలా జరుగుతోందా అన్నదే అతి పెద్ద డౌట్. అందునా కొత్త మంత్రులు కొందరు ఏం చేస్తున్నారో ఏమో కూడా ప్రభుత్వ పెద్దలు పట్టించుకోవడం లేదు. ఈ నేపధ్యంలో స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషశ్రీ చరణ్ మంత్రిత్వ శాఖలో కొత్త పోస్టుల భర్తీకి సంబంధించి చేపట్టిన నియామకాల ప్రక్రియ మొత్తం లోపభూయిష్టం అంటూ దాఖలైన పిటిషన్ మీద హై కోర్టు ఇచ్చిన తీర్పు ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేలా ఉంది అంటున్నారు.

నియామకాల ప్రక్రియ మొత్తం మీద స్టే విధిస్తూ ఆరు వారాల తరువాత తాజాగా సరికొత్త నియామకాల ప్రక్రియ చేపట్టాలని కోర్టు పేర్కొనడం తో జగన్ సర్కార్ లోని పారదర్శకత ఇపుడు ప్రశ్నార్ధకం అయింది అంటున్నారు. ఈ మధ్యనే స్రీ శిశు సంక్షేమ శాఖలో 560 మంది విస్త‌ర‌ణ అధికారుల నియామ‌కం విషయంలో ఏ మాత్రం పారదర్శకత పాటించలేదని, ముందే కొందరు ఉన్నతాధికారులు పోస్టులు అమ్ముకున్నారని ఆరోపణలు వెల్లువెత్తాయి.

వీటి మీద హై కోర్టులో ఫైల్ అయిన కేసును విచారించిన న్యాయస్థానం పాత నియామకలా ప్రక్రియ మీద స్టే ఇవ్వడం సర్కార్ వారికి అప్రదిష్టగానే అంతా చూస్తున్నారు. ఈ నెల 18న పరీక్షలు నిర్వహించి 25న మౌఖిక పరీక్ష అంటూ కొందరి పేర్లను మాత్రమే పిలవడం వెనక భారీ తతంగమే నడించింది అని అంటున్నారు. ఒక్కో పోస్టుని పది లక్షల రూపాయలకు అమ్ముకున్నారని కూడా ఆరోపణలు వచ్చాయి.

పైగా క‌నీసం మెరిట్ లిస్ట్‌ను ప్ర‌క‌టించ‌కుండా, ఇంగ్లీష్ లాంగ్వేజ్ టెస్ట్ పెట్టడంపై వెనుక ఉన్న దురుద్దేశాలని, అలాగే యధేచ్చగా సాగిపోయిన అక్రమాలను అర్హులైన అభ్యర్ధుల తరఫున కొందరు కోర్టు దృష్టికి తీసుకెళ్ళడంతో వారికి న్యాయం జరిగేలా టోటల్ నియామకాల ప్రక్రియనే కోర్టు స్టే విధిస్తూ తీర్పు చెప్పింది. దీంతో మళ్ళీ పరీక్ష పెట్టి సజావుగా ఇంటర్వ్యూలు నిర్వహించి అర్హులైన వారికి పోస్టులు ఇవ్వడం ప్రభుత్వ కీలక బాధ్యతగా ఉంది.

ఇదిలా ఉంటే ఈ పోస్టుల నియామకాల ప్రక్రియ అంతా గందరగోళంగా అక్రమ విధానాలతో సాగుతోందని ఒక వైపు రచ్చ సాగుతున్నా ముఖ్యమంత్రి జగన్ అదే శాఖ మీద సమీక్షా సమావేశం నిర్వహించి నెలాఖరులోగా నియామకాలు పారదర్శకంగా పూర్తి చేయాలని చెప్పి వదిలేశారు అన్న మాట కూడా వినిపిస్తోంది.

మరి జగన్ దృష్టికి ఈ ఆరోపణలు రాలేదా వచ్చినా వాటిని సదరు మంత్రిత్వ శాఖ పెద్దలు తప్పుదోవ పట్టించారా అన్న చర్చ కూడా సాగుతోంది. ఏది ఏమైనా జగన్ సర్కార్ పరువు పోయేలా ఈ నియామకాల ప్రక్రియ అయితే సాగింది అన్నది వాస్తవం. మరి దీని మీద ఇప్పటికైనా సదరు శాఖ మీద ఫోకస్ పెట్టి సీరియస్ యాక్షన్ కి దిగుతామని ప్రభుత్వ పెద్దలు చెప్పకపోతే మరోసారి అయినా ఇదే తరహాలో నియామకాల ప్రక్రియ చేసేందుకు వారు సాహసించరు అన్న డౌట్ మాత్రం ఎవరికీ లేదు అంటున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.