నా భార్యను పంపుతారా? బాంబులతో పేల్చుకోనా..?

Mon Sep 23 2019 11:19:37 GMT+0530 (IST)

Man urging wife reaches in law place with bomb

ఇవాల్టి రోజున భార్యాభర్తల మధ్య విభేదాలు సహజంగా మారిపోయాయి. అయితే.. ఇప్పటివరకూ ఎప్పుడూ ఎదురుకాని రీతిలో చోటు చేసుకున్న ఈ ఉదంతం సంచలనంగా మారింది. విబేదాల కారణంగా తనకు దూరంగా ఉంటున్న భార్యను తనతో పంపాలని.. లేకుంటే బాంబుల్ని పేల్చుకొని చచ్చిపోతానంటూ ఒక భర్త నాటు బాంబుల దండతో అత్తారింటి ముందు చేసిన రచ్చ అంతా ఇంతా కాదు.ఈ చిత్రమైన సన్నివేశం తమిళనాడులో చోటు చేసుకుంది.  తమిళనాడులోని కడలూరు జిల్లాలోని నైవేలికి చెందిన మణికంఠన్ కు తన భార్యతో విభేదాలు వచ్చాయి. ఏడాదికి పైనే పుట్టింట్లో కాపురం ఉంటోంది. వారిద్దరి మధ్య విడాకులు కేసు కోర్టులో నడుస్తోంది. ఇలాంటి సమయంలో హటాత్తుగా అత్తారింటి ముందుకెళ్లిన మణికంఠన్.. మెడలో నాటుబాంబులు వేసుకొని.. తన భార్యను తనతో కాపురానికి పంపాలన్నాడు.

తన భార్యను పంపకుంటే తాను నాటుబాంబుల దండను పేల్చేసుకొని చచ్చిపోతానని వార్నింగ్ ఇచ్చాడు. ఈ పరిణామంతో బెదిరిన అత్తారింటి వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడకు చేరుకున్న వారు.. బాంబులతో పేల్చేసుకుంటే రెండేళ్ల కొడుకు భవిష్యత్తు ఏమిటని నచ్చజెప్పటంతో పాటు..ఆత్మహత్య ఆలోచన సరికాదన్నారు.

పోలీసుల మాటలతో వెనక్కి తగ్గిన మణికంఠన్.. ఆత్మహత్యయత్నాన్ని వాయిదా వేసుకున్నాడు. దీంతో.. అతని మెడలోని బాంబుల దండను తొలగించారు పోలీసులు. అయితే.. తాను అప్పటికే విషం తాగిన వైనాన్ని పోలీసులకు చెప్పటంతో.. వెనువెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించారు. అతడి ఆరోగ్య పరిస్థితిపై సమాచారం అందాల్సి ఉంది

TAGS: Man Bomb