Begin typing your search above and press return to search.

చదివేది కరెక్టే.. వత్తులు.. బొట్టుబిళ్లల పేరుతో రూ.200 కోట్లు కొట్టేశాడు

By:  Tupaki Desk   |   29 Nov 2022 4:50 AM GMT
చదివేది కరెక్టే.. వత్తులు.. బొట్టుబిళ్లల పేరుతో రూ.200 కోట్లు కొట్టేశాడు
X
మోసం చేయాలనే ఆలోచన రావాలే కానీ.. మోసగించటానికి ఎన్నెన్నో మార్గాలు. ఇప్పుడు చెప్పేది ఆ కోవకు చెందిందే. ప్రజలకు డబ్బుల మీద ఆశను అసరాగా చేసుకొని కోట్లు కొల్లగొట్టే కేటుగాళ్లు ఎందరో. అలాంటి వారిలో ఇప్పుడు చెప్పబోయేటోళ్లు మరింత భిన్నం. వెనుకా ముందు చూసుకోకుండా వందల కోట్లు కొల్లగొట్టే ఇలాంటి నేరస్తుల గురించి విన్నప్పుడు నిజంగానే ఇలాంటోళ్లు ఉన్నారా? అన్న భావన కలుగక మానదు.

తాజాగా అలాంటి ఘరానా మోసం ఒకటి బద్ధలైంది. పేద.. మధ్యతరగతి ప్రజలను టార్గెట్ చేసి.. నిలువునా మోసం చేసే తీరుకు ఈ ఉదంతం నిలువెత్తు నిదర్శనంగా చెప్పొచ్చు. దీపం వత్తులు.. బొట్టుబిళ్లల తయారీ కేంద్రాన్ని ఇంటి వద్ద నుంచే పని చేయొచ్చన్న తీపి మాటలతో నిలువును మోసపోయారు.

వందలాది మంది నుంచి తీసుకున్న డిపాజిట్ల విలువ ఏకంగా రూ.200 కోట్లు ఉండటం గమనార్హం. ఈ ఘరానా మోసాన్ని చూసినప్పుడు అర్థమయ్యేది ఏమంటే.. ఆదాయం వస్తుందన్న ఆశ కలిగితే చాలు.. పెట్టుబడి పెట్టటానికి ఎంత మంది సిద్ధంగా ఉన్నారో ఇట్టే అర్థమవుతుంది.

ఇంతకీ ఈ భారీ మోసం ఎలా జరిగింది? ఎలా వెలుగు చూసింది? అన్న వివరాల్లోకి వెళితే.. ఈ భారీ మోసంలో మోసపోయిన కొందరు బాధితులు కుషాయగూడ పోలీసుల్ని ఆశ్రయించటంతో విషయం బయటకు వచ్చింది. ప్రకాశం జిల్లా రేచర్లకు చెందిన 30 ఏళ్ల రమేశ్ అనే వ్యక్తి ఏడాది క్రితం ఆర్ఆర్ ఎంటర్ ప్రైజస్ పేరుతో వత్తులు.. బొట్టు బిళ్లల తయారీ సంస్థను ఏర్పాటు చేశాడు.

నిరుద్యోగ యువత.. మహిళలు ఇంట్లో ఉండి పని చేసుకోవచ్చని యూట్యూబ్ లో ప్రచారం చేశాడు. ఇందుకోసం ఒక్కో మెషిన్ కోసం రూ.1.20 లక్షల నుంచి రూ.2.60 లక్షల వరకు వసూలు చేశాడు. వత్తుల తయారీకి అవసరమయ్యే కాటన్ కూడా అతనే ఇవ్వసాగాడు.

వత్తులు తయారు చేసి ఇస్తే కిలోకు రూ.300 చొప్పున చెల్లించేలా ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఇతగాడి డీల్ కు చాలా పెద్ద సంఖ్యలో అతడి వద్ద చేరారు. గడిచిన మూడు నెలలుగా వత్తులు తీసుకోవటమే కానీ.. తయారీదారులకు డబ్బులు ఇవ్వటం లేదు. ఎప్పుడు అడిగినా.. ఇస్తానని చెబుతున్నాడే కానీ ఇవ్వటం లేదు. దీంతో విసిగిపోయిన 30 మంది బాధితులు ఆఫీసుకు రావటం.. అక్కడ ఆఫీసు ఎత్తేసి ఉన్న వైనాన్ని గుర్తించి షాక్ తిన్నారు. దీంతో పోలీసుల్ని ఆశ్రయించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం దాదాపు 1100 మంది బాధితులు ఇతడికి లక్షల్లో చెల్లించారని.. ఈ మోసం దాదాపు రూ.200 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.