Begin typing your search above and press return to search.

గోవాపై దీదీ కన్ను.. ప్లాన్ చేస్తున్న పీకే?

By:  Tupaki Desk   |   24 Sep 2021 6:30 AM GMT
గోవాపై దీదీ కన్ను.. ప్లాన్ చేస్తున్న పీకే?
X
ఇటీవల ముగిసిన పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల అనంతరం టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ ఆలోచనల్లో చాలానే మార్పులువచ్చినట్లు చెబుతారు. సుదీర్ఘకాలంగా రాజకీయాల్లో ఉన్నా.. ఆమె ఇప్పటివరకు ఎప్పుడూ ఎదుర్కోని ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కారణంగా ఆమె తీవ్ర ఒత్తిడికి గురి కావటమే కాదు.. అడుగడుగునా ఇబ్బందులను ఎదుర్కొన్నారు. దీంతో.. దేశంలో బీజేపీ పాలిత రాష్ట్రాలపై ఆమె ప్రత్యేక ఫోకస్ పెట్టినట్లు చెబుతున్నారు. కొన్ని రాష్ట్రాల్లో తమ ముద్రను వేయాలన్న ఆలోచనలో ఆమె ఉన్నట్లు చెబుతున్నారు.

టీఎంసీని విస్తరించే క్రమంలో బీజేపీ పాలిత రాష్ట్రమైన త్రిపురలో ఇప్పటికే తన వ్యూహాన్ని అమలు చేస్తున్న మమత.. తాజాగా గోవా మీద కూడా ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నట్లు చెబుతున్నారు. తన టీంను గోవా పంపటం.. అక్కడి నేతలతో ఆమె చర్చలు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది. దీనికితోడు.. పీకే టీం కూడా మమతకు సాయం చేయటానికి ముందుకు రావటంతో.. వచ్చే ఏడాది జరిగే గోవా అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ పోటీ చేయాలన్న ఆలోచనలో ఉన్నట్లుగా సమాచారం.

గోవాలో ప్రస్తుతం అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. 40 అసెంబ్లీ స్థానాలు ఉన్న ఈ చిన్న రాష్ట్రంలో 2017లో ఎన్నికలు జరగ్గా.. కాంగ్రెస్ 17 స్థానాల్లో బీజేపీ 13 స్థానాల్లో విజయాన్ని సాధించాయి. కానీ.. బీజేపీనే అధికారాన్ని సొంతం చేసుకోగలిగింది. ప్రస్తుతం బీజేపీ సర్కారుపై రాష్ట్ర ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమవుతున్న వేళ.. తమ పార్టీని రంగంలోకి దించటం ద్వారా సానుకూల ఫలితాన్ని సొంతం చేసుకోవచ్చన్న ఆలోచనలో దీదీ ఉన్నారు.

ఇదిలా ఉంటే.. గోవాకు టీఎంసీ వస్తుందన్న వార్తలపై తాజాగా గోవా ముఖ్యమంత్రి.. బీజేపీ నేత ప్రమోద్ సావంత్ స్పందించారు. పోటీ చేసే వారి సంఖ్య పెరిగినప్పటికీ బీజేపీ పెద్దగా కలవరపాటుకు గురి కాదని.. అందరూ గోవాకు రావాలని.. గోవాను అందరూ ఇష్టపడతారని చెప్పారు. ఆమ్ ఆద్మీ పార్టీ కూడా గోవాలో అడుగు పెట్టటాన్ని గతంలో సావంత్ స్వాగతించారు. మరి.. గోవా రాజకీయం రానున్న రోజుల్లో ఆసక్తికరంగా మారుతుందని చెప్పక తప్పదు.