కేసీఆర్ పథకాన్ని దీదీ భలేగా కాపీ కొట్టేసిందిగా?

Tue Jul 07 2020 11:30:08 GMT+0530 (IST)

Mamata Benarjee Copied Kcr Scheme?

అప్పుడప్పుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి  కేసీఆర్ తమ ప్రభుత్వం గురించి.. తాము తీసుకొచ్చిన పథకాల గురించి గొప్పలు చెప్పుకోవటం తెలిసిందే. ఈసారి మీడియా సమావేశాన్ని నిర్వహించే సమయంలో.. తాజాగా చోటు చేసుకున్న ఉదంతాన్ని తప్పనిసరిగా ప్రస్తావిస్తారని చెప్పక తప్పదు. తెలంగాణ రాష్ట్ర సర్కారు ఏర్పడిన తర్వాత.. ప్రతి ఇంటికి నల్లా నీళ్లు అందించేందుకు వీలుగా మిషన్ భగీరధ కార్యక్రమాన్ని తెర మీదకు తీసుకురావటమే కాదు.. ఈ పథకంలో భాగంగా ఇప్పటికే పలు జిల్లాలకు పెద్ద ఎత్తున తాగునీటి అందించటం తెలిసిందే.ఈ పథకాన్ని దేశంలోని పలు రాష్ట్రాలు అధ్యయనం చేయటమే కాదు..తమ రాష్ట్రాల్లో అమలు చేస్తున్నారు. మిషన్ భగీరథ పథకాన్ని ఇప్పటికే మహారాష్ట్ర.. బిహార్.. కర్ణాటక రాష్ట్రాల్లో వేర్వేరు పేర్లతో చేపట్టారు. ఎన్నికలు ముంగిట్లోకి వచ్చేసిన వేళ.. మరోసారి తన అధికారాన్ని కాపాడుకునేందుకు వీలుగా పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి కొత్త పథకాన్ని తెర మీదకు తీసుకొచ్చారు.

రానున్న ఐదేళ్లలో బెంగాల్ లోని ప్రతి ఇంటికి సురక్షిత నీటిని అందించే ఈ కార్యక్రమానికి జల్ స్వప్న్ పేరుతో తెర మీదకుతీసుకొచ్చారు.శుభ్రపర్చిన నీటిని ప్రతి ఇంటికి ఇస్తామని.. తాగునీటి కోసం మహిళలు ఇంటి నుంచి బయటకు వెళ్లాల్సిన అవసరం లేదని.. అందుకోసం కిలోమీటర్ల కద్దీ నడవాల్సిన అవసరం లేదన్న అభయాన్ని ఇస్తున్నారు.

ఇదంతా విన్నప్పుడు మనకు అలవాటైన అంశాలే కాబట్టి కొత్తగా అనిపించవు. కానీ.. బెంగాల్ ప్రజలకు మాత్రం దీదీ సర్కారు వెల్లడించిన జల్ స్వప్న్ పథకం విపరీతంగా ఆకర్షించక మానదని చెబుతున్నారు. రానున్న ఎన్నికల్లో  తనకు మరోసారి అవకాశం ఇవ్వటం ద్వారా.. ఐదేళ్ల వ్యవధిలో రెండు కోట్ల కుటుంబాలకు మేలు చేసేలా తమ పథకం అమలవుతుందని నమ్మకంగా చెబుతున్నారు. బెంగాల్ రాష్ట్రంలో ఎన్నికలకు మరికొద్ది నెలలే మిగిలిన నేపథ్యంలో ఈ పథకం అంతో ఇంతో ప్రభావాన్ని చూపటం ఖాయమంటున్నారు. కేసీఆర్ సర్కారు అమలు చేసిన మిషన్ భగీరథ కాన్సెప్టు బెంగాలీ ప్రజలను ఎంతమేర ప్రభావితం చేస్తుంది? ఏ మేరకు ఓట్లు రాలుస్తుందన్న విషయంపై క్లారిటీ రావాలంటే మరికొంత కాలం వెయిట్ చేయాల్సిందే.