మమతా బెనర్జీకి గట్టి షాక్ ఇచ్చిన ఎగ్జిట్ పోల్స్!

Sun May 19 2019 22:36:36 GMT+0530 (IST)

Mamata Banerjee Shock with Exit Polls

ఎగ్జిల్ పోల్స్ సంచలన రీతిలో ఉన్నాయి. కేంద్రంలో మళ్లీ ఎన్డీయేనే అని చెబుతున్నాయి అన్ని ఎగ్జిట్ పోల్స్ కూడా. మరింత విశేషం ఏమిటంటే..గతంలో పోలిస్తే ఈ సారి బీజేపీ కూటమికి మరింత అదనంగా ఎంపీ సీట్లు  దక్కుతాయని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేస్తూ ఉండటం. అసలు ఫలితాలు ఎలా ఉంటాయో కానీ.. ఎగ్జిట్ పోల్స్ మాత్రం సంచలనంగా నిలుస్తున్నాయి.అలాంటి సంచనాల్లో ఒకటి పశ్చిమ బెంగాల్ లో చోటు చేసుకుంటుందని వివిధ వార్తా సంస్థల ఎగ్జిట్ పోల్స్ చెబుతూ ఉన్నాయి. పశ్చిమ బెంగాల్ లో భారతీయ జనతా పార్టీ భారీ స్థాయిలో ఎంపీ సీట్లను సాధిస్తుందని వివిధ అధ్యయనాలు చెబుతూ ఉండటం ఆసక్తిదాయకంగా ఉంది. అక్కడ  టీఎంసీ మెజారిటీ  ఎంపీ సీట్లను సాధిస్తుందని ముప్పై వరకూ ఆ పార్టీ ఎంపీ సీట్లను సొంతం చేసుకునే అవకాశం ఉందని ప్రీ పోల్ సర్వేలు పేర్కొన్నాయి.

అయితే ఎగ్జిట్ పోల్స్ భిన్నంగా ఉన్నాయి. బెంగాల్ లో బీజేపీ భారీ స్థాయిలో ఎంపీ సీట్లను నెగ్గనుందని.. టీఎంసీకి సరి సమానమైన స్థాయిలో ఆ పార్టీకి సీట్లు లభిస్తాయని  ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. బీజేపీకి 19 నుంచి 23 సీట్లు వచ్చే అవకాశం ఉందని టీఎంసీకి కూడా 19 నుంచి 23 సీట్లే వచ్చే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి.

ప్రీ పోల్ సర్వేల్లోనేమో బీజేపీకి పది ఎంపీ సీట్లు దక్కడం కూడా గగనం అన్నారు. పోస్ట్ పోల్ అంచనాల్లో మాత్రం కమలం పార్టీ  బెంగాల్ లో మమతా బెనర్జీకి  గట్టి షాక్ ఇస్తుందని మీడియా సంస్థలు చెబుతున్నాయి!